/rtv/media/media_files/2026/06/01/mamata-2026-06-01-17-36-32.jpg)
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పిలిచిన నూతన ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం ఘోరంగా విఫలమైంది. మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసంలో జరిగిన ఈ భేటీకి మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలకు గాను కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. దాదాపు60 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాకపోవడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ గైర్హాజరీపై టీఎంసీ వెంటనే స్పందించింది. శనివారం అభిషేక్ బెనర్జీపై, ఆ మరుసటి రోజు పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో నిరసనల్లో బిజీగా ఉన్నారని, అందుకే రాలేకపోయారని పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది.
పరిస్థితులను చక్కదిద్దేందుకు
ఈ పరిణామాలపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ విలేకరులతో మాట్లాడారు. ముందుగా నిర్ణయించిన సమావేశమే అయినప్పటికీ, తాజా దాడుల నేపథ్యంలో స్థానికంగా తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దేందుకు, అరెస్ట్ అయిన కార్యకర్తలకు అండగా ఉండేందుకే ఎమ్మెల్యేలు రాలేకపోయారని ఆయన కవర్ చేశారు. మీటింగ్‌ను వాయిదా వేయాలని ఎమ్మెల్యేలే కోరడంతో సమావేశాన్ని రద్దు చేశామని, కేవలం అందుబాటులో ఉన్న 20 మందితో మమతా బెనర్జీ అనధికారికంగా మాట్లాడారని తెలిపారు. ఇదే సమయంలో సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోయే 48 గంటల పాటు నిరసనలను ఉధృతం చేయనున్నట్లు కునాల్ ఘోష్ ప్రకటించారు. సోమవారం బ్లాక్ , వార్డు స్థాయిల్లో ర్యాలీలు నిర్వహిస్తామని, మంగళవారం కోల్‌కతాలోని రాణి రాష్మణి రోడ్డులో మమతా బెనర్జీ నేతృత్వంలో ఒకరోజు ప్రతీకాత్మక ధర్నా చేపట్టబోతున్నట్లు వెల్లడించారు.
Follow Us