5ఏళ్లుగా మ‌హిళ క‌డుపులో క‌త్తెర‌.. ఆపరేషన్ చేసిన డాక్టర్ షాకింగ్ సమాధానం

కేరళలో వైద్యరంగం తలదించుకునేలా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ టైంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఒక మహిళ ఐదేళ్లపాటు నరకాన్ని అనుభవించింది. కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని గుర్తించకుండానే కుట్లు వేయడంతో ఆ మహిళ ఐదేళ్లుగా అనారోగ్యంతో కొట్టుమిట్టాడింది.

New Update
kerala docter

హాస్పిటల్స్, ఆపరేషన్ అంటేనే వణుకుపడుతోంది. డాక్టర్ల నిర్లక్ష్యానికి పేషెంట్ల ప్రాణాలు బలవుతున్నాయి. కేరళలో వైద్యరంగం తలదించుకునేలా ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శస్త్రచికిత్స సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ ఐదేళ్లపాటు నరకాన్ని అనుభవించింది. కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని గుర్తించకుండానే కుట్లు వేయడంతో, ఆ మహిళ ఐదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో కొట్టుమిట్టాడింది.

కేరళకు చెందిన ఉషా జోసెఫ్ అనే మహిళ గర్భాశయ సంబంధిత సమస్యతో బాధపడుతూ 2021లో అలప్పుజాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరారు. అక్కడ ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. అయితే, సర్జరీ సమయంలో వైద్యులు పొరపాటున ఒక సర్జికల్ ఫోర్సెప్స్‌ను ఆమె కడుపులోనే వదిలేశారు.

సర్జరీ తర్వాత ఉషకు నిరంతరం కడుపునొప్పి వస్తుండేది. అనేకసార్లు సదరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా, అక్కడి వైద్యులు ఆమె సమస్యని సీరియస్‌గా తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. చివరకు భరించలేక ఆమె ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ తీసిన ఎక్స్-రేలో ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ఇది చూసి బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ శస్త్రచికిత్స చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ లలితాంబిక ప్రస్తుతం సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. ఆ సర్జరీ తాను చేయలేదని ఆమె బుకాయించే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆ ఫోర్సెప్స్ కడుపులో ఉన్నా, మరో 50 ఏళ్ల వరకు ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉషకు వస్తున్న సమస్యలు కిడ్నీలో రాళ్ల వల్ల కలిగినవే తప్ప, కత్తెర వల్ల కాదని వాదించారు.

స్పందించిన ప్రభుత్వం

ఈ వ్యవహారం కేరళలో తీవ్ర దుమారం రేపడంతో ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ రంగంలోకి దిగారు. డాక్టర్ లలితాంబిక చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేసేందుకు ఒక మెడికల్ బోర్డును ఏర్పాటు చేశారు. బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం ఉషా జోసెఫ్‌కు కొచ్చిలోని అమృత ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి, ఆమె కడుపులోని ఆ కత్తెరను తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం ఒక సామాన్యురాలి ప్రాణాలను ఎలా పణంగా పెడుతుందోనన్న దానికి ఈ ఘటనే నిదర్శనం.

Advertisment
తాజా కథనాలు