MK Stalin : స్టాలిన్ సై అంటే.. తమిళనాడులో సరికొత్త రాజకీయం!

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించిన క్లైమాక్స్ నడుస్తోంది. ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చినా, ముఖ్యమంత్రి పీఠం ఎవరిదనే విషయంలో ఇప్పటికీ డెడ్ లాక్ కొనసాగుతోంది.

New Update
mk stalin

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించిన క్లైమాక్స్ నడుస్తోంది. ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చినా, ముఖ్యమంత్రి పీఠం ఎవరిదనే విషయంలో ఇప్పటికీ డెడ్ లాక్ కొనసాగుతోంది. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్ (టీవీకే), తనదైన శైలిలో పావులు కదుపుతున్నా.. అనుకున్నంత వేగంగా అడుగులు ముందుకు పడటం లేదు.

అతిపెద్ద పార్టీగా తనకే అవకాశం ఇవ్వాలని విజయ్ గవర్నర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ (5 ఎమ్మెల్యేలు) మద్దతు ప్రకటించినా, మేజిక్ ఫిగర్ 118కి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల దూరం ఉంది. ఇక్కడే డీఎంకే, అన్నాడీఎంకేలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా విజయ్ వైపు వెళ్లకుండా స్టాలిన్, పళనిస్వామి చక్రబంధం బిగించారు. విజయ్‌కు మద్దతు ఇవ్వాలని లోలోపల ఉన్నా.. ద్రవిడ నీడను వదిలి బయటకు రావడానికి సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలు భయపడుతున్నాయి.

దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉండే డీఎంకే, అన్నాడీఎంకేలు ఇప్పుడు కలవబోతున్నాయా? అంటే 'అవును' అనే సంకేతాలు అందుతున్నాయి. 118 మంది ఎమ్మెల్యేల బలంతో పళనిస్వామి గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. డీఎంకేతో నేరుగా పొత్తు లేకపోయినా బయట నుంచి మద్దతు ఇచ్చేలా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. డీఎంకే అధికార ప్రతినిధుల మాటలు వింటుంటే.. స్టాలిన్ తీసుకునే కఠిన నిర్ణయానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. విజయ్ కనుక పవర్ లోకి వస్తే మరో ఎంజీఆర్ అవుతారని, అప్పుడు తమ రెండు పార్టీల ఉనికికే ప్రమాదమని వారు భయపడుతున్నారు.

ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని

అయితే, ఈ కూటమి ఏర్పాటులో స్టాలిన్ కొంత ఊగిసలాడుతున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటూ విజయ్‌కు ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయన్ని కాదని తాము చేతులు కలిపితే, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, విజయ్‌పై సానుభూతి పెరిగి భవిష్యత్తులో తమకు దెబ్బ తగులుతుందని స్టాలిన్ ఆలోచిస్తున్నారు. అందుకే ఆయన నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు కట్టుబడి ఉండాలని తన ఎమ్మెల్యేలకు ముందే వార్నింగ్ ఇచ్చారు.

ప్రస్తుతానికి గవర్నర్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో, ఆయన మొదట విజయ్‌నే ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలిచే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోలేకపోతే.. అప్పుడు డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ పేరుతో సీన్‌లోకి వస్తాయి. విజయ్ వైపు వెళ్లాలని చూస్తున్న వామపక్షాలకు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండని స్టాలిన్ పరోక్షంగా హెచ్చరించినట్లు సమాచారం.

తమిళనాడులో ఇప్పుడు రాజకీయ అనిశ్చితి పీక్ స్టేజ్‌లో ఉంది. ఒకవైపు తన ఎమ్మెల్యేల రాజీనామా అస్త్రంతో విజయ్ బెదిరిస్తుంటే.. మరోవైపు పాత వైరాన్ని పక్కన పెట్టి ద్రవిడ కోటను కాపాడుకోవాలని డీఎంకే, అన్నాడీఎంకే చూస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఎడప్పాడి పళనిస్వామి గవర్నర్‌ను కలిస్తే, ఈ పజిల్ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. తమిళ తంబీలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి!

Advertisment
తాజా కథనాలు