ఇదేందయ్యా ఇది.. టమాటా పొలానికి కాపలాగా సీసీ కెమెరాలు

టమాటా ధరల పెరుగుదలతో దొంగతనాలు, హత్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో రైతులు పంట కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ రైతు వినూత్న ఆలోచన మాత్రం వైరల్ అవుతోంది.

New Update
ఇదేందయ్యా ఇది.. టమాటా పొలానికి కాపలాగా సీసీ కెమెరాలు

వినూత్నంగా ఆలోచించిన రైతు..

ప్రస్తుతం టమాటా పొలం ఉన్నవాడే కోటీశ్వరుడు. ధరల పెరుగుదలతో టమాటా రైతులు రాత్రికి రాత్రే కుబేరులు అయిపోతున్నారు. మొన్నటిదాకా ధర లేక అప్పులపాలైన అన్నదాతలు నేడు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగారు. మరోవైపు పంటను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ధరల పెరుగుదలతో టమాటాలు దొంగలించే వారు ఎక్కువైపోయారు. కుదిరితే దొంగతనం.. అడ్డొస్తే చంపేయడానికి కూడా దుండగులు వెనుకాడటం లేదు. దీంతో రైతులు పొలాల్లోని పంటను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన శరద్ రావత్ అనే రైతు తన పొలంలో ఏకంగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు.

నిఘా కోసం పొలంలో సీసీ కెమెరాలు..

తనకున్న ఐదు ఎకరాల పొలంలో ఒకటిన్నర ఎకరంలో టమాటా పంట వేశానని.. టమాటాల విక్రయంతో 6 నుంచి 7 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. అయితే 10 రోజుల క్రితం తన పొలంలో దొంగలు దాడి చేసి టమాటాలను ఎత్తుకెళ్లారన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉన్న టమాటాలను చోరీ చేయడం తట్టుకోలేకపోయానని వాపోయారు. అందుకే నిఘా కోసం పొలంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశానని రావత్ పేర్కొన్నారు. వీటి కోసం రూ.22,000 ఖర్చు అయిందని.. అంతేకాకుండా విద్యుత్ ఆదా కోసం ఈ కెమెరాలు సౌరశక్తితో నడిచేలా ఏర్పాట్లు చేశానని చెప్పారు. కెమెరాలు పెట్టడంతో తాను ఎక్కడున్నా పొలం విజువల్స్‌ని తన ఫోన్‌లో చూసుకుంటానని శరద్ వెల్లడించారు. ప్రస్తుతం తన పంట కోసం ఈ రైతు చేసిన ఏర్పాట్లు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తగ్గుముఖం పడుతున్న ధరలు.. 

అయితే మరోవైపు జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తున్న టమాటా ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు రోజులుగా టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిగుబడి పెరగడంతోనే టమాటా ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లోకి టమాటా భారీగా చేరుతుండడంతో రేట్లు కూడా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు రైతు బజారుల్లో కిలో టమాటా రూ.63 నుంచి రూ.70 పలుకుతోంది. ఇక రిటైల్‌ అయితే కిలో రూ.120 నుంచి రూ.140 పలుకుతోంది. దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించినట్లైంది. దిగుబడి మరింతగా పెరిగితే ధరలు ఇంకా దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రైతుల్లో మొదలైన ఆందోళన.. 

ఇదిలా ఉంటే ధరల తగ్గుదలతో టమాటా రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ ధరలు మరింత తగ్గుతాయేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల తగ్గుదలతో కోతకు వచ్చిన పంట మంచి ధర పలకదేమోనని  ఆందోళన చెందుతున్నారు. ధరలు తగ్గినా సరే లోకల్ మార్కెట్‌ల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగమతులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ఛత్తీస్‌గడ్, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్ కు ఎగుమతి అవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు