CM Jagan : ఈ 5 అంశాలే జగన్ జోరు తగ్గించాయా?

'నా వెంట్రుక కూడా పీకలేరు' ఏడాది క్రితం జగన్‌ ఆవేశంగా చెప్పిన మాటలివి. అయితే ఎన్నికల పోలింగ్‌ తర్వాత వైసీపీ చాలా సైలెంట్‌ అయిపోయిందంటున్నారు విశ్లేషకులు. ఇందుకు ఈ 5 అంశాలే ప్రధాన కారణమంటున్నారు. అవేంటో తెలుసుకునేందుకు ఈ అర్టికల్ చదవండి.

New Update
CM Jagan : ఈ 5 అంశాలే జగన్ జోరు తగ్గించాయా?

AP : 'నా వెంట్రుక కూడా పీకలేరు..' ఏడాది క్రితం జగన్‌(CM Jagan) ఆవేశంగా చెప్పిన మాటలివి. అయితే ఎన్నికల పోలింగ్‌(Election Polling) ముగిసిన తర్వాత మాత్రం వైసీపీ(YCP) చాలా సైలెంట్‌ అయిపోయిందంటున్నారు విశ్లేషకులు. సైకిల్‌ స్పీడ్‌కి తోడు తుప్పుబట్టిన ఫ్యాన్‌ రెక్కలు జగన్‌ పతనాన్ని సూచిస్తున్నాయంటున్నారు. 2019లో 175 స్థానాల్లో ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు కొల్లగొట్టిన జగన్‌ జోరు ఐదేళ్లలో అమాంతం పడిపోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌(Land Titling Act) నుంచి ఆలయాలపై దాడుల వరకు జగన్‌ ప్రభుత్వంలో జరిగిన ఐదు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ ఐదు అంశాలే జగన్‌ విజయవకాశాలను దెబ్బతీస్తాయంటున్నారు. ఇంతకీ ఏంటా ఐదు అంశాలు?

ఉద్యోగాలు కల్పించడంలో విఫలం..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి ముఖ్యమైన కారణాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం ప్రధాన అంశం. అందుకే ఆనాడు యువత జగన్‌కు జైకొట్టారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మెగా డీఎస్సీపై సంతకం చేస్తానని కూడా చెప్పారు. అయితే సచివాలయ ఉద్యోగాలు, గ్రూప్‌-1 జాబ్స్‌ మినహా జగన్‌ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా డీఎస్సీ విషయంలో యువత తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమీపిస్తోన్న సమయంలో 6వేల పోస్టులకు నోటిఫికేషన్‌ రిలీజ్ చేశారు. అయితే 20వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని కేవలం 6వేల పోస్టులకే నోటిఫికేషన్‌ రిలీజ్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఆ 6వేల పోస్టులకు కూడా ఎగ్జామ్‌ జరగకపోవడం యువత ఆగ్రహానికి కారణమైందంటున్నారు విశ్లేషకులు!

Also Read : టీడీపీ మహానాడు వాయిదా.. కారణం ఏంటంటే!

ఇదే జగన్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది..
రాష్ట్రంలోని భూములను డిజిటల్‌గా డాక్యుమెంట్ చేసేందుకు జగన్‌ ప్రభుత్వం ఏపీ భూ పట్టాదారు చట్టాన్ని తీసుకొచ్చింది . దేశంలో తొలిసారి అమలవుతోన్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమైంది. ఈ చట్టం భూకబ్జాదారులకు వరంగా మారిందని టీడీపీ-జనసేన ఆరోపించాయి. ఇదే విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యాక్ట్‌ను రద్దు చేస్తామని టీడీపీ, జనసేన ప్రకటించాయి. ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధమైన హక్కులను ప్రభుత్వం నియమించే వ్యక్తుల చేతిలోకి వెళ్లే అవకాశాన్ని ఈ యాక్ట్‌ కల్పిస్తోందని టీడీపీ బలంగా వాదించింది. ఇది జగన్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది.

దేవాలయాలపై దాడి కేసులు..
వైసీపీకి అధికారాన్ని దూరం చేసే మరో విషయం దేవాలయాలపై దాడి కేసులు. ఐదేళ్ల వైసీపీ పాలనలో 219 ఆలయాలపై దాడులు జరిగాయని జనసేన ఆరోపిస్తోంది. విజయనగరం రామతీర్థం ఆలయం, అంతర్వేది నరసింహ స్వామి ఆలయంతో పాటు అక్కడ పూజారులపై దాడులు జరగడం ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపాయి. హిందూ దేవాలయాల పవిత్రతపైనా, అర్చకుల గౌరవంపైనా గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు జరిగాయని టీడీపీ అనేక సందర్భాల్లో విమర్శలు గుప్పించింది. అటు తిరుమల కొండపై చిరుత దాడులు కలకలం రేపాయి. ఓ ఆరేళ్ల చిన్నారి చిరుత దాడిలో చనిపోవడం వైసీపీ అసమర్థతను ఎత్తి చూపిందని టీడీపీ ఆరోపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చుట్టూ అనేక వివాదాలు రాజుకున్నాయి.

కొత్త రాజధాని కోసం ఎదురుచూపులు..
అటు ఏపీ రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని కోసం ఎదురుచూస్తుండడానికి జగన్ ప్రభుత్వమే కారణమంటున్నారు. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. అయితే జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. అదే అమలు చేయాలని భావించారు. అందులోనూ సక్సెస్ కాలేకపోయాడని చెబుతుంటారు విశ్లేషకులు.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం..
20 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా చేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరువు పీడిత రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అత్యంత కీలకమైనదిగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.16,000 కోట్ల వ్యయం అవుతుందని మొదట్లో అంచనా వేశారు. అయితే ఆలస్యం కారణంగా ఇప్పుడది రూ.50,000 కోట్లకు పైగా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.15 వేల కోట్లు వచ్చినా వైసీపీ మాత్రం ఆ నిధులను ఉపయోగించడంలో విఫలమైందని మోదీ విమర్శించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు