Strait of Hormuz : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు... హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా-ఇరాన్ పరస్పర దాడులు

పశ్చిమాసియాలో శాంతి ఒప్పంద ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయనే ఆశలు మళ్లీ అడియాసలయ్యాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో అమెరికా, ఇరాన్ దళాల మధ్య పరస్పర దాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా శిఖరాగ్రానికి చేరాయి.

New Update
FotoJet (93)

US-Iran Mutul Attacks the Strait of Hormuz

Strait of Hormuz : పశ్చిమాసియాలో శాంతి ఒప్పంద ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయనే ఆశలు మళ్లీ అడియాసలయ్యాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో అమెరికా, ఇరాన్ దళాల మధ్య రాత్రికి రాత్రి జరిగిన పరస్పర దాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా శిఖరాగ్రానికి చేరాయి. అంతర్జాతీయ చమురు రవాణాకు గుండెకాయ లాంటి ఈ జలసంధి వద్ద ఇరు దేశాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడటంతో పశ్చిమాసియా మరోమారు పేలుళ్లతో దద్దరిల్లింది.

అంతర్జాతీయ జలాలపై నిఘా జరుపుతున్న అమెరికాకు చెందిన MQ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడమే కాకుండా, పదే పదే దుందుడుకు చర్యలకు పాల్పడుతుండటంతో అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్‌లోని గురుక్ నగరం, ఖేష్మ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానాలు మెరుపు దాడులకు తెగబడ్డాయి. పూర్తిగా ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్లు ప్రకటించిన అమెరికా.. ఇరాన్ వైమానిక రక్షణ (ఎయిర్ డిఫెన్స్) వ్యవస్థను, ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ను, రెండు వన్-వే అటాక్ డ్రోన్లను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో తమ సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, శత్రుదేశాల నుంచి ఎలాంటి బెదిరింపులు వచ్చినా తమ ప్రయోజనాలను కాపాడుకుంటామని అగ్రరాజ్యం హెచ్చరించింది.

అమెరికా దాడులపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా అంతే తీవ్రంగా స్పందించింది. సిరిక్ ద్వీపంలోని తమ టెలికాం టవర్లపై అమెరికా దాడి చేసిందని ఆరోపిస్తూ, దానికి ప్రతీకారంగా అగ్రరాజ్యం దాడికి ఉపయోగించిన ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫైటర్స్ ప్రతిదాడికి దిగినట్లు ప్రకటించింది. ఇరాన్ అధికారికంగా బేస్ పేరును వెల్లడించనప్పటికీ.. కువైట్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. అంతకు కొన్ని గంటల ముందే కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అప్రమత్తమై, దూసుకొస్తున్న ముప్పును గుర్తించి యాక్టివేట్ కావడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.

ఈ తాజా ఘర్షణల్లో ఇరాన్‌కు చెందిన ఖేష్మ్ ద్వీపం (Qeshm Island) కేంద్రబిందువుగా మారింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తన నియంత్రణలోకి ఉంచుకోవడానికి ఇరాన్ ఇక్కడ ఒక భారీ భూగర్భ 'మిసైల్ సిటీ'ని నిర్మించింది. ఈ అండర్‌గ్రౌండ్ స్థావరంలో జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ నౌకలను అడ్డుకోగల సామర్థ్యం ఉన్న గడా-380, HY-2 సిల్క్‌వార్మ్ వంటి యాంటి-షిప్ క్రూజ్ క్షిపణులు ఉన్నాయి. వీటితో పాటు 800 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించగల ఖియామ్-1, ఖైబర్ షెకన్, ఘదర్, ఎమాద్ వంటి శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులను కూడా ఇరాన్ ఇక్కడ మోహరించింది. ఈ మిసైల్ బ్యాటరీలు, వేగంగా దాడి చేసే స్పీడ్‌బోట్లే అమెరికా యుద్ధనౌకలకు ప్రధాన ముప్పుగా మారడంతో, అమెరికా వీటిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది.

ఆందోళనలో అంతర్జాతీయ సమాజం: ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు (20%) వాటా హర్మూజ్ జలసంధి గుండానే సాగుతుంది. తాజా దాడుల నేపథ్యంలో గ్లోబల్ ఎనర్జీ సప్లై లైన్లకు ఆటంకం కలిగే ప్రమాదం ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. ఇరు దేశాలు సంయమనం పాటించకపోతే ఇది పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు