Liver Health : ఈ భాగాల్లో వాపు వస్తే లివర్ డ్యామేజ్ అయినట్లే!

నిశ్చల జీవనశైలికి ఊబకాయం, మధుమేహం తోడైతే కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీసి ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు కారణమవుతుంది.అయితే నిపుణులు ఈ భాగాల్లో వాపు వస్తే లివర్ డ్యామేజ్ అయినట్టే అని చెప్తున్నారు.అదేంటో చూసేయండి!

New Update
Liver Health : ఈ భాగాల్లో వాపు వస్తే లివర్ డ్యామేజ్ అయినట్లే!

నిశ్చల జీవనశైలికి ఊబకాయం, మధుమేహం తోడైతే కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీసి ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు కారణమవుతుంది. ఈ వ్యాధి కారణంగా మనిషి జీవన విధానం అస్తవ్యస్తం అవుతుంది. సరైన సమయంలో గుర్తించకపోతే వ్యాధి తీవ్రమై, లివర్ సిర్రోసిస్‌గా రూపాంతరం చెందుతుంది. ఇది కాలేయం వైఫల్యానికి కారణమై, ప్రాణాంతకంగా కూడా మారొచ్చని చెబుతున్నారు ముంబైలోని గ్లెనెగల్స్ హాస్పిటల్స్‌లో హెపటాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ అలీషా చౌబల్. ఆమె హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఫ్యాటీ లివర్ వ్యాధి ముదిరితే శరీరంలోని కొన్ని భాగాల్లో వాపు వస్తుందన్నారు. వీటి ద్వారా కాలేయ సమస్య ఉన్నట్లు తెలుసుకోవచ్చని తెలిపారు.

* కాళ్లు, చీలమండల వాపు

ఫ్యాటీ లివర్ డిసీజ్‌తో కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది పోర్టల్ హైపర్‌టెన్షన్‌కు దారితీయవచ్చు. దాని నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా కాళ్లు, చీలమండల్లో వాపు (ఎడెమా) ఏర్పడుతుంది. ఒత్తిడి నిరంతరం పెరిగితే శరీర కణజాలంలో ద్రవం చేరుతుంది. దాని ఫలితంగా వాపు ఏర్పడుతుంది.

* పొత్తికడుపు వాపు (అసిటిస్)

ఫ్యాటీ లివర్ వ్యాధి బాగా ముదిరితే అసిటిస్ ఏర్పడుతుంది. ఉదర కుహరంలో ద్రవం పేరుకుపోవడాన్ని అసిటిస్ అంటారు. దీనివల్ల కాలేయంలో వాపు వస్తుంది. ఫలితంగా కాలేయంలోని రక్త నాళాలు అధిక ఒత్తిడికి గురవుతాయి. దీన్ని పోర్టల్ హైపర్‌టెన్షన్ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో ఒత్తిడి మరింత పెరిగి, కాలేయ రక్తనాళాల నుంచి ఉదర కుహరంలోకి ద్రవం లీక్ అవుతుంది. ఫలితంగా పొత్తికడుపు వాపు, అసౌకర్యానికి దారితీయవచ్చు. ఈ ద్రవం క్షయ, క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధుల ముప్పును పెంచుతుంది. అందుకే ఈ ద్రవాన్ని టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం.

* పాదాల వాపు

ఫ్యాటీ లివర్ వ్యాధి ముదిరితే కాళ్లు, చీలమండలే కాకుండా పాదాలు సైతం వాపుకు గురయ్యే అవకాశం ఉంది. ముఖం ఉబ్బడం, చేతుల్లో వాపు కూడా ఉండవచ్చు.

* పరుషుల్లో గైనెకోమాస్టియా రిస్క్

డాక్టర్ అలీషా చౌబల్ మాట్లాడుతూ.. ‘మగవారిలో తీవ్రమైన ఫ్యాటీ లివర్ వ్యాధి గైనెకోమాస్టియాకు దారితీస్తుంది. అంటే రొమ్ము కణజాలం విస్తరిస్తుంది. ఈ పరిస్థితి కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో కాలేయం పనిచేయకపోవడం, లైంగిక కోరికలు తగ్గిపోవడం, వంధ్యత్వానికి దారితీయవచ్చు.’ అని చెప్పారు.

* చిక్సితతో పాటు జీవనశైలిలో మార్పులు కీలకం

ఈ శరీర భాగాల్లో నిరంతర వాపు ఉన్నవారు రక్త పరీక్షలు, CT స్కాన్, MRI స్కాన్ వంటి టెస్టులు చేయించుకోవాలి. వీటి ద్వారా శరీరంలో వాపుకు కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవచ్చు. వ్యాధి నిర్ధారణ అయితే సరైన చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం కూడా తప్పనిసరి. హెల్తీ డైట్ ఫాలో అవ్వడం, రెగ్యులర్‌‌గా వర్కౌట్స్ చేయడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వంటి మంచి పద్ధతులు పాటిస్తే ఫ్యాటీ లివర్ డిసీజ్ రిస్క్ తగ్గుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు