/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/karna-sena-1-jpg.webp)
Karnisena President Brutally Murdered: రాజస్థాన్ రాజధాని జైపూర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. కాగా ఈ కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనతో జైపూర్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను పెంచారు.
జైపూర్ నగరంలో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితి నెలకొంది. మరొకవైపు నిందితుల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర మార్గాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం జైపూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతంలోని గోగమేడి ఇంటి దగ్గర ఆయన మీద దాడి జరిగినట్లు స్ధానికులు చెబుతున్నారు.
ఆనంద్‌పాల్ ఎన్‌కౌంటర్ కేసు తర్వాత గోగమేడి తొలిసారి వెలుగులోకి వచ్చారు. ఆ సమయంలో ఆనందపాల్ మృతదేహానికి సంబంధించి చాలా రోజుల పాటు ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత గోగమేడి పేరు చాలా చర్చలోకి వచ్చింది. పద్మావతి సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన సెట్స్‌లో చెప్పుతో కొట్టడంతో సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి మరోసారి వెలుగులోకి వచ్చారు.
పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆయన పోరాటాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దానిపై నిరసన వ్యక్తం చేశారు. దీని ఫలితంగా నిర్మాత చిత్రం పేరును పద్మావత్‌గా మార్చవలసి వచ్చింది. దాని నుంచి అనేక సన్నివేశాలను కూడా తొలగించాల్సి వచ్చింది. దీని తర్వాత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి రాజ్‌పుత్ యువతకు ఆదర్శంగా నిలిచారు.
సుఖ్‌దేవ్ సింగ్ 2018 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే అది సఫలం కాలేదు. గత కొన్నేళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సుఖ్‌దేవ్ సింగ్ గొడవలు పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. సుఖదేవ్ సింగ్‌ను చంపుతామంటూ గతంలో లారెన్స్ విష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సంపత్ నెహ్రూ నుంచి పోలీసులకు బెదరింపు కాల్స్ వచ్చాయని తెలుస్తోంది. సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడిని ఆగంతకులు కాల్చిచంపడంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సీఎం ఫైనల్ రేసులో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్.. హైకమాండ్ ఎవరి వైపు?