Devul Bandh 2 : మరాఠీ చిత్రం సంచలనం..రూ.9 కోట్లతో నిర్మాణం..9 రోజుల్లో రూ.40 కోట్ల వసూలు

పెద్ద అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరాఠీ చిత్రం దేవూల్‌ బంద్‌ 2 కేవలం మౌత్‌ టాక్‌తోనే భారీ విజయాన్ని అందుకుంది. రూ.9 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై తొమ్మిది రోజుల్లోనే దాదాపు రూ.40 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

New Update
FotoJet (56)

Devul Bandh 2

Devul Bandh 2 :  ప్రాంతీయ చిత్రాల సత్తా మరోసారి బాక్సాఫీస్‌ వద్ద నిరూపితమైంది. పెద్ద అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరాఠీ చిత్రం దేవూల్‌ బంద్‌ 2 కేవలం మౌత్‌ టాక్‌తోనే భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడు ప్రవీణ్‌ తార్డే తెరకెక్కించిన ఈ చిత్రం మే 21న విడుదలై, సుమారు రూ.9 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై తొమ్మిది రోజుల్లోనే దాదాపు రూ.40 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రారంభంలో 1,100 స్క్రీన్‌లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాదరణ పెరగడంతో మరో 600 స్క్రీన్‌లను జోడించారు.

ఈ చిత్రంలో స్నేహల్‌ తార్డే , మోహన్‌ జోషి కీలక పాత్రలు పోషించారు. కథలో సంగీత పేగుడే అనే మహిళా రైతు జీవితాన్ని చూపించారు. అనేక కష్టాలు ఎదుర్కొంటూ దేవుడిని ప్రార్థించే ఆమెకు ఆశించిన మార్పు రాకపోవడంతో ఒక రోజు ఆవేదనలో చేసిన చర్య అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంది. అనంతరం ఆమెకు శ్రీస్వామి సమర్థ్‌ దర్శనమివ్వడం, అయితే ఆ స్వామి ఆమెకే కనిపించడం వల్ల గ్రామస్తులు ఆమెను అపార్థం చేసుకోవడం కథలో ప్రధానాంశంగా నిలుస్తుంది. విశ్వాసం, బాధ, భావోద్వేగాలు, సామాజిక దృక్కోణాల మధ్య జరిగే సంఘర్షణను దర్శకుడు హృద్యంగా ఆవిష్కరించారు.

సినిమా విజయంతో పాటు చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక షెడ్యూల్‌లో చిత్రబృందం దాదాపు 33 గంటల పాటు విరామం లేకుండా షూటింగ్‌ నిర్వహించిందని నటుడు మోహన్‌ జోషి వెల్లడించారు. ఒక సన్నివేశం తర్వాత మరొకటి చిత్రీకరిస్తూ వెళ్లడంతో సమయం గడుస్తున్న విషయం ఎవరికీ పెద్దగా గుర్తించలేదని ఆయన చెప్పారు. చివరకు తానే దర్శకుడి వద్దకు వెళ్లి ఇప్పటికే 30 గంటలకు పైగా షూటింగ్‌ జరుగుతోందని చెప్పగా, ఇంకా కొన్ని షాట్లు పూర్తి చేసి షెడ్యూల్‌ను ముగించాలని నిర్ణయించారని వివరించారు.

ఈ విషయంపై స్పందించిన స్నేహల్‌ తార్డే, ఇండోర్‌ సెటప్‌లో సాగిన షూటింగ్‌ కారణంగా సమయం తెలియకుండా పోయిందన్నారు. మొదట గ్రామస్థులను జూనియర్‌ ఆర్టిస్టులుగా తీసుకున్నప్పటికీ, ఎక్కువ సమయం కావడంతో వారు వెళ్లిపోయారని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడి స్నేహితులు, కారు డ్రైవర్లకే జూనియర్‌ ఆర్టిస్టుల దుస్తులు వేసి చిత్రీకరణ కొనసాగించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. షూటింగ్‌ ఎప్పుడు ముగుస్తుందో దర్శకుడిని అడగడానికి అందరికీ సంకోచం ఉండటంతో చివరకు ఆ బాధ్యతను మోహన్‌ జోషి తీసుకున్నారని ఆమె నవ్వుతూ చెప్పారు. ఈ సంఘటన చిత్రబృందం అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది.

Advertisment
తాజా కథనాలు