Green Card : గ్రీన్‌ కార్డుల మెమో నిర్లక్షపూరిత నిర్ణయం..ట్రంప్ పై న్యాయనిపుణుల మండిపాటు

అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌ కార్డు) కోసం ఎదురుచూస్తున్న వారి విషయంలో ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన నూతన నిబంధనలపై తీవ్ర ఆందోళనతో పాటు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది తీవ్ర నిర్లక్ష్యపూరిత, తప్పుడు నిర్ణయమని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.

New Update
green card

World Legal Experts Oppose Green Card Memo

Green Card : అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌ కార్డు) కోసం ఎదురుచూస్తున్న తాత్కాలిక వలసదారులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉంటున్న వలసదారులు తమ స్వదేశాలకు వెళ్లి అక్కడ నుంచే గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని, అమెరికాలో ఉంటూ స్టేటస్ మార్పు (అడ్జస్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేటస్‌) చేసుకోవడం కుదరదంటూ ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన నూతన నిబంధనలపై తీవ్ర ఆందోళనతో పాటు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చట్ట నిబంధనలను పూర్తిగా పాటిస్తూ చేసుకున్న దరఖాస్తులపై తుది నిర్ణయాన్ని పూర్తిగా ఇమ్మిగ్రేషన్ అధికారుల విచక్షణకే వదిలేయడంపై చట్టసభ సభ్యులు, న్యాయ నిపుణులు మండిపడుతున్నారు. ఇది తీవ్ర నిర్లక్ష్యపూరిత, తప్పుడు నిర్ణయమని వారు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు, ఈ నూతన విధానం చట్టపరంగా ఎంతవరకు చెల్లుబాటు అవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్‌తో కీలకమైన వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకున్న తరుణంలో, భారత ప్రభుత్వంపై దౌత్యపరమైన ఒత్తిడి పెంచేందుకే ట్రంప్‌ సర్కారు ఈ వ్యూహాత్మక ఎత్తుగడ వేసిందా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. తాజా నిబంధనల వల్ల అమెరికాలో దశాబ్దాలుగా నివసిస్తున్న సుమారు 12 లక్షల భారతీయ కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వివాదాస్పద నిర్ణయంపై డెమోక్రటిక్‌ పార్టీ చట్టసభ సభ్యులు తీవ్రంగా స్పందించారు. ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఈ మెమోను వెనక్కి తీసుకునే వరకూ ప్రతి వేదిక మీదా తాము పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఎంతో కాలంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, చట్టాలను గౌరవిస్తూ గ్రీన్‌ కార్డు కోసం చాటక పక్షుల్లా ఎదురు చూస్తున్న వారికి ఈ నిర్ణయం ఆశనిపాతమని బైడెన్ హయాంలో శ్వేత సౌధం (వైట్‌హౌస్) సలహాదారుగా పని చేసిన అజయ్‌ భూటోరియా పేర్కొన్నారు. ఐ-485 (I-485) ఫారమ్ ద్వారా అడ్జస్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేటస్‌కు దరఖాస్తు చేసుకున్నవారు అన్ని నిబంధనలను పాటించినప్పటికీ, వాటిని పరిశీలించకుండానే తిరస్కరించే విచక్షణాధికారం ఇప్పుడు అమెరికా అధికారులకు లభించిందని, ఇకపై కేవలం చట్టబద్ధ అర్హతలు ఉంటే సరిపోవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నూతన విధానంపై క్యాటో ఇన్‌స్టిట్యూట్‌ వలస విభాగం డైరెక్టర్‌ డేవిడ్‌ జె.బైర్‌ కూడా స్పందిస్తూ.. ఇదో లాజిక్‌ లేని నిర్ణయమని, దీనివల్ల ప్రతిభావంతులైన అంతర్జాతీయ నిపుణులు అమెరికాను వీడి ఇతర దేశాలకు వలస వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. అలాగే టెక్సాస్‌ కాంగ్రెస్‌మన్‌ జోక్విన్‌ క్యాస్ట్రో మాట్లాడుతూ.. అమెరికాలో వేల సంఖ్యలో ఉన్న గ్రీన్‌ కార్డు దరఖాస్తుదారులలో నర్సులు, టీచర్లు, ఇంజినీర్లు, మెకానిక్‌లు, వ్యవసాయ కార్మికులు ఉన్నారని, వారందరినీ దేశం నుంచి పంపించేయాలనే కుట్రతోనే ట్రంప్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ అనాలోచిత నిర్ణయం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తుందని, భార్యాభర్తలను, తల్లిదండ్రులను, పిల్లలను విడదీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ప్రభుత్వం జారీ చేసిన ఈ మెమోను కోర్టులో సవాలు చేయడానికి చట్టపరంగా విస్తృత అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ నూతన విధానాన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఏ వీసాదారులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే దానిపై ప్రస్తుతం అమెరికాలో విస్తృత చర్చ జరుగుతోంది. కొన్ని సడలింపులు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, అవి ఎవరెవరికి వర్తిస్తాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

వివిధ వీసా కేటగిరీలపై  ప్రభావం..

హెచ్‌1బీ (H-1B), ఎల్‌1 (L1) వీసాదారులు:

వలసేతర (Non-immigrant) కేటగిరీలో ద్వంద్వ ఉద్దేశంతో (Dual Intent) చట్టబద్ధ స్టేటస్‌ను కొనసాగించినప్పటికీ, గ్రీన్‌ కార్డు దరఖాస్తుకు అదొక్కటే సరిపోదు. సుదీర్ఘకాలంగా అమెరికాలో నివసిస్తున్నామన్న ఏకైక కారణంతో ‘అడ్జస్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేటస్‌’ లభించదు. ఇకపై ఇది సాధారణ పరిపాలనా ప్రక్రియ ఎంతమాత్రం కాదు. అధికారులు దరఖాస్తుదారుడి పన్నుల చరిత్ర (Tax History), కుటుంబ పరిస్థితులు, కెరీర్‌ పురోగతి, ఇతర సాక్ష్యాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.

ఎఫ్‌1 (F1) వీసాదారులు (విద్యార్థులు):

ఎఫ్‌1 అనేది ద్వంద్వ ఉద్దేశ వీసా కాదు. ఒకవేళ విద్యార్థి అమెరికాలోనే పీహెచ్‌డీ పూర్తి చేసి, స్టెమ్‌ ఓపీటీ (STEM OPT) లో ఉంటూ ‘స్టేటస్’ మార్పునకు దరఖాస్తు చేసుకుంటే.. తన పరిశోధన లేదా ఉద్యోగం అమెరికా జాతీయ ప్రయోజనాలకు (National Interest) అనుగుణంగా ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలా నిరూపించగలిగితేనే వారు గ్రీన్‌ కార్డుకు బలమైన దరఖాస్తుదారులుగా నిలుస్తారు.

ఈబీ2 (EB2), ఈబీ3 (EB3) కేటగిరీలు:

ఈబీ2, ఈబీ3 బ్యాక్‌లాగ్‌లో ఉండి, దశాబ్ద కాలంగా గ్రీన్‌ కార్డు కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగులు అమెరికాలోనే ఉండి దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పుడు అత్యంత బలమైన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. తమకు అమెరికాతో సానుకూల సంబంధాలు ఉన్నాయని, సుదీర్ఘ ఉద్యోగ అనుభవం ఉందని, తమ పిల్లలు ఇక్కడే పెరిగి పెద్దయ్యారని అధికారులకు నిరూపించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును ఆమోదించాలా లేదా అనేది పూర్తిగా అధికారుల చేతుల్లోనే ఉండటంతో వలసదారుల్లో తీవ్ర ఉత్కంఠ, భయాందోళనలు నెలకొన్నాయి.