Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూ రాజకీయ దుమారం.. అసలేం జరుగుతోంది?

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ మంగళవారం బ్యారేజ్ ను పరిశీలించింది. 20వ పిల్లర్ వద్ద ఏర్పడ్డ పగుళ్లను పరిశీలించిన బృందం సభ్యులు.. ఇందుకు గల కారణాలు ఏంటనే అంశంపై దృష్టి సారించారు. బ్యారేజ్ పటిష్ఠత, జరిగిన నష్టంపై ఈ కమిటీ అంచనా వేసినట్లు తెలుస్తోంది. బ్యారేజీకి ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

New Update
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూ రాజకీయ దుమారం.. అసలేం జరుగుతోంది?

మేడిగడ్డ (Medigadda Barrage) చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతుంది. కేసీఆర్ ను (CM KCR) లక్ష్యంగా చేసుకుని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. లక్ష కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్, కాంట్రాక్టర్ కలిసి దిగమింగారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు కేసీఆర్ రాజీనామా చేయాలని పట్టుపడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపైన విమర్శలు వస్తున్న వేళ కేంద్రం నుంచి వచ్చిన ఆర్గురు సభ్యుల నిపుణుల కమిటీ ప్రాజెక్టు సందర్శనకు రావటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరో వైపు ఎన్నికలు సంభవిస్తున్న వేళ ఈ సంఘటనలు చోటుచేసుకోవటంతో దీని వెనక కుట్రకోణం ఉందనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: KTR: కర్ణాటక వీడియోతో కాంగ్రెస్ పై కేటీఆర్ పంచ్ లు.. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అంటూ..!

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో (Kaleswaram Project) కీలకంగా భావిస్తున్న మేడిగడ్డ (లక్ష్మీ)బ్యారేజిలో 20వ పిల్లర్ శనివారం రాత్రి భారీ శబ్దంతో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం కలకలం రేపింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్​లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశయంలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నీటిమట్టం కనిష్ఠస్థాయికి చేరడం వల్ల పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక పిల్లరు కుంగుబాటుకు గురి కాగా.. రెండు వైపులా ఉండే పిల్లర్లపైనా ఆ ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఆదివారం వంతెనను పరిశీలించిన రాష్ట్ర నిపుణుల బృందం.. ఒక పిల్లరు మాత్రమే దెబ్బతిందని, బ్యారేజీ పటిష్ఠతకు ఢోకా లేదని స్పష్టం చేసింది. ఎల్​ అండ్​ టీ నిర్వహణలోనే బ్యారేజీ ఉందని.. త్వరలో పనులు చేపడతామని ప్రాజెక్టు అధికారులు, ఎల్​ అండ్​ టీ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ- మహారాష్ట్రకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్షాల విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పటిష్ఠ భద్రత కొనసాగుతోంది.

కేంద్ర నిపుణుల బృందం పరిశీలన
వంతెన కుంగిన ఘటనపై పరిశీలనకు ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. మంగళవారం బ్యారేజీని పరిశీలించింది. 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు గల కారణాలతో పాటు బ్యారేజీ పటిష్ఠత, జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేసింది. సమగ్ర పరిశీలన తర్వాత కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదించనుంది.

అసాంఘిక శక్తుల ప్రమేయం లేదు : భూపాలపల్లి ఎస్పీ
ఇందులో కుట్రకోణం దాగి ఉందని, ఎందుకంటే పిల్లర్ నెంబర్ 20 దగ్గర పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఎవరైనా కుట్ర జరిపి ఉంటారనే అనుమానాలను ఇరిగేషన్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాఫ్తు జరిపించాలని ఇరిగేషన్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహదేవ్ పూర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారి రవికాంత్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 427 ఐపీసీ 3 అండ్ 4 పబ్లిక్ డ్యామేజ్ కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో
భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఘారే ప్రకటన విడుదల చేశారు.

బ్యారేజీకి ముప్పు లేదు : ఎల్ అండ్ టీ
ప్రస్తుత ప్రమాదం వల్ల బ్యారేజీకి ఎటువంటి ప్రమాదం లేదని ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బ్యారేజీ డిజైన్‌ చేసి ఇచ్చారని, ఈ మేరకు తాము నిర్మాణ పనులను చేపట్టామని అన్నారు. వరద నీటి సామర్థ్యం విడుదల సామర్థ్యం 28.25 లక్షల క్యూసెక్కులకు అనుగుణంగా డ్యామ్ నిర్మించామన్నారు.

లక్షకోట్ల ప్రజాధనం దుర్వినియోగం : రేవంత్
కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేసీఆర్, కాంట్రాక్టర్లు కలిసి దోచుకున్నారని...నాణ్యతాలోపం వల్ల ప్రమాదం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. బ్యారేజ్ కుంగడంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ జరపాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఎన్నికల కమిషన్ మేడిగడ్డపై విచారణకు ఆదేశించాలని అన్నారు. తాము త్వరలోనే మేడిగడ్డకు వెళ్లి అక్కడి పరిస్థితి పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కాంగ్రెస్ నేతలతో కలిసి మేడిగడ్డకు రావాలని డిమాండ్ చేశారు. "కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాం కుంగుబాటు ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించాలి. వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. సిట్టింగ్‌ జడ్డితో విచారణ జరిపించాలి"అని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మేడిగడ్డకు బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్, మేధావులు, రైతులు, జర్నలిస్టులను వెంట తీసికెళ్లాలని భావిస్తోంది.

కేసీఆర్ రాజీనామా చేయాలి : బీజేపీ
సూపర్ ఇంజనీర్లు, డ్రీమ్ ప్రాజెక్టు అంటూ సీఎం కేసీఆర్ జబ్బలు చరుచుకున్నారనీ, 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఇంజినీర్ గా మారి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. నిపుణులు, ఇంజనీర్ల మాటల్ని పట్టించుకోకుండా నిర్మించిన ప్రాజెక్టు సమస్యలమయంగా మారిందని అన్నారు. గతంలో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో పంపుహౌజ్ మనిగిపోయి.. భారీ నష్టం వాటిల్లిందన్నారు. యాంటీ గ్రావిటీ ప్రాజెక్టు అని గొప్పలు చెప్పారు. కానీ, నిర్మాణంలో ప్రభుత్వం బొక్కబోర్లా పడిందని విమర్శించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ‘‘మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా ఇసుక మేటపై నిర్మించారు. నది ప్రవాహానికి ఇసుక పోవడంతో బ్యారేజీ కుంగింది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత.. సీఎం కేసీఆరే వహించాలి. డ్యాం వద్ద అసలు సమాచారం బయటకు తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీనామా చేయాలి" అని , బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. "మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌దే బాధ్యత. డ్యాం కుంగిపోవడం నిజంగా హాస్యాస్పదం. తానే ఇంజినీర్‌గా చెప్పుకునే కేసీఆర్‌.. మేడిగడ్డ ఘటనపై స్పందించాలి. డ్యాం కుంగుబాటుపై సమగ్ర విచారణ జరపాలి’’ అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి : ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం సంబంధించి అంతర్జాతీయ నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టులో రీడిజైన్ పేరిట పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి బ్యారేజీ కట్టామని గొప్పలు చెప్పిన కేసీఆర్‌ బ్యారేజీ కుంగిపోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు