Sabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు..భక్తులతో కిటకిటలాడిన క్యూలైన్లు

గతంలో ఎన్నడులేని విధంగా శబరిమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. మండల మకరవిలక్కు వార్షిక తీర్థయాత్ర నేపథ్యంలో అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తొలి రెండు రోజుల్లోనే రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరి చేరుకున్నారు.

New Update
FotoJet - 2025-11-19T080400.237

Devotees flock to Sabarimala.

Sabarimala: గతంలో ఎన్నడులేని విధంగా శబరిమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. మండల- మకరవిలక్కు వార్షిక తీర్థయాత్ర నేపథ్యంలో అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. గతానికి భిన్నంగా తొలి రెండు రోజుల్లోనే దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరి చేరుకున్నారు. పంబ నుంచి సన్నిధానం మార్గం వరకు విపరీతమైన రద్దీ నెలకొంది. రద్దీని నియంత్రించడానకి ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎక్కుతూ భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.  రద్దీ నియంత్రణ విషయంలో దేవస్థానం బోర్డు, ప్రభుత్వం వైఫల్యం చెందిందని భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తుల రద్దీకి తగినట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని విమర్శలు వస్తున్నాయి. 

పంబ నంచి ఆలయ ప్రాంగణం వరకు ఇసుకేస్తే రాలనంత భక్తులు నిండిపోయారు. కాగా భక్తుల రద్దీని నియంత్రించడం  ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. దర్శనం చేసుకుని వచ్చే భక్తులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.కొండపై వెళ్లే దారిలో గంటలు తరబడి నిలబడడం, సరైన సమాచార వ్యవస్థ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  కాగా ఆలయ ప్రాంగణంలో ఇంత పెద్ద ఎత్తున జనసమూహాన్ని తాను ఎప్పుడూ చూడలేదని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె.జయకుమార్‌ అభిప్రాయపడ్డారు. ‘‘కొంతమంది క్యూలైన్లను తప్పించుకుని వస్తున్నట్లు కనిపిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రద్దీ నియంత్రణ కోసం నీలక్కల్, ఇతర ప్రదేశాల్లో భక్తులు ముందుకు కదలకుండా తాత్కాలికంగా ఆంక్షలు విధించామని తెలిపారు. నీలక్కల్‌లో ఏడు అదనపు స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శబరిమల ప్రవేశాన్ని రోజుకు లక్ష మందికి, స్పాట్ బుకింగ్‌లను రోజుకు 20 వేల మందికి పరిమితం చేస్తామని.  తద్వారా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి’’ అని  ఆయన వెల్లడించారు.

అయితే గతంలో నాలుగు వేర్వేరు రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష చొప్పున దాటింది. కానీ, ఈసారి  రెండు రోజుల్లోనే దాదాపు రెండు లక్షల మంది వచ్చారు. అయినా శబరిమలలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఏడీజీపీ శ్రీజిత్ వివరించారు. స్పాట్‌ బుకింగ్‌ల కోసం ఎక్కువ మంది రావడం, వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్నవారు బుక్‌ చేసుకున్న రోజు రాకపోవడం, క్యూలైన్లను తప్పించుకోవడం వంటివి రద్దీకి కారణమవుతున్నాయని ఏడీజీపీ తెలిపారు. రద్దీ నియంత్రణకు తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. మరోవైపు, భక్తుల కోసం దేవస్థానం బోర్డు అధికారులు సరైన  ఏర్పాట్లు చేయలేదని, రద్దీ నియంత్రణలో ప్రభుత్వం  వైఫల్యం చెందారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడినా భక్తులకు  కనీసం నీళ్లు అందించడం లేదనే విమర్శులు ఉన్నాయి. సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం, టీడీబీ విఫలమయ్యాయని కేరళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీడీ సతీశన్ ఆరోపించారు.  

 ముఖ్యమైన రోజులు

ఈ పండుగ సీజన్‌లో ఆలయం ప్రతిరోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. రోజువారీ పూజలు, దర్శనం కార్యక్రమాలు ‘హరివరాసనం’ పారాయణంతో ముగుస్తాయి.

మండల పూజ: డిసెంబర్ 27న మండల పూజ నిర్వహించనున్నారు. ఆ రాత్రి ఆలయాన్ని మూసివేస్తారు.

తిరిగి తెరవడం: రెండు రోజుల విరామం తర్వాత, డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు.

మకరవిళక్కు: జనవరి 14న మకరవిళక్కు వేడుకలు జరుగుతాయి. ఇందులో మాలికప్పురం వద్ద ఎళున్నెళిప్పు, పది పూజ, కళభాభిషేకం, గురుతి పూజ వంటి ప్రధాన ఘట్టాలు ఉంటాయి.

 Also Read: Bangla-Pak: యూనస్, ఆసిఫ్ మునీర్‌లు కలిసి భారత్ పై కుట్ర..అందుకే షేక హసీనాకు మరణశిక్ష?

Advertisment
తాజా కథనాలు