/rtv/media/media_files/2026/05/08/tvk-chief-vijay-2026-05-08-21-43-40.jpg)
TVK Chief CM Vijay
CM Vijay : తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ సోమవారం జరిగిన ఉన్నత స్థాయి మంత్రివర్గ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, రైతులకు, సినీ పరిశ్రమకు ఊరటనిచ్చే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోఆపరేటివ్ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాల మాఫీతో పాటు, సినిమా ప్రదర్శనలు, అంతర్రాష్ట్ర జల వివాదాలు, శాంతిభద్రతలపై సీఎం విజయ్ తనదైన శైలిలో ముద్ర వేశారు.
1. రైతులకు మెగా గుడ్‌న్యూస్.. రూ.2,044 కోట్ల రుణమాఫీ!
రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు భారీ ఉపశమనం కలిగిస్తూ ముఖ్యమంత్రి విజయ్ పంట రుణాల మాఫీని ప్రకటించారు. సహకార బ్యాంకుల (Cooperative Banks) ద్వారా రూ.50,000 వరకు పంట రుణాలు తీసుకున్న సన్నకారు రైతులకు రుణాన్ని పూర్తిగా మాఫీ చేయనున్నారు.రూ.50 వేలకు పైబడి రుణాలు తీసుకున్న రైతులకు 50 శాతం మేర రుణమాఫీ వర్తిస్తుంది. ఈ రుణమాఫీ కేవలం 2025 మే 1 నుండి 2026 ఫిబ్రవరి 28 మధ్యకాలంలో సహకార బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల తమిళనాడు వ్యాప్తంగా 14.22 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.2,044 కోట్ల అదనపు భారం పడనుందని సీఎం విజయ్ స్వయంగా వెల్లడించారు.
2. అనుమతి లేకుండానే 'ఐదో షో'!
సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా సీఎం విజయ్ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విడుదలయ్యే ప్రతి తమిళ సినిమాకు మొదటి వారం పాటు రోజుకు ఐదు షోలు (5 Shows) ప్రదర్శించుకునేలా అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు కొత్త సినిమాలు విడుదలైనప్పుడు అదనపు షోలు వేసుకోవాలంటే థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతలు ముందుగా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుని అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై ఎలాంటి ప్రభుత్వ ముందస్తు అనుమతులు లేకుండానే.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, థియేటర్ల యజమానుల అంతర్గత నిర్ణయం మేరకు అదనపు షోలను (5వ షో) ప్రదర్శించుకోవచ్చని సీఎం ప్రకటించారు. ఈ నిర్ణయం చిత్ర పరిశ్రమకు పెద్ద ఊరటనివ్వనుంది.
3. మేకేదాటు ప్రాజెక్టుపై లీగల్ పోరాటానికి సిద్ధం
కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 'మేకేదాటు ప్రాజెక్టు' అంశంపై ముఖ్యమంత్రి విజయ్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమిళనాడు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అక్కడ ప్రాజెక్టు కడితే తమిళనాడుకు రావాల్సిన నీటి వాటా తగ్గిపోయి, తమ రాష్ట్ర రైతులు నష్టపోతారనేది ప్రభుత్వ వాదన. ఇటీవల కర్ణాటకలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూమిపూజ జరగడం, ఈ వివాదానికి సంబంధించిన ప్రస్తుత లీగల్ స్టాటస్‌ను అధికారులు సీఎంకు వివరించారు. కోర్టుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, సమగ్ర సంప్రదింపుల అనంతరం కర్ణాటకపై తీసుకోవాల్సిన చట్టపరమైన (లీగల్) చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
4. 'పోక్సో' కోర్టు తీర్పుపై హర్షం.. మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నాం!
తమిళనాడులోని విలాతికుళం ప్రాంతంలో జరిగిన 12వ తరగతి విద్యార్థిని హత్యాచారం కేసులో పోక్సో (POCSO) ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పును సీఎం విజయ్ స్వాగతించారు. ఈ కేసులో నిందితుడు 'ధర్మ మునీశ్వరన్'కు కోర్టు రెండు మరణ శిక్షలు (Double Death Penalty) విధించడాన్ని ఆయన ప్రస్తావించారు. బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం జరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని విజయ్ అన్నారు. ఘటన జరిగిన మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేయడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. తమ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణకు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
Follow Us