BIG BREAKING: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ వేళ సుప్రీం సంచలన తీర్పు!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ కు, మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ కేంద్రాల్లో పర్యవేక్షకులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదంటూ టీఎంసీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

New Update
FotoJet - 2026-05-02T113747.124

Big shock for Mamata Banerjee

BIG BREAKING: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 'మైక్రో అబ్జర్వర్లుగా' కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (PSU) సిబ్బందిని మాత్రమే నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల నిర్వహణలో ఈసీకి ఉన్న విచక్షణాధికారాలను కోర్టు ఈ సందర్భంగా సమర్థించింది.

ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో పర్యవేక్షకులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదనడానికి బలమైన కారణాలేమీ లేవని కోర్టు అభిప్రాయపడింది. "ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో భాగంగానే పని చేస్తారు తప్ప, వారికి ప్రత్యేకంగా రాజకీయ విధేయతలు ఉండవు. వారు కేవలం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారు" అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై టీఎంసీ నేతలు నమ్మకం ఉంచాలని హితవు పలికింది.

ఎన్నికల సంఘం జారీ చేసిన ఏప్రిల్ 13 నాటి సర్క్యులర్ రాజ్యాంగబద్ధంగానే ఉందని, అందులో నిబంధనల ఉల్లంఘన ఏమీ లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ కోసం సిబ్బందిని ఏ వర్గం నుంచి ఎంచుకోవాలనేది పూర్తిగా ఎన్నికల సంఘం నిర్ణయమని, ఈ విషయంలో రాజకీయ పార్టీలను సంప్రదించాల్సిన అవసరం ఈసీకి లేదని సర్వోన్నత న్యాయస్థానం వివరించింది. అంతేకాకుండా, లెక్కింపు కేంద్రాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఉంటారు కాబట్టి, పారదర్శకతకు భయం అక్కర్లేదని పేర్కొంది.

అంతకుముందు, కోల్‌కతా హైకోర్టు కూడా ఈ విషయంలో టీఎంసీ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా మమతా బెనర్జీకి నిరాశే ఎదురైంది. సోమవారమే (మే 4, 2026) ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్న తరుణంలో, ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ఈసీ జారీ చేసిన నిబంధనల ప్రకారమే, కేంద్ర ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Advertisment
తాజా కథనాలు