/rtv/media/media_files/2026/05/10/fotojet-2026-05-10-12-21-40.jpg)
First signature on free electricity
Tamil Nadu CM Vijay : తమిళనాడు రాజకీయ యవనికపై ఒక నూతన శకం ఆరంభమైంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదివారం (మే 10, 2026) అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ చారిత్రాత్మక వేడుకలో విజయ్‌తో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ రంగానికి చెందిన ఉద్ధండులు హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు హాజరై విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్టేడియం లోపలే కాకుండా, వెలుపల కూడా లక్షలాది మంది అభిమానులు తమ అభిమాన నటుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతుంటే ఆనందంతో కేరింతలు కొట్టారు. చెన్నై నగరం మొత్తం 'దళపతి' నినాదాలతో మారుమోగిపోయింది.
తొలి సంతకాలతోనే సంచలనం – సామాన్యుడికి పెద్ద పీట
ప్రమాణస్వీకారం పూర్తి చేసిన వెంటనే సీఎం విజయ్ నేరుగా పాలనపై తన మార్క్ చూపించారు. తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వేదికపైనే వరుసగా మూడు కీలక దస్త్రాలపై సంతకాలు చేసి సంచలనం సృష్టించారు.ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు '200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్' పథకానికి సంబంధించిన ఫైలుపై ఆయన తన తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. పాలనలో తన ప్రాధాన్యత సామాన్యుల సంక్షేమమేనని ఈ తొలి సంతకంతో విజయ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ముఖ్యంగా మహిళా రక్షణకు కట్టుబడి ఉంటామని చాటుతూ 'మహిళా భద్రత' అత్యవసర ఫైలుపై రెండవ సంతకం చేశారు.యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే 'ఈగల్ తరహా ప్రత్యేక విభాగం' దస్త్రంపై మూడో సంతకం చేశారు.
ఎన్నో కష్టాలు పడి వచ్చా" - ఉద్వేగభరిత ప్రసంగం
"ఒక సామాన్య సినిమా డైరెక్టర్ కుమారుడు నేడు మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాడు" అంటూ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన ప్రసంగాన్ని అత్యంత భావోద్వేగంగా ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, తన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను, తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేశారు."ఈ స్థాయికి రావడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు, అడ్డుకోవాలని చూశారు. కానీ, వాటన్నింటినీ అధిగమించి ఈ రోజు మీ ముందు నిలబడ్డాను. నేను మీ అందరి వాడిని. ఈ విజయం వెనుక నా పార్టీ కార్యకర్తల అలుపెరుగని కృషి ఉంది, వారికి జీవితాంతం రుణపడి ఉంటాను" అని విజయ్ పేర్కొన్నారు.
తన ప్రభుత్వంలో కులమతాలకు తావులేదని విజయ్ స్పష్టం చేశారు. తాము ఎలాంటి కక్షసాధింపు రాజకీయాలకు పోమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు, మహిళలు, విద్యార్థులకు తన ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని చెప్తూ.. "విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు.. మీ 'విజయ్ మామ' మీకు తోడుగా ఉంటాడు" అని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని, ప్రస్తుతం రాష్ట్రం దాదాపు రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని ఆరోపించారు. అసలు వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే త్వరలోనే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై 'శ్వేతపత్రం' (White Paper) విడుదల చేస్తామని ప్రకటించారు. "నేను ప్రజల సొమ్మును వృథా చేయను, ఎవరినీ దోచుకోనివ్వను" అని విజయ్ గట్టిగా చెప్పారు.రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడమే తన మొదటి లక్ష్యమని చెబుతూ.. "ఈ రోజు నుంచే డ్రగ్స్‌పై మా పోరాటం మొదలవుతుంది" అని స్పష్టం చేశారు.
"నేనే పవర్ సెంటర్.. రెండో వ్యక్తికి చోటు లేదు"
ఇదే సమయంలో తన పార్టీ (TVK) నాయకులను, నూతన మంత్రులను హెచ్చరిస్తూ విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఎవరూ అహంకార ధోరణి ప్రదర్శించొద్దు. ఈ ప్రభుత్వంలో నేనే పవర్ సెంటర్, రెండో పవర్ సెంటర్‌కు ఇక్కడ చోటు లేదు" అని నిరంకుశత్వానికి, అవినీతికి తావులేదని పరోక్షంగా హెచ్చరించారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రతి పైసా లెక్క పారదర్శకంగా ఉంటుందని విజయ్ ప్రజలకు భరోసా ఇచ్చారు.
పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే, తన మేనిఫెస్టోతో ప్రజల మనసు గెలుచుకున్న విజయ్.. తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించారు. దశాబ్దాలుగా ఉన్న ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని కాదని తమిళ ప్రజలు విజయ్‌కు పట్టం కట్టడం విశేషం. దశాబ్దాల రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, అభివృద్ధి పథంలో తమిళనాడును నడిపిస్తానని ఆయన శపథం చేశారు. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. విజయ్ తన క్యాబినెట్ మంత్రులతో కలిసి త్వరలోనే పూర్తిస్థాయిలో పాలనపై సమీక్ష నిర్వహించనున్నారు.
Follow Us