Bangladesh : రాజకీయాలకు గుడ్ బై? మళ్ళీ పాత వృత్తికే ముహమ్మద్ యూనస్!

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకోనుంది. గత 18 నెలలుగా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి, విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నారు.

New Update
yunus

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకోనుంది. గత 18 నెలలుగా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి, విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయం సాధించడంతో, ఫిబ్రవరి 17న (రాబోయే మంగళవారం) తారిఖ్ రెహ్మాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో యూనస్ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు దేశ అధ్యక్ష పదవి లేదా ఏదైనా కీలక రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది.

ముఖ్యంగా తారిఖ్ రెహ్మాన్ ప్రతిభావంతులను, మేధావులను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని భావిస్తుండటంతో, యూనస్ అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. యూనస్‌కు ఉన్న అంతర్జాతీయ పరపతి దేశానికి మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం మాత్రం ఈ వార్తలను ఖండించారు. యూనస్‌కు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, తన పదవీకాలం ముగిశాక తిరిగి తన పాత వృత్తిలోకి వెళ్లి పేదరిక నిర్మూలన, సామాజిక వ్యాపారాలపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

యూనస్ తన లక్ష్యాలను చేరుకున్నానని, శాంతియుతంగా అధికారాన్ని కొత్త ప్రభుత్వానికి అప్పగించడమే తన ప్రధాన బాధ్యతని భావిస్తున్నారు. ఏదేమైనా, ఒక సంక్లిష్ట సమయంలో దేశాన్ని నడిపించిన యూనస్, అధికారిక పదవిలో ఉంటారా లేక ఒక మార్గదర్శిగా తన సేవలు అందిస్తారా అనేది త్వరలోనే తేలనుంది.

అమెరికాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా

1940లో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జన్మించారు. ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం తర్వాత, అమెరికాలోని వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. తొలుత అమెరికాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం పొందిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి, చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. పేదరిక నిర్మూలనకు ఆయన చేసిన కృషికి గానూ 2006లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

Advertisment
తాజా కథనాలు