/rtv/media/media_files/2026/04/30/miyazaki-mango-price-1-2026-04-30-16-17-26.jpg)
Miyazaki Mango Price
‘‘ఆహా ఏమి రుచి తినరా మైమరచి’’.. ఈ సీజన్‌లో మామిడి పండ్లు తింటే ఈ రాగాలు పాడాల్సిందే. ఏడాదికి ఒక్కసారి మాత్రమే పండే ఈ పండ్ల రుచి అమోఘం. ప్రస్తుతం ప్రతి పండ్ల మార్కెట్‌లోనూ ఇవే కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి. వీటి ధరలు కూడా కిలో రూ.100 నుంచి రూ.200 మధ్యలోనే ఉంటుంది. ఇంట్లో పిల్లల నుంచి పండు ముసలి వరకు ఆవురావురమంటూ తినేస్తుంటారు.
Miyazaki Mango Price
అయితే మన ఊర్లల్లో కిలో మామిడి రూ.వందల్లో కొనుక్కోవడం చూస్తూనే ఉంటాం. కానీ కిలో మామిడి లక్షల్లో ఉండటం ఎప్పుడైనా చూశారా?.. పోనీ విన్నారా?. ఏంటీ.. మామిడి పండ్లు కిలో లక్షల్లో ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారా?.. అవునండీ బాబు ‘‘మియాజాకీ’’ అనే మామిడి పండ్లు కిలో రూ.2 లక్షలకు పైగానే ధర పలుకుతుంది. అంతేకాదండోయ్.. వాటిని మార్కెట్లలో కొనడం చాలా కష్టం. కేవలం ఆర్డర్ల ద్వారానే విక్రయిస్తారు. అయితే ఈ మామిడి పండ్లకు అంత ధర ఎందుకు?.. దాని ప్రత్యేకతేంటి?.. ఎక్కడ పండిస్తారు?.. అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
‘‘మియాజాకీ’’ (Miyazaki) మామిడి పండ్లు.. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగోస్‌గా పేరుపొందాయి. వీటిని జపాన్‌లో మాత్రమే పండిస్తారు. జపాన్‌లోని క్యూషు ప్రావిన్స్‌లోని మియాజాకీ నగరంలో ఈ మామిడి పండ్లు పండటంతో వీటికి ‘‘మియాజాకీ’’ అనే పేరు పెట్టారు. జపనీస్ భాషల్లో దీనిని ‘‘తైయో-నో-తమాగో’’ (Taiyo-no-Tomago) అని పిలుస్తారు.. అంటే తెలుగులో ‘‘సూర్యుని గుడ్డు’’(Egg of the Sun) అని అర్థం.
ఈ మియాజాకీ మామిడి పండ్లు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ ధరను కలిగి ఉన్నాయి. వీటి ధర కిలో రూ.2.70 లక్షల నుండి రూ.3 లక్షల వరకు పలుకుతుంది. ఇవి ఇర్విన్ అనే మామిడి రకానికి చెందినవి కావడంతో చూడటానికి భారీ పరిమాణంలో ఉన్న డ్రాగన్ గుడ్లలా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇవి సాధారణ మార్కెట్లలో దొరికే పండ్లలా ఆకుపచ్చ లేదా పసుపు కలర్‌లో కాకుండా డార్క్ రెడ్ లేదా పర్పుల్ కలర్‌లో మెరుస్తూ ఉంటాయి. అయితే ఈ మామిడి అంత ఖరీదైనవి కావడానికి కొన్ని నాణ్యత ప్రమాణాలు, సాగు పద్ధతులే ప్రధాన కారణం.
సాగు విధానం
మియాజాకీ మామిడి పండ్ల సాగుకు కఠిన శాస్త్రీయ ప్రక్రియ అవసరం. వీటికి విపరీతమైన సూర్యరశ్మి, అధిక వర్షపాతం, వెచ్చని వాతావరణం అవసరం అవుతుంది. అందువల్లనే జపాన్‌లో వీటిని గ్రీన్ హౌస్‌లలో సాగు చేస్తారు. ప్రతి పండుకు సూర్యకాంతి తగిలేలా అద్దాలను లేదా రేకులను ఉపయోగిస్తారు. అది మాత్రమే కాకుండా సాగు సమయంలో నీరు, ఎరువుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు.
నాణ్యత పరీక్ష
ప్రతి పండును విక్రయించే ముందు కఠిన పద్ధతులో తనిఖీలు చేస్తారు. దీనిని ‘‘తైయో-నో-తమాగో’’గా పిలవబడాలంటే.. దాని బరువు కనీసం 350 గ్రాములు ఉండాలి. అందులో చక్కెర శాతం 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉండాలి. అలాగే పండు పైన ఎలాంటి మచ్చలు ఉండకూడదు.
కాగా ఈ మామిండి పండ్లను చేత్తో కోయరు. చెట్టుపై ఉన్న కాయలకు ముందుగానే చిన్న వల కడతారు. దీని కారణంగా అవి పండ్లు అయిన తర్వాత నేరుగా ఆ వలలో పడుతుంది. ఇలా చేయడం వల్ల పండుకు ఎలాంటి దెబ్బలు తగలవు. అప్పుడు అది రుచిగా ఉంటుంది. ఇందులో సాధారణ మామిడి పండ్ల కంటే విటమిన్ సి, ఎ శాతం ఎక్కువగా ఉంటుంది.
అయితే ఇటీవల కాలంలో ఈ మామిడి పండ్లను భారత దేశంలో కూడా చాలా మంది రైతులు పండిస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో ఓ రైతు తన తోటలో ఈ చెట్లను పెంచగా.. వాటికి సెక్యూరిటీ గార్డులను, కుక్కలను రక్షణగా పెట్టాడు. అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం, నంద్యాల వంటి జిల్లాల్లో కూడా రైతులు పండిస్తున్నారు. జపాన్‌లో ఈ పండ్ల కోసం వేలం వేస్తుంటారు.
Follow Us