MEGHA Scam: వేల కోట్ల దొంగ బ్యాంక్ గ్యారంటీలు.. లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రహణం!

దేశాన్ని ముంచేస్తోన్న బడా కాంట్రాక్టర్ల బాగోతాన్ని ఆర్టీవీ బట్టబయలు చేసింది. ఇప్పటికే అనేక కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటోన్న మేఘా సంస్థ ఏకంగా వేల కోట్ల ఫేక్ గ్యారెంటీలను సమర్పించింది. ఆర్టీవీ ఇన్‌వెస్టిగేషన్‌ గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
MEGHA Scam: వేల కోట్ల దొంగ బ్యాంక్ గ్యారంటీలు.. లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రహణం!

ఆర్టీవీ... అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది..! దేశంలో మరే ఇతర సంస్థ చేయని సాహసాన్ని చేసింది ఆర్టీవీ. దేశంలోనే రెండు అతి పెద్ద బ్యాంకులతో పాటు మేఘా(MEGHA) లాంటి బడా కంపెనీల బాగోతాన్ని బట్టబయలు చేసింది ఆర్టీవీ. ఒకటి కాదు రెండు కాదు.. వేల కోట్ల స్కామ్‌ ఇది. ఇది జరిగిందంతా ఇండియాలోనే అయినా.. ఈ కుంభకోణానికి పూనాది పడింది మాత్రం వేరే దేశంలో. అవును.. మీరు వింటుంది నిజమే. ఆర్టీవీ ఇన్‌వెస్టిగేషన్‌లో దిమ్మదిరిగే నిజాలు బయటపడ్డాయి. సెయింట్ లూసియాలో ఉండే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే ఓ చిన్న ఫినాన్షియల్‌ కంపెనీ ఇండియాలో లక్షల కోట్ల మోసాలకు కారణమవుతోంది. అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఆ కంపెనీ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇండియాలో పెద్ద ప్రాజెక్టులకు ఈ కంపెనీ గ్యారంటీలు ఇస్తుండడమే దీనికి కారణం.. ఇదేంటి గ్యారంటీలు ఇస్తే స్కామ్‌ ఎలా అవుతుందని ఆలోచిస్తున్నారా? అయితే అసలు మేటరేంటో తెలుసుకోండి!

ఇండియాలో ప్రాజెక్టులకు పక్కదేశంలో ఎవరో గ్యారంటీలు ఇవ్వడమేంటి? అది కూడా బ్యాంక్‌ కానీ బ్యాంక్‌.. దొంగ బ్యాంక్‌ గ్యారంటీలు ఇవ్వడమేంటి? యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఉన్న సెయింట్‌ లూసియా జనాభా 2 లక్షలు మాత్రమే. ఈ బ్యాంక్‌ నికర విలువ 8 కోట్లు మాత్రమే. ఇలాంటి డమ్మీ బ్యాంక్‌ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 31 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 481 కోట్ల గ్యారెంటీలు ఇచ్చింది. ఈ 31 ప్రాజెక్టుల లిస్టు కూడా ఆర్టీవీ సంపాదించింది.

ఎవరి హస్తం ఉంది?
ఏపీ విద్యుత్ శాఖలో విజయానంద్, సంతోష్ రావు, పద్మా జనార్ధన్ రెడ్డి, ఈ ఫేక్ బ్యాంక్ గ్యారంటీలకు ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రాలో ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించిన వారిలో తెలంగాణ మంత్రి పొంగులేటి, ప్రతిమ శ్రీనివాసరావు కంపెనీలు కూడా ఉన్నాయని ఆర్టీవీ ఇన్‌వెస్టిగేషన్‌లో తేలింది. ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ విభాగం కూడా ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీలను ఆమోదించింది. అటు కర్ణాటక డిస్కంలు కూడా ఈ నకిలీ బ్యాంక్ గ్యారెంటీలకు స్వాగతం పలికాయి. మరోవైపు మహారాష్ట్రలో MMRDA లాంటి ప్రభుత్వ సంస్థలు భారీ ప్రాజెక్టులకు ఈ దొంగ బ్యాంక్ గ్యారెంటీల ద్వారా కుంభకోణానికి లైన్ క్లీయర్ చేశాయి.

అసలు బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటి?
బ్యాంక్ గ్యారంటీ అంటే కాంట్రాక్టరు షూరిటీగా సమర్పించేది. సాధారణంగా ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 10 శాతం మొత్తానికి బ్యాంకు గ్యారంటీ ఇస్తుంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ చేసేది ఇదే. ఇక్కడ వరకు బాగానే ఉన్నా అసలు మేటర్‌ వేరే ఉంది. RBI గుర్తించిన బ్యాంకుల జాబితాలో కూడా లేని యూరో ఎగ్జిమ్ బ్యాంక్‌ గ్యారంటీలను ప్రభుత్వాలు ఎలా అంగీకరిస్తున్నాయన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. మరోవైపు ఈ దొంగ బ్యాంక్‌ హెడ్ ఆఫీసు సెయింట్ లూసియాలో ఉంది కానీ ఈ కంపెనీ ఏర్పడింది మాత్రం ఇంగ్లండ్ అండ్ వేల్స్ చట్టాల ప్రకారం. ఇలా ఇండియాకు ఏ మాత్రం సంబంధం లేని ఓ చిన్న ఫినాన్షియల్ కంపెనీ భారత్‌లో లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్యారంటీ ఇస్తుండడం విడ్డూరం!

అడ్డంగా దొరికిన మేఘా:
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అక్రమాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ కూడా ఈ దొంగ బ్యాంక్ గ్యారెంటీల ద్వారానే లబ్ధి పొందింది. ఈ కంపెనీ 432 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ ఫ్రా లిమిటెడ్‌కు ఇచ్చింది. మహారాష్ట్రలోని MMRDA ప్రాజెక్టులో భాగంగా థానే నుంచి బోరివలి వరకు సొరంగం నిర్మించడానికి గ్యారంటీ ఇచ్చారు. కర్నాటక జెన్ కో లో కూడా దొంగ బ్యాంక్ గ్యారెంటీలను ఇచ్చినట్లు తెలిసింది. ప్రతీ ప్రాజెక్టులో బ్యాంక్‌ గ్యారంటీగా 10 శాతం తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టు విలువ 4,320 కోట్లు. ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టును అక్రమ బ్యాంకు గ్యారంటీలతో తమ ఖాతాలో వేసుకున్నారన్న విషయాలు ఆర్టీవీ ఇన్‌వెస్టిగేసన్‌లో తేలాయి.

publive-image

పేపర్‌ వ్యాల్యూపై గ్యారంటీ ఎలా ఇస్తారు?
కేవలం 8 కోట్ల నికర విలువ కలిగిన యూరో ఎగ్జిమ్‌ బ్యాంక్‌ వేల కోట్ల ప్రాజెక్టులకు గ్యారంటీలు ఇస్తుంటే ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఈ విషయంలో గుర్తించకపోవడం వింతగా అనిపిస్తోంది. కేవలం పేపర్‌పై కంపెనీ వ్యాల్యూ చెబితే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేస్తున్నారంటే ఈ దొంగ బ్యాక్‌ బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. ఈ మొత్తం స్కామ్‌లో యూరో ఎగ్జిమ్‌ బ్యాంకును గ్యారెంటీ కంపెనీ అంటారు. ఇది 3 శాతం నుంచి 4శాతం కమీషన్ తీసుకుంటుంది. ఈ కమీషన్‌ కూడా హవాలా మార్గంలో తీసుకుంటుంది. అంటే ఈ వ్యవహారమంతా తిరిగేది బ్లాక్‌ మనీ చుట్టూ అన్నమాట.

దేశంలో సామాన్యులకు ఏదైనా లోన్‌ కావాలంటే ముప్పుతిప్పలు పెట్టే బ్యాంకులు బడా బాబుల విషయంలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంటాయన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆఖరికి క్రెడిట్ కార్డుల విషయంలో ఎన్నో రూల్స్‌ పెట్టి సామాన్యులకు కార్డులను డిక్లైన్‌ చేసే బడా బ్యాంకులు ఈ విషయంలో మాత్రం చాలా ఉదాసీనంగా వ్యవహరించాయని ఆర్టీవీ ఇన్‌వెస్టిగేషన్‌లో తేలింది. దేశంలో రెండు ప్రముఖ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీలకంగా ఉన్నాయి. ఇది ఏదో నోటి మాట కాదు.. ఎగ్జిమ్‌ బ్యాంక్‌ దందాకు లైన్‌ క్లియర్‌ చేసింది ఈ రెండు బ్యాంకులే.

publive-image

SBI, UBI ఒక లేఖను జారీ చేశాయి. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారెంటీని ప్రామాణికంగా పరిగణిస్తున్నామని, అయితే దానికి తాము ఎలాంటి బాధ్యత వహించడం లేదని చెబుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారెంటీని SBI, UBI అంగీకరించడం లేదని పరోక్షంగా చెబుతున్నాయి. అయితే.. ఈ ఆరోపణలకు సాక్ష్యాలు కూడా ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. సీనియర్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధి చైతన్యతో మాట్లాడారు. ఈ కాల్‌లో అతను పూర్తి విషయాలను బయటపెట్టాడు. వారి మధ్య జరిగిన ఈ సంభాషనను చూస్తే మీకే ఈ విషయం అర్థమవుతుంది.

వారి సంభాషణ వివరాలు ఇలా..
పూనమ్ అగర్వాల్: నేను మాట్లాడుతోంది చైతన్య గారితోనేనా? నా పేరు అనామిక. నేను...... కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీతో మాట్లాడేందుకు ఇది సరైన సమయమేనా. మీరు యూరో ఎగ్జిమ్ బ్యాంక్‌లో పని చేస్తున్నారా?
చైతన్య: అవును
పూనమ్ అగర్వాల్: మా కంపెనీ బ్యాంక్ గ్యారంటీ కోసం చూస్తోంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సెయింట్‌ లూసియాలో ఉందా? ఢిల్లీలో లేదా ఇండియాలో ఏమైనా బ్రాంచ్‌లు ఉన్నాయా?
చైతన్య: లేవు ఇండియాలో ఎలాంటి బ్రాంచ్‌లు లేవు. సెయింట్‌లూసియా నుంచి మాత్రమే వర్క్ చేస్తుంది. SBI, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాంటి బ్యాంకుల సూచనలతో గ్యారంటీ జారీ చేస్తాం.
పూనమ్ అగర్వాల్: అంటే ఏదైనా నేషనలైజ్డ్‌ బ్యాంక్ లెటర్ ఇస్తే మీరు గ్యారెంటీ ఇస్తారు అవునా?
చైతన్య: మేం ఇండియాలో 350 నుంచి 400 వరకు బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చాం.
పూనమ్ అగర్వాల్: ఇది లీగలేనా?
చైతన్య: లేదు కన్వీన్స్ చేయాల్సి ఉంటుంది.
పూనమ్ అగర్వాల్: ఎప్పటి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? ఏ కంపెనీలకు ఇచ్చారు?
చైతన్య: 2018 నుంచి మేం ఆపరేట్ చేస్తున్నాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఇచ్చాం. NHAI, MMRDA, KPCL, తమిళనాడు వాటర్ అండ్ డ్రైన్ కర్ణాటక, రూరల్ వాటర్ సప్లై చాలా ప్రాజెక్టులకు గ్యారెంటీ ఇచ్చాం. హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్  మా అతి పెద్ద క్లయింట్. ఇంకా అనేక సంస్థలకు గ్యారెంటీ ఇచ్చాం.
పూనమ్ అగర్వాల్: ఏయే ప్రాజెక్టులకు ఇచ్చారో చెప్పగలరా?
చైతన్య: నేను ఆ విషయాలను షేర్ చేసుకోలేను..
పూనమ్ అగర్వాల్: మీరు ఢిల్లీలో ఉంటారా?
చైతన్య: లేదు నేను హైదరాబాద్‌లో ఉంటాను.
పూనమ్ అగర్వాల్: డాక్యుమెంట్స్‌ ఏమైనా షేర్ చేస్తారా?
చైతన్య: నేను మీకు పంపిస్తాను.

SBI,UBIతో పాటు యూరో ఎగ్జిమ్ బ్యాంకు కూడా RBI నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఈ మొత్తం వ్యవహారం చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే RBI నిబంధనల ప్రకారం, లబ్ధిదారుడికి గ్యారంటీని ఇస్తే ఆ గ్యారంటీ ఇచ్చిన బ్యాంకే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో బ్యాంకు గ్యారంటీ లబ్ధిదారుడు ప్రభుత్వమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే గ్యారంటీ సొమ్మును పొందాలి. అయితే దీన్ని ఎగ్గొట్టేందుకు లూప్ హోల్స్‌ను వాడుకుంటున్నారని తెలుస్తోంది. ఉదాహరణకు గ్యారంటీ గడువు ముగియడానికి ఒక నెల ముందు.. వారు కావాలనే ఏదో ఒక కేసు దాఖలు చేస్తుంటారు. ఆ కేసు వాయిదా పడుతూ ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తారంటే.. నిబంధనల ప్రకారం ఏదైనా కోర్టు కేసు ఉంటే బ్యాంక్ గ్యారెంటీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ లూప్‌ హోల్‌తోనే ఈ స్కామ్ సాఫీగా సాగుతోందన్నమాట.
publive-image

నిబంధనలను తుంగలో తొక్కి విదేశీ కంపెనీ బ్యాంక్ పేరుతో ప్రభుత్వాన్ని ఇలా బహిరంగంగా మోసం చేస్తున్నారు. ఇంత పెద్ద మోసాన్ని ఒక్కరు, ఇద్దరు కలిసి చేయడం సాధ్యం కాదు. ఇందుకు చాలా పెద్ద వ్యవస్థే కావాలి. వ్యవస్థలోని లోపాలను వాడుకుని కొంత మంది వ్యక్తులు దేశ ప్రజల ఆదాయాన్ని పణంగా పెడుతున్నారు. ఈ పెద్ద కంపెనీలు చేస్తున్న ప్రాజెక్టులు మన జీవితాలకు సంబంధించినవి. రోడ్లు, వంతెనలు, డ్యామ్స్, టన్నెల్స్ ఇలా అన్ని మన ట్యాక్స్‌తో నిర్మిస్తున్నవే. ఈ డబ్బును దోచుకోవడానికి కంపెనీలు అడ్డదారులు తొక్కుతున్నాయి.

ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి చైనాలో 10 సార్లు మరణ శిక్ష విధిస్తారు. కానీ మన దేశంలో ఈ కంపెనీలు అధికారులకు, రాజకీయ నేతలకు భారీగా లంచాలు ముట్టజెప్పి శిక్ష నుంచి తప్పించుకుంటున్నాయి. లేకపోతే కేవలం రూ. 8 కోట్ల విలువైన కంపెనీ ఇండియాలో వేల కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలు ఎలా ఇస్తోంది. ఈ స్కామ్‌పై RBI కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. జనం కట్టే పన్నులతో జల్సాలు చేసే వారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు