చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్, ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు

భారతదేశం గర్వించేలా చంద్రయాన్-3 రాకెట్‌ ను ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ఇవాళ మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు విజయవంతంగా నింగిలోకి పంపించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు షార్‌కు తరలివచ్చారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి రిపీట్ కాకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు.

New Update
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్, ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు

చంద్రుని రహస్యాలను ఛేదించేందుకు చంద్రయాన్‌-3 రాకెట్‌..

చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు చంద్రయాన్‌-3 రాకెట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు.ఈ రాకెట్‌ ద్వారా 3 వేల 900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపించారు. రాకెట్‌ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్‌ ల్యాండర్‌, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రయాన్‌-3లో అమర్చి ఉన్నాయి.

చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి..

జీఎస్ఎల్వీ మార్క్–3 చంద్రయాన్‌-3 ఉపగ్రహాన్ని భూమి చుట్టూ ఉన్న 170X36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో సక్సెస్ ఫుల్ గా ప్రవేశపెట్టింది. ఇది 24 రోజుల పాటు భూమి చుట్టూ తిరిగి, అనంతరం క్రమంగా దాని కక్ష్యను పెంచుకుంటూ నింగిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత క్రమంగా చంద్రుడి వైపు ప్రయాణించే కక్ష్యలోకి చేరనుంది. చివరకు చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ఈ చంద్రయాన్ –3ని పంపించనున్నారు. ఆగస్టు 23 లేదా 24 వ తేదీన ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌తో కూడిన మాడ్యూల్‌ సపరేట్ కానుంది. అప్పుడు చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం దగ్గర ఈ చంద్రయాన్-3 రాకెట్ దిగనుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

హర్షం వ్యక్తం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఈ చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. మూడు దశల్లో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. చంద్రయాన్-3 విజయవంతంపై హర్షం వ్యక్తం చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అని ఆయన కొనియాడారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు