/rtv/media/media_files/xVFPSt7fuyoxph7SWof2.jpg)
Banks closed for 5 consecutive days
Banks closed : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. రాబోయే రోజుల్లో బ్యాంకు లావాదేవీలు ఉన్నవారు ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ నెల 25, 26 తేదీల్లో (సోమవారం, మంగళవారం) ఎస్‌బీఐ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ సమ్మె గనుక జరిగితే, వారాంతపు సెలవులు,పండుగ సెలవులతో కలుపుకుని వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తన 52 కోట్ల మంది ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఒక కీలక విజ్ఞప్తిని జారీ చేసింది.
— State Bank of India (@TheOfficialSBI) May 22, 2026
వరుసగా 5 రోజులు...
ఈ వారం చివరి నుండి బ్యాంకులు వరుసగా ఐదు రోజుల పాటు మూతపడనున్నాయి. మే 23 (శనివారం): నెలలోని నాలుగో శనివారం కావడం వల్ల బ్యాంకులకు సాధారణ సెలవు.మే 24 (ఆదివారం): వారంతపు సెలవు. మే 25 (సోమవారం): ఆలిండియా ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్ పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మె మొదటి రోజు. మే 26 (మంగళవారం): ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె రెండవ రోజు.మే 27 (బుధవారం): బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులకు ప్రభుత్వ సెలవు. ఈ ఐదు రోజుల సుదీర్ఘ విరామం వల్ల దేశవ్యాప్తంగా కోట్ల మంది కస్టమర్లపై, ముఖ్యంగా చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్లు, లోన్ ప్రక్రియలపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఆలిండియా ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) ఆధ్వర్యంలో ఈ సమ్మెను చేపట్టనున్నారు. యాజమాన్యం తమ సుదీర్ఘ డిమాండ్లను పరిష్కరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. బ్యాంకు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. తగిన సంఖ్యలో క్లర్కులు, మెసెంజర్లు ,సాయుధ గార్డులను (Armed Guards) తక్షణమే నియమించాలి. బ్యాంకులో శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన పనులను ఉద్యోగాలను పొరుగు సేవలకు (Outsourcing) అప్పగించడాన్ని పూర్తిగా నిలిపివేయాలి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఉన్న ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను స్వయంగా ఎంచుకునే అవకాశాన్ని (మార్చుకునే వెసులుబాటును) కల్పించాలి. అనే ప్రధాన డిమాండ్లతో ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు.
ప్రత్యామ్నాయాలు ఇవే!
భారత బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు ఐదో వంతు (20%) కార్యకలాపాలు ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానే సాగుతుంటాయి. ఇంతటి భారీ నెట్‌వర్క్ ఉన్న ఎస్‌బీఐలో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర బ్యాంకింగ్ సేవల కోసం కస్టమర్లు డిజిటల్ మరియు ఆన్‌లైన్ మార్గాలను ఆశ్రయించాలని బ్యాంక్ కోరింది.
నగదు ఉపసంహరణల కోసం ఏటీఎం (ATM) సేవలను ఉపయోగించుకోవాలి.గ్రామీణ,అర్ధ-పట్టణ ప్రాంతాల్లోని కస్టమర్ సర్వీస్ పాయింట్లు (CSP/డిజిటల్ మిత్ర) ద్వారా సేవలు పొందవచ్చు.నిధుల బదిలీ, ఇతర సేవల కోసం యోనో (YONO) యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగించుకోవాలి.రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ (UPI) వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వాడుకోవాలని సూచించింది. ఈ మేరకు ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా, తమ దేశవ్యాప్త 23,200 బ్యాంక్ శాఖల్లో అత్యవసర సేవల నిర్వహణకు గానూ అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌బీఐ యాజమాన్యం తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించింది.
Follow Us