ఇతనే నా రాజకీయ వారసుడు.. కీలక ప్రకటన చేసిన మాయావతి

బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌.. తన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నట్లు ఆదివారం లఖ్‌నవూలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె స్పష్టం చేశారు.

New Update
ఇతనే నా రాజకీయ వారసుడు.. కీలక ప్రకటన చేసిన మాయావతి

మాయావతి తర్వాత బీఎస్పీ పార్టీ అధ్యక్ష పదవి ఎవరు చేపడతారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. 2024 ఎన్నికల కోసం ఎవరు బీఎస్పీ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారనే విషయంపై కొంతకాలంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయవతి ఆదివారం కీలక ప్రటకన చేశారు. తన రాజకీయ వారసుడిగా మేనల్లుడి పేరును ప్రకటించారు. గత ఏడాది కాలంగా పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆకాశ్‌ ఆనంద్‌ తన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నట్లు ఆమె తెలిపారు.

ఈ మేరకు మాయావతి తమ్ముడి కుమారుడు ఆకాశ్‌ ఆనంద్‌.. 2016లో బీఎస్పీలో చేరారు. అప్పటినుంచి పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తున్న ఆకాశ్‌ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున ప్రచారం చేశారు. 2022లో రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో పార్టీ వర్గాలు చేపట్టిన పాదయాత్రతోపాటు, ఇటీవల డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్ సంకల్ప్‌ యాత్రలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే పార్టీలో మాయావతి తర్వాత అధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ పేరును ప్రకటించడం పార్టీ వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక దీనిపై బీఎస్పీ నేత ఉదయవీర్ సింగ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పార్టీ సంస్థను బలోపేతం చేసే బాధ్యత ఆనంద్‌కు అప్పగించారన్నారు. 'ఆమె (మాయావతి) తర్వాత ఆనంద్ పార్టీకి వారసుడు అవుతాడు' అని మీడియాతో తెలిపారు.

Also read :Soumya Viswanathan: చేతి కర్రతో న్యాయాన్ని గెలిపించాడు.. రెండు రోజులకే తుది శ్వాస విడిచిన సౌమ్య తండ్రి!

ఇదిలావుంటే.. బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డానిష్ అలీపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా ఓ ప్రకటనలో తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా ఆయన తన వైఖరి మార్చుకోలేదని పేర్కొన్నారు. మహువా మోయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని డానిష్ అలీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా చేసిన మరుసటి రోజే బీఎస్పీ ఆయనను సస్పెండ్ చేసింది. అయితే, డానిష్ అలీని సస్పెండ్ చేయడానికి గల స్పష్టమైన కారణాలను పార్టీ వెల్లడించలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు