Ginger Garlic Paste: ఎక్కడ చూసినా కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్.. కల్తీని ఇలా గుర్తించండి..!

మన వంటింట్లో నిత్యం వాడే ఈ పదార్థం విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే. ఈ నేపథ్యంలో, మీరు కొనే అల్లం-వెల్లుల్లి పేస్ట్ అసలైనదా లేక కల్తీదా అనేది తెలుసుకోవడానికి కొన్ని ఈజీ చిట్కాలు ఉన్నాయి.

New Update
_ginger garlic paste

హైదరాబాద్‌లో ఇటీవల భారీ స్థాయిలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ పట్టుబడటం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. దాదాపు 4,000 కిలోల నకిలీ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, అది అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, ప్రాణాంతక రసాయనాలతో తయారవుతున్నట్లు గుర్తించారు. మన వంటింట్లో నిత్యం వాడే ఈ పదార్థం విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే. ఈ నేపథ్యంలో, మీరు కొనే అల్లం-వెల్లుల్లి పేస్ట్ అసలైనదా లేక కల్తీదా అనేది తెలుసుకోవడానికి కొన్ని ఈజీ చిట్కాలు ఉన్నాయి.

అల్లం-వెల్లుల్లి పేస్ట్: కల్తీని గుర్తించే 5 సూత్రాలు

1. వాటర్ టెస్ట్ (నీటి పరీక్ష)
ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పేస్ట్ వేసి కాసేపు పక్కన పెట్టండి. అది నాణ్యమైనదైతే యథావిధిగా ఉంటుంది. ఒకవేళ పేస్ట్ పైభాగంలో నీళ్లు తేలడం లేదా పేస్ట్-నీరు విడిపోవడం గమనిస్తే అది కచ్చితంగా కల్తీదే. బరువు పెంచడానికి కలిపే నీరు బయటకు రాకుండా స్టెబిలైజర్స్ వాడుతారు, కాసేపటికి వాటి ప్రభావం తగ్గి నీరు విడిపోతుంది.

2. స్పర్శ ద్వారా గుర్తింపు
కొద్దిగా పేస్ట్‌ను తీసుకుని వేళ్ల మధ్య రుద్ది చూడండి. అసలైన పేస్ట్ చాలా మెత్తగా (స్మూత్‌గా) ఉంటుంది. అలా కాకుండా గరుకుగా లేదా చిన్న ఉండలు కట్టినట్లు తగిలితే, అందులో బియ్యం పిండి లేదా గోధుమ పిండి కలిపారని అర్థం చేసుకోవాలి.

3. రంగును బట్టి తేడా
సహజ సిద్ధమైన అల్లం-వెల్లుల్లి పేస్ట్ లేత గోధుమ రంగు లేదా 'ఆఫ్-వైట్' కలర్‌లో ఉంటుంది. కానీ మీరు కొన్న ప్యాకెట్‌లోని పేస్ట్ మరీ తెల్లగా మెరిసిపోతున్నా లేదా విపరీతమైన ముదురు రంగులో ఉన్నా అనుమానించాల్సిందే. ఆకర్షణ కోసం ఇందులో బ్లీచింగ్ ఏజెంట్లు, కృత్రిమ రంగులు కలిపే అవకాశం ఉంది.

4. ఘాటైన వాసన
తాజా అల్లం, వెల్లుల్లి మిశ్రమం నుంచి చాలా బలమైన, ఘాటైన సహజ వాసన వస్తుంది. ఒకవేళ వాసన తక్కువగా ఉన్నా లేదా రసాయనాల వాసన వస్తున్నా అది నకిలీదని గ్రహించాలి. తక్కువ మొత్తంలో అల్లం వాడి, ఆ లోటును పూడ్చడానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతుంటారు.

5. గ్లాసు నీటిలో కలిపి చూడండి
గ్లాసు నీటిలో ఒక స్పూన్ పేస్ట్ వేసి కలపండి. అది స్వచ్ఛమైనదైతే నీటిలో కరిగిపోయి నీరు మబ్బుగా మారుతుంది. ఒకవేళ పేస్ట్ నీటిపై తేలినా లేదా అడుగున గట్టి ముద్దలా ఉండిపోయినా అందులో కరగని రసాయనాలు ఉన్నాయని అర్థం.

ఎప్పుడూ గుర్తింపు పొందిన బ్రాండ్లను మాత్రమే ఎంచుకోండి. ప్యాకింగ్‌పై FSSAI లైసెన్స్ నంబర్, తయారీ మరియు ఎక్స్‌పైరీ తేదీలను తప్పనిసరిగా తనిఖీ చేయండి. వీలైతే ఇంట్లోనే తాజాగా తయారుచేసుకోవడం ఆరోగ్యానికి అత్యంత సురక్షితం.

Advertisment
తాజా కథనాలు