/rtv/media/media_files/2026/04/01/up-ias-2026-04-01-15-41-26.jpg)
యూపీకి చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రింకు సింగ్ రాహి తన పదవికి రాజీనామా చేశారు. తనకు చాలా కాలంగా ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులు ఇస్తున్నారని, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పేరుకే తనను ఒక విభాగంలో ఉంచి, పని లేకుండా ఖాళీగా కూర్చోబెట్టారని ఆయన ఆరోపించారు. నెలకు జీతం వస్తున్నా, ప్రజల కోసం పనిచేయలేకపోతున్నాననే బాధతోనే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు.
గత ఏడాది జూలైలో షాజహాన్‌పూర్‌లో లాయర్లు నిరసన తెలుపుతుండగా, రింకు సింగ్ రాహి గుంజీలు తీస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసి, యూపీ రెవెన్యూ బోర్డుకు అటాచ్ చేసింది. నిజానికి ఐఏఎస్ కాకముందే ఆయన ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ (పీసీఎస్) అధికారిగా ముజఫర్‌నగర్ సంక్షేమ శాఖలో పనిచేశారు. అక్కడ జరుగుతున్న ఒక పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టినందుకు, గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఆయన శరీరంలోకి ఏడు బుల్లెట్లు దూసుకెళ్లినా ప్రాణాలతో బయటపడటం గమనార్హం.
2025 జూలై 28న రింకు సింగ్ రాహిని షాజహాన్‌పూర్ జిల్లాలోని పువాయన్ ప్రాంతానికి ఎస్డీఎంగా నియమించారు. అయితే బాధ్యతలు చేపట్టిన కేవలం 36 గంటల్లోనే ప్రభుత్వం ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. అప్పటి నుంచి ఆయనకు సరైన బాధ్యతలు అప్పగించలేదు. ఒక నిజాయితీ గల అధికారికి పని ఇవ్వకుండా పక్కన పెట్టడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
తీవ్ర ఆగ్రహం
ఈ వ్యవహారంపై నగినా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత ఐఏఎస్ అధికారి వివక్షకు గురై రాజీనామా చేయాల్సి రావడం వ్యవస్థకే సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 2009లో అవినీతిని ఎదిరించి, ఏడు బుల్లెట్లు తగిలినా వెనక్కి తగ్గకుండా వ్యవస్థలో ఉండి సేవ చేయాలని భావించిన వ్యక్తికి నేడు పని లేకుండా చేసి బయటకు పంపడం బాధాకరమని అన్నారు. ఇది కేవలం ఒక అధికారి వ్యక్తిగత నిర్ణయం కాదని, మన పరిపాలనా వ్యవస్థలో ఉన్న లోపాలకు నిదర్శనమని ఆజాద్ సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు.
Follow Us