రాజీనామాకు ససేమిరా,మణిపూర్ సీఎం బీరేన్ సింగ్

మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడానికి తిరస్కరించారు.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల దృష్ట్యా పదవి నుంచి దిగిపోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని కానీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్ప తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు.కేంద్ర నాయకత్వం ఆదేశించినప్పుడే ఈ చర్య తీసుకుంటానని మణిపూర్ ప్రజలు తనను ఎన్నుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాజీనామా చేయాలని తనను పార్టీ కోరలేదన్నారు.రాష్ట్రంలో అశాంతికి అక్రమంగా వస్తున్న శరణార్థులు,మాదక ద్రవ్యాలను దొంగరవాణా చేస్తున్న స్మగ్లర్లే కారణమని ఆయన అన్నారు.గత మూడు నెలలుగా మణిపూర్ లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.

New Update
రాజీనామాకు ససేమిరా,మణిపూర్ సీఎం బీరేన్ సింగ్

manipur-cm-resign-central-government-parliament-mijoram-assam2

కుకీలు,మెయితీల మధ్య ఘర్షణలు,అల్లర్ల తోను,మిలిటెంట్ల తోను పలు జిల్లాలు అట్టుడుకుతున్నాయి.మే 4న కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను దుండగులు నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.ఇలాంటి దారుణ ఘటనలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడంలో సీఎం బీరేన్ సింగ్ విఫలమయ్యారని ఆరోపిస్తున్నాయి.ఆయన రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి.ఆ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ మౌనం వహిస్తున్నారని తప్పు పట్టిన ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆయన దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. చివరకు ఈ డిమాండుతో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెచ్చేందుకు పూనుకొన్నాయి.మణిపూర్ ఘటన దేశం లోని 140 కోట్ల మంది ప్రజలకు సిగ్గు చేటని మోడీ ఆ తరువాత వ్యాఖ్యానించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాల్సి ఉందన్నారు.

20 నుంచి పార్లమెంటులో రభస

manipur-cm-resign-central-government-parliament-mijoram-assam2

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 20 నుంచే మణిపూర్ అంశంపై విపక్షాలు ఉభయసభల్లో సభా కార్యకలాపాలను స్తంభింపజేస్తూ వచ్చాయి. గందరగోళం కారణంగా రోజూ పార్లమెంట్ వాయిదా పడుతూ వచ్చింది. గత సోమవారం రాత్రంతా ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ బయట గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కూడా ఎంపీలు డిమాండ్ చేశారు.

స్పందించిన అమెరికా

manipur-cm-resign-central-government-parliament-mijoram-assam 4

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చూసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల పట్ల అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ సంతృప్తిని ప్రకటించారు.మణిపూర్ ఘటన తమను షాక్ కి గురి చేసిందని ఆ రాష్ట్రంలో హింసకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు.అన్ని వర్గాల ప్రాణాలను ఆస్తులను రక్షించవలసి ఉందన్నారు.

మిజోరంలో మెయితీల ఆందోళన

మణిపూర్ ఘటనతో పొరుగునున్న మిజోరం నుంచి మెయితీలను స్వరాష్ట్రానికి విమానాల ద్వారా రప్పించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది.ఆ రాష్ట్రంలోని మెయితీలంతా మణిపూర్ చేరుకోవాలని ఓ మాజీ మిలిటెంట్ సంస్థ కూడా పిలుపునిచ్చింది.ఇటీవల మిజోరం నుంచి సుమారు 400 మంది మెయితీలు తమ కుటుంబాలతో సహా అసోం లోని కచార్ జిల్లాకు చేరుకున్నారు.తమకు భద్రత కల్పిస్తామని మిజోరం ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ తమకు అంతగా విశ్వాసం లేదని,అందువల్లే ఆ రాష్ట్రం విడిచి వచ్చామని వారు అసోం రైఫిల్స్ దళాలకు చెప్పారు.ఇక మయన్మార్ నుంచి 700 మందికి పైగా ఆ దేశవాసులు అక్రమంగా తమ పిల్లలతో సహా మిజోరం చేరుకోవడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.వీరిని మయన్మార్ తిప్పి పంపివేయాలని అధికారులు ఆదేశించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు