కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాపురం చేస్తున్నారు: కిషన్ రెడ్డి

తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌తో సంసారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ సోనియా గాంధీ ఆఫీస్ అని ఆయన ఆరోపించారు.

New Update
కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాపురం చేస్తున్నారు: కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే.. 

కాంగ్రెస్ , బీఆర్ఎస్‌కి దగ్గర సంబంధం ఉందని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌తో సంసారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా పని చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ సోనియా గాంధీ ఆఫీస్ అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం డీఎన్‌ఏ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే బీఆర్‌ఎస్ పార్టీకి వేసినట్లేనని.. బీఆర్‌ఎస్‌కి ఓటు వేస్తే ఎంఐఎంకి వేసినట్లేనని తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తెలిపారు. అలాగే టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన కార్యకర్తలను బీజేపీలో చేరాలని ఆహ్వానిస్తున్నామన్నారు.

కాషాయ జెండా ఎగరేస్తాం..

అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం పూర్తిగా గోబెల్స్​ ప్రచారం చేస్తోందన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ అధికారంలోకి రాదని అనేక సర్వేల్లో వాళ్లకు తెలిసిందని.. అందుకే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని అనేక ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందన్నారు. కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు కుటుంబ పార్టీ కి లేదని.. కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు.

publive-image

కేసీఆర్ చేతిలో బందీ మారింది.. 

మిగులు బడ్జెట్‌​గా ఉన్న రాష్ట్రం.. ఈరోజు అప్పుల తెలంగాణగా మారిందని అన్నారు. 1200 మంది అమరవీరులు బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణ.. కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీగా మారిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అవినీతి తెలంగాణలో జరిగిందని ఆరోపించారు. బంగారు తెలంగాణ కాలేదు కానీ.. కేసీఆర్​ కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై.. కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లుతోందన్నారు.

చారిత్రక సంపదను రక్షించుకుందాం.. 

మరోవైపు చార్మినార్, గోల్కోండ కోటలు హిస్టారికల్ మాన్యుమెంట్స్ కింద భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాటి బాధ్యతలు నిర్వహణ చూసుకుంటుందని తెలిపారు. ఈ రెండింటినీ కూడా డెవలప్ చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు రావడం తెలంగాణకు, దేశానికి గర్వకారణమన్నారు. వచ్చే నెలలో గోల్కొండలో ఇల్యుమినేషన్, లైట్ అండ్ సౌండ్ షో ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. వరంగల్‌ వెయ్యి స్తంభాల గుడిలో మండపంను ఈ ఏడాది నవంబర్‌ లోపు పూర్తి చేయాలని ముందుకు వెళ్తున్నామన్నారు. చారిత్రక సంపదను రక్షించుకుంటూ.. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు