US Iran War : ఇరాన్‌తో యుద్ధం ముగిసింది...డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనుంది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశంతో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన 'పీస్ డీల్' (శాంతి ఒప్పందం) దాదాపు పూర్తయిందన్నారు.

New Update
Donald Trump

Donald Trump

US Iran War : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు, సైనిక ఘర్షణలకు తెరపడే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఆ దేశంతో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన 'పీస్ డీల్' (శాంతి ఒప్పందం) దాదాపు పూర్తయిందని, ఈ వారాంతంలో ఐరోపా వేదికగా దీనిపై ఇరు దేశాలు సంతకాలు చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. జార్జియా గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న బర్ట్ జోన్స్ మద్దతుగా నిర్వహించిన టెలి-ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. అణు ఆయుధాలను ఎప్పటికీ తయారు చేయకూడదన్న అమెరికా ప్రధాన డిమాండ్‌కు ఇరాన్ అంగీకరించిందని, ఇది చాలా బలమైన, సమగ్రమైన ఒప్పందమని స్పష్టం చేశారు.

ఈ చరిత్రాత్మక శాంతి ఒప్పందానికి స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరం వేదిక కానుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 14 (ఆదివారం) నాటికి ఈ అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు జరిగే చాన్స్ ఉంది. అమెరికా తరఫున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్ తరఫున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ ఈ సంతకాల కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ చర్చల పురోగతిపై ట్రంప్ ఇప్పటికే ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ వంటి పశ్చిమాసియా దేశాల అధినేతలతో మాట్లాడారు. డీల్ వార్తలతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయి. శాంతి ఒప్పందం ఖరారైన తర్వాత అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హార్మూజ్ జలసంధి' తిరిగి యథావిధిగా తెరుచుకుంటుందని అమెరికా తెలిపింది.

అయితే, ఈ ఒప్పందంపై ఇరాన్ మాత్రం కొంత భిన్నమైన, అప్రమత్తమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. పీస్ డీల్‌పై తాము ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి స్పష్టం చేశారు. అమెరికాతో కుదిరే ఏ ఒప్పందంలోనైనా తమ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాలని ఇరాన్ పట్టుబడుతోంది. ముఖ్యంగా భవిష్యత్తులోనూ యురేనియం శుద్ధిని కొనసాగించే హక్కు, శుద్ధి చేసిన నిల్వలను ఉంచుకునే స్వేచ్ఛతో పాటు వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను నిలుపుకోవడం అత్యంత ముఖ్యమని శుక్రవారం ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ 'ఇర్నా' ప్రకారం.. ఈ ప్రాథమిక ఒప్పందం కుదిరిన తర్వాత, ఇరు దేశాల మధ్య ఇరాన్ అణు కార్యక్రమంపై మరో 60 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరగాల్సి ఉంది.

ఇరాన్ మీడియా సంస్థ 'మెహర్ న్యూస్ ఏజెన్సీ' లీక్ చేసిన తాజా ముసాయిదా (డ్రాఫ్ట్) ప్రకారం.. ఈ శాంతి ఒప్పందంలో ఇరాన్‌కు అనుకూలమైన పలు కీలక ఆర్థిక, సైనిక అంశాలు ఉన్నాయి. అమెరికా గతంలో ఫ్రీజ్ చేసిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల ఆస్తుల విడుదల, ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులపై ఉన్న ఆంక్షల ఎత్తివేత, ఆ దేశ ఓడరేవులపై అమెరికా నౌకాదళం విధించిన దిగ్బంధనాల రద్దు ఇందులో ప్రధానమైనవి. వీటితో పాటు ఇరాన్ పునర్నిర్మాణం కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం, లెబనాన్ సహా వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న శత్రుత్వానికి ముగింపు పలకడం వంటి అంశాలు ముసాయిదాలో ఉన్నాయి. అయితే, అమెరికా ముందుగా తమ ఫ్రీజ్డ్ నిధులలో సగాన్ని విడుదల చేసి, చమురు ఆంక్షలు సడలిస్తేనే తుది చర్చలకు వస్తామని ఇరాన్ షరతు విధిస్తుండటంతో.. ఈ చరిత్రాత్మక డీల్ ఎలా ముగుస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

Advertisment
తాజా కథనాలు