NIFT 2026 Leak : ఎగ్జామ్‌కు వెళ్లకపోయినా ప్రెజెంట్.. పరీక్ష రాసినోళ్లకు ఆబ్సెంట్ : NTA దెబ్బకు విద్యార్థులు షాక్!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మళ్లీ వార్తల్లోకెక్కింది. నీట్ వివాదం మరువక ముందే.. ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT 2026) ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలపైనా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి

New Update
nta

దేశంలో అతిపెద్ద ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మళ్లీ వార్తల్లోకెక్కింది. నీట్ వివాదం మరువక ముందే.. ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT 2026) ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలపైనా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 3న విడుదలైన నిఫ్ట్ ఫలితాల్లో స్కోర్‌కార్డులు తారుమారయ్యాయని, అసలు పరీక్ష రాయకపోయినా ప్రెజెంట్ అని వేసినట్లు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు.

నిఫ్ట్ ప్రవేశాల ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో జనరల్ ఎబిలిటీ టెస్ట్, క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈసారి 100 మార్కులకు జరిగిన క్యాట్ పేపర్‌లో చాలా అద్భుతంగా రాసిన విద్యార్థులకు సైతం కేవలం 15 నుంచి 17 మార్కులు మాత్రమే వేయడం గమనార్హం. సాధారణంగా గాట్ పరీక్షకు అఫీషియల్ ఆన్సర్ కీ విడుదల చేసే ఎన్‌టీఏ.. క్యాట్ పేపర్‌కు ఎలాంటి ఆన్సర్ కీ ఇవ్వదు. దీంతో తాము రాసిన పేపర్లను ఎలా మూల్యాంకనం చేశారో తెలియక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. అటు గాట్ లో కూడా అఫీషియల్ కీతో మ్యాచ్ చేసుకున్న మార్కులకు, ఫైనల్ స్కోర్‌కార్డులో వచ్చిన మార్కులకు అస్సలు పొంతన లేదని విద్యార్థులు వాపోతున్నారు.

ఎన్‌టీఏ ఘోరమైన తప్పులు

మార్కుల సంగతి పక్కన పెడితే.. అటెండెన్స్ రికార్డులలో ఎన్‌టీఏ ఘోరమైన తప్పులు చేసింది. పరీక్షకు హాజరైన కొందరు విద్యార్థులకు స్కోర్‌కార్డులో ఆబ్సెంట్ అని చూపించగా.. అసలు ఎగ్జామ్ సెంటర్‌కే వెళ్లని కొందరికి మాత్రం ప్రెజెంట్ అని మార్కులు కేటాయించడం తీవ్ర కలకలం రేపుతోంది. చాలా పరీక్షా కేంద్రాల్లో అసలు విద్యార్థులకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా నిర్వహించలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

ఈ తీవ్రమైన ఆరోపణలపై ఎన్‌టీఏ సీనియర్ అధికారులు స్పందించారు. పరీక్ష రాసిన దాదాపు 12,000 మంది విద్యార్థులలో కేవలం 15 మంది మాత్రమే అధికారికంగా తమకు ఫిర్యాదు చేశారని, వారందరి సమస్యలను పరిష్కరించామని క్లెయిమ్ చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఎన్‌టీఏ క్లెయిమ్ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం వందలాది మంది విద్యార్థుల సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. తాము ఎన్నిసార్లు ఈమెయిళ్లు పెట్టినా, ఫోన్లు చేసినా ఎన్‌టీఏ నుంచి సరైన సమాధానం రావడం లేదని, మొదట ఆబ్సెంట్ అని వచ్చిన వారికి ఇప్పుడు దిద్దిన స్కోర్‌కార్డులు ఇచ్చారు కానీ, మార్కుల్లో జరిగిన తారుమారుపై మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


 

Advertisment
తాజా కథనాలు