/rtv/media/media_files/2026/04/03/himachal-2026-04-03-07-58-34.jpg)
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఒక సంచలన బిల్లును ఆమోదించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అనర్హతకు గురయ్యే ఎమ్మెల్యేలకు ఇకపై పెన్షన్ రాకుండా చేసేలా 'హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సవరణ బిల్లు-2026'ను తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా 1971 నాటి పాత చట్టానికి మార్పులు చేశారు. దీని ప్రకారం, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ఫిరాయింపుల కారణంగా ఏ ఎమ్మెల్యే అయినా తన పదవిని కోల్పోతే, వారికి అందే పెన్షన్ ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేస్తుంది.
ప్రజా తీర్పును గౌరవించేందుకు, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి సుఖు స్పష్టం చేశారు. పాత చట్టంలో ఫిరాయింపులను అడ్డుకునే బలమైన నిబంధనలు లేవని, అందుకే ఈ మార్పు అవసరమైందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న బీజేపీపై ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాల తీరు 'ఆపరేషన్ లోటస్' వంటి చర్యలను ప్రోత్సహించేలా ఉందని, ప్రజాస్వామ్యం అంగడి సరుకు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
జైరామ్ ఠాకూర్ తీవ్ర అభ్యంతరం
అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని, కేవలం కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చిందని ఆయన ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగినా దానికి ఆమోదం లభించలేదని, ఇప్పుడు మళ్లీ దీన్ని తీసుకురావడంలో దురుద్దేశం ఉందని ఆయన విమర్శించారు. ఈ చట్టం కోర్టులో నిలబడదని కూడా ప్రతిపక్షం వాదించింది.
మరోవైపు అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈ బిల్లును సమర్థించారు. పార్టీ ఫిరాయింపులను అరికట్టడంలో ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే.. 2024 రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేసిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చైతన్య శర్మ, దేవేందర్ కుమార్ భుట్టోల పెన్షన్లు నిలిచిపోనున్నాయి. సాధారణంగా ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వారికి నెలవారీ పెన్షన్ లభిస్తుంది, కానీ ఇకపై ఫిరాయింపుదారులకు ఆ అవకాశం ఉండదు.
Follow Us