మాజీ జవాన్ చదువుల యుద్ధం.. 138 డిగ్రీలతో ప్రపంచ రికార్డులు!

సాధారణంగా ఒక వ్యక్తికి ఒకటి లేదా రెండు పీజీలు ఉంటేనే గొప్పగా చెప్పుకుంటాం. కానీ, రాజస్థాన్‌కు చెందిన ఒక మాజీ సైనికుడు మాత్రం విద్యపై తనకున్న మమకారంతో ఏకంగా వందకు పైగా డిగ్రీలను సాధించి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు.

New Update
_ world record with 138 degrees

సాధారణంగా ఒక వ్యక్తికి ఒకటి లేదా రెండు పీజీలు ఉంటేనే గొప్పగా చెప్పుకుంటాం. కానీ, రాజస్థాన్‌కు చెందిన ఒక మాజీ సైనికుడు మాత్రం విద్యపై తనకున్న మమకారంతో ఏకంగా వందకు పైగా డిగ్రీలను సాధించి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడడమే కాకుండా, జ్ఞాన సముపార్జనలో కూడా తానేంటో నిరూపించుకుంటూ 138 డిగ్రీలతో ప్రపంచ రికార్డులకెక్కిన ఆ ధీశాలి పేరే దశరథ్ సింగ్.

సరిహద్దుల నుంచి సర్టిఫికెట్ల వరకు
రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1969లో జన్మించిన దశరథ్ సింగ్‌కు చిన్నప్పటి నుంచే చదువంటే ప్రాణం. ఇంట్లో సరైన విద్యావంతులు లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతున్నా పట్టువదలకుండా టెన్త్ పూర్తి చేశారు. 1988లో భారత సైన్యంలో చేరిన ఆయన, దాదాపు 16 ఏళ్ల పాటు పంజాబ్, జమ్మూకశ్మీర్ వంటి కఠినమైన సరిహద్దు ప్రాంతాల్లో దేశానికి సేవలందించారు. 2004లో పదవీ విరమణ చేసినప్పటికీ, ఆయనలోని విద్యార్థి మాత్రం నిరంతరం మేల్కొనే ఉన్నాడు.

సెలవుల్లో యుద్ధం కాదు.. చదువు!

సైన్యంలో పనిచేసేటప్పుడు చాలామంది సెలవుల్లో ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. కానీ దశరథ్ సింగ్ మాత్రం ఏడాదిలో తనకు దొరికే రెండు నెలల సెలవులను కేవలం పరీక్షలు రాయడానికి, ఉన్నత చదువులు చదవడానికి మాత్రమే కేటాయించేవారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన తన వేగాన్ని మరింత పెంచారు. తొలుత బీకామ్‌తో మొదలుపెట్టి.. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, బీఈడీ వంటి వృత్తి విద్యా కోర్సులను రెగ్యులర్‌గా పూర్తి చేశారు. ఇప్పటివరకు దశరథ్ సింగ్ సాధించిన విద్యార్హతలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.

పీహెచ్‌డీలు: 3, పీజీ (మాస్టర్స్) డిగ్రీలు: 46, యూజీ (డిగ్రీలు): 7, డిప్లొమా కోర్సులు: 23, సైనిక విద్య డిగ్రీలు: 7, సర్టిఫికెట్ కోర్సులు: 52= మొత్తం: 138

ఇగ్నో (IGNOU) వంటి సార్వత్రిక విశ్వవిద్యాలయాలతో పాటు పలు ప్రైవేట్ వర్సిటీల నుంచి ఆయన ఈ పట్టాలను అందుకున్నారు. ఇటీవల వేద విభాగంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేయడం విశేషం. దశరథ్ సింగ్ అకుంఠిత దీక్షకు ప్రతిఫలంగా అనేక గౌరవాలు ఆయన్ను వరించాయి. ఇప్పటివరకు ఆయన పేరు మీద 11 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయన పేరు మీద ఉన్నాయి. 

చదువుకోవాలనే తపన ఉంటే వయసుతో నిమిత్తం లేదని, ఆర్థిక స్థితిగతులు అడ్డుకావని దశరథ్ సింగ్ నిరూపించారు. నేటి తరం విద్యార్థులకు, యువతకు ఆయన ఒక గొప్ప స్ఫూర్తిప్రదాత. "జ్ఞానమే ఆయుధం" అని నమ్మిన ఈ చదువుల సింహం ప్రయాణం మరిన్ని విజయాల దిశగా సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు