/rtv/media/media_files/2026/03/13/iran-2026-03-13-18-26-24.jpg)
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఫిబ్రవరి 28వ తేదీన ఈ యుద్ధం.. రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికి ముగియడం లేదు. ఇక అమెరికాకు ఆశించిన విజయం దక్కలేదు. ఇరాన్ నాశనమైందని ట్రంప్ ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ట్రంప్ ఈ యుద్ధంలో విజయం సాధించలేకపోవడానికి గల 7 ప్రధాన కారణాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హోర్ముజ్ జలసంధి క్లోజ్
ప్రపంచంలోనే అతి ముఖ్యమైన చమురు రవాణా మార్గం హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచ చమురులో 20% ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఇది మూతపడటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. దీనివల్ల అమెరికాలోనే పెట్రోల్ ధరల ఒత్తిడి పెరిగి, ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై వ్యతిరేకత పెంచుకునే ప్రమాదం ఏర్పడింది.
వైమానిక దాడుల పైనే
అమెరికా, ఇజ్రాయెల్ కేవలం వైమానిక దాడుల పైనే ఆధారపడుతున్నాయి. కానీ ఒక దేశాన్ని పూర్తిగా లొంగదీసుకోవాలంటే సైన్యం భూమిపైకి వెళ్లాలి. గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల అనుభవ దృష్ట్యా, ట్రంప్ తన సైన్యాన్ని నేరుగా ఇరాన్ గడ్డపైకి పంపడానికి ఇష్టపడటం లేదు. దీనివల్ల దాడులు జరుగుతున్నా విజయం మాత్రం అసంపూర్తిగానే ఉండిపోతోంది.
సుదీర్ఘ యుద్ధానికైనా సిద్ధం
కొద్ది రోజుల్లోనే ఇరాన్ లొంగిపోతుందని అమెరికా భావించింది. కానీ అలీ ఖమేనీ నిర్మించిన వ్యవస్థ చాలా బలంగా ఉందని తేలింది. ఇరాన్ సైన్యం, గెరిల్లా నెట్‌వర్క్ ఎంతటి సుదీర్ఘ యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం అకస్మాత్తుగా కూలిపోతే, మధ్యప్రాచ్యం అంతా అరాచకత్వం ప్రబలే ప్రమాదం ఉంది.
ఇరాన్ ఎదురుదాడి
తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ ఎదురుదాడి చేస్తోంది. అమెరికా యుద్ధ నౌకలు, చమురు ట్యాంకర్లే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న దాడులు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఫార్సా గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నౌకాదళానికి ఇది పెను సవాలుగా మారింది.
ట్రంప్ పై విమర్శలు
అమెరికాను కొత్త యుద్ధాలకు దూరంగా ఉంచుతానని ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధం ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తోంది. యుద్ధం వల్ల పెరుగుతున్న చమురు ధరలు, పౌరుల మరణాలపై అమెరికా లోపలే విమర్శలు మొదలయ్యాయి. యుద్ధాన్ని త్వరగా ముగించాలని డెమొక్రాట్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
ఆశలు అడియాశలు
యుద్ధం మొదలైన కొత్తలో అలీ ఖమేనీ మరణం ఇరాన్‌ను దెబ్బతీస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ వెంటనే బాధ్యతలు చేపట్టడంతో ఇరాన్ పాలనా వ్యవస్థలో ఎటువంటి కుదుపు రాలేదు. దీంతో ఇరాన్ లోపల రాజకీయ అస్థిరత ఏర్పడుతుందన్న అమెరికా ఆశలు అడియాశలయ్యాయి.
భిన్నమైన ఆలోచనలు
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పోరాడుతున్నా, వారి లక్ష్యాలు వేరుగా ఉన్నాయి. ఇరాన్ సైనిక శక్తిని శాశ్వతంగా తుడిచిపెట్టాలని ఇజ్రాయెల్ కోరుకుంటుండగా, ట్రంప్ మాత్రం వీలైనంత త్వరగా ఏదో ఒక ఒప్పందంతో యుద్ధం ముగించాలని చూస్తున్నారు. ఈ భిన్నమైన ఆలోచనల వల్ల యుద్ధంలో స్పష్టమైన వ్యూహం లేకుండా పోయింది.
Follow Us