BRS: పెద్దపల్లి నుంచి సుమన్, భువనగిరికి బాలరాజు యాదవ్.. ఎంపీ ఎన్నికలకు బీఆర్ఎస్ భారీ వ్యూహం.. పూర్తి లిస్ట్ ఇదే! ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బాల్క సుమన్, గువ్వల బాలరాజు, శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, రెడ్యానాయక్ తదితరులను బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. By Nikhil 25 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Lok Sabha Elections - BRS: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలిచి కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. తాము ఇంకా బలంగానే ఉన్నామన్న సంకేతాలు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ అవుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై కొన్నిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఒకటి రెండు స్థానాలు తప్పా.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు దాదాపు ఫైనల్ అయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ఆధారంగా నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇది కూడా చదవండి: Kaleswaram Project: 29న మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పీపీటీ! చెవెళ్ల: సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని మరో సారి ఇక్కడి నుంచి పోటీకి దించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ విషయాన్ని రంజిత్ రెడ్డి సైతం బహిరంగంగానే ప్రకటించారు. మరో సారి పోటీ చేయాలని కేటీఆర్ తనతో చెప్పినట్లు ఆయన ఈ రోజు మీడియాకు వెల్లడించారు. తన పార్లమెంట్ సెగ్మెంట్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లపై ఫోకస్ పెట్టాలని కేటీఆర్ తనకు సూచించినట్లు ఆయన చెప్పారు. ఖమ్మం: ఇక్కడి నుంచి కూడా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు అభ్యర్థిత్వానికే కేసీఆర్, కేటీఆర్ తో పాటు జిల్లా నేతలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మరో సారి బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. నాగర్‌కర్నూల్: ఈ నియోజకర్గం నుంచి గత ఎన్నికల్లో పోతుగంటి రాములు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే.. ఈ ఎన్నికల్లో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఇక్కడి నుంచి బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్: శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఈ సారి పోటీకి దించాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. వరంగల్: పసునూరి దయాకర్ ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే.. ఈ సారి దయాకర్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య పేరును కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్: ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాలోత్ కవిత ఎంపీగా ఉన్నారు. అయితే.. డోర్నకల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కవిత తండ్రి, మాజీ మంత్రి రెడ్యా నాయక్ పేరును బీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత లేదా రెడ్యానాయక్ లో ఒకరిని పోటీకి దించే అవకాశం ఉంది. ఒక వేళ రెడ్యానాయక్ ను పోటీకి దించితే కవితకు మహబూబాబాద్ లేదా డోర్నకల్ నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. జహీరాబాద్: గత రెండు ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీబీ పాటిల్ పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయనకే మరో సారి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి: గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్: మాజీ ఎంపీ, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో సారి ఇక్కడి నుంచే తన అదృష్టం పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వినోద్‌కుమార్ కే మరో సారి అవకాశం దక్కనుందని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆదిలాబాద్: ఇక్కడ కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నగేష్ కే ఛాన్స్ ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. భువనగిరి: ఇక్కడి నుంచి విద్యార్థి ఉద్యమ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీసీ అభ్యర్థినే బరిలోకి దించింది బీఆర్ఎస్. దీతో ఈ సారి కూడా బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన బాలరాజు యాదవ్ కు టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నల్గొండ: నల్గొండ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన ప్రస్తుత శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి పేరు దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్: గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తలసాని సాయికిరణ్ యాదవ్ కే మరో సారి టికెట్ దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మల్కాజిగిరి: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఉప్పల్ టికెట్ దక్కక పోవడంతో బీఆర్ఎస్ గూటికి చేరిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిని ఇక్కడి నుంచి పోటీకి దించాలని పార్టీ భావిస్తోంది. హైదరాబాద్: ఎంఐఎం కంచుకోటగా ఉన్న ఈ సీటు విషయంలో బీఆర్ఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. #balka-suman #guvvala-balaraju మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి