మనుషుల ప్రాణాలను రక్షించే 36 మందులపై విధించే పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు నిర్మిస్తామన్నారు. క్యాన్సర్ చికిత్సకు మందులు తక్కువ ధరకే లభిస్తాయని తెలిపారు. 6 ప్రాణాలను రక్షించే మందులపై కస్టమ్ డ్యూటీని 5 శాతానికి తగ్గించనున్నట్లుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీతారామన్ వెల్లడించారు. మరోవైపు10,000 కోట్ల ప్రభుత్వ సహకారంతో స్టార్టప్‌ల కోసం నిధులు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఐదు లక్షల మంది మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తొలిసారిగా రూ.2 కోట్ల రుణం అందించనుందని తెలిపారు.
ఈ బడ్జెట్‌లో బీహార్‌కు ఆర్థిక మంత్రి అనేక పెద్ద ప్రకటనలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల సౌకర్యాన్ని కల్పిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. పాట్నా ఎయిర్‌పోర్టు సామర్థ్యం విస్తరణకు ఇవి అదనం. మిథిలాంచల్‌లోని వెస్ట్రన్ కాస్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కూడా ఇందులో ఉంది. ఐఐటీ సామర్థ్యాన్ని పెంచినట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. 5 IITలలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని... అలాగే ఐఐటీ పాట్నాను కూడా విస్తరిస్తామని వెల్లడించారు.