USA : గ్రీన్‌కార్డులపై అమెరికా సర్కారు యూటర్న్‌!

గ్రీన్ కార్డ్ దరఖాస్తు ఆమోదం పొందే వరకు దరఖాస్తుదారులు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లాలంటూ వారం క్రితం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ యూ-టర్న్ తీసుకుంది.

New Update
usa

అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న విదేశీయులకు అమెరికా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తు ఆమోదం పొందే వరకు దరఖాస్తుదారులు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లాలంటూ వారం క్రితం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ యూ-టర్న్ తీసుకుంది.  గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులందరూ తమ స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, కొంతమంది మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని డీహెచ్‌ఎస్ స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న నిబంధనలకు పెద్దగా భిన్నంగా ఏమీ లేదని పేర్కొంది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసల నియంత్రణ విధానంలో భాగంగా.. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లాల్సిందేనని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ వారం క్రితం ప్రకటించారు. అసాధారణ పరిస్థితుల్లో మినహా ఈ నిబంధన అందరికీ వర్తిస్తుందని ఆయన పేర్కొనడంతో అమెరికాలోని వలసదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

అమెరికాలో ఉంటూనే

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. విదేశీయులు అమెరికాలో ఉంటూనే తమ గ్రీన్ కార్డ్ ఆమోదం కోసం వేచి ఉండవచ్చు. దీనిని అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్  ప్రక్రియ అంటారు. దీని ద్వారా అర్హులైన వలసదారులు తమ యజమాని లేదా దగ్గరి బంధువుల స్పాన్సర్‌షిప్‌తో అమెరికా నుంచే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 లోనే ఇలాంటి ప్రక్రియ ద్వారా దాదాపు 14 లక్షల మందికి గ్రీన్ కార్డులు జారీ అయ్యాయి. అయితే, మే 21న విడుదల చేసిన మెమోలో ఈ లూప్‌హోల్స్ అరికట్టేందుకు, గ్రీన్ కార్డ్ దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు అమెరికాలోనే అక్రమంగా ఉండిపోకుండా చూసేందుకు అందరినీ స్వదేశాలకు పంపాలనే కఠిన నిబంధనను తెరపైకి తెచ్చారు.

ఈ వివాదాస్పద ఆదేశాలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో డీహెచ్‌ఎస్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. ఇది అందరికీ వర్తించే సాధారణ నిబంధన కాదని, ఒక దరఖాస్తుదారుడు గ్రీన్ కార్డ్ కోసం తన సొంత దేశానికి వెళ్లాలా వద్దా అనేది పూర్తిగా అక్కడ ఉండే ఇమ్మిగ్రేషన్ అధికారుల విచక్షణపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. కేసు తీవ్రతను బట్టి అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటారని, ఈ అధికారం వారికి ఎప్పటి నుంచో ఉందని ఆయన వివరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేవారికి, జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే వారికి ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

అమెరికా ప్రభుత్వం ఈ నిబంధనపై కాస్త వెనక్కి తగ్గినట్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ, భవిష్యత్తులో గ్రీన్ కార్డ్ కేటాయింపు ప్రక్రియ ఎలా ఉండబోతుందనే దానిపై వలసదారుల్లో ఇంకా కొంత అస్పష్టత, ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు