/rtv/media/media_files/2026/02/19/mine-gas-leak-2026-02-19-16-24-50.jpg)
నైజీరియాలోని ప్లాటూ రాష్ట్రంలో బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. ఒక మైనింగ్ సైట్‌లో విషవాయువు (కార్బన్ మోనాక్సైడ్) లీక్ కావడంతో కనీసం 37 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నైజీరియాలోని ప్లాటూ రాష్ట్రం, వాసే లోకల్ గవర్నమెంట్ పరిధిలోని కంపానీ జురాక్ అనే గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక యువకులు ఒక చైనీస్ కంపెనీకి చెందిన మైనింగ్ సైట్‌లో సీసం, జింక్ తవ్వకాలు జరుపుతున్నారు. బుధవారం తెల్లవారుజామున కార్మికులు భూగర్భంలోకి లోతుగా వెళ్లిన సమయంలో, అక్కడ పేరుకుపోయిన విషవాయువులు ఒక్కసారిగా వెలువడ్డాయి.
గాలి సరిగ్గా ఆడని ఆ ఇరుకైన సొరంగాల్లో కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రాణాంతక వాయువులను పీల్చడంతో కార్మికులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది 20 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులే ఉండటం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన వెంటనే సహచర కార్మికులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. స్పృహ కోల్పోయిన వారిని బయటకు తీసి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న నైజీరియా సైన్యం ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. విషవాయువు ప్రభావం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా గని పరిసరాలను మూసివేశారు.
ప్లాటూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి జోయిస్ రామ్నాప్ ఈ ఘటనను ధృవీకరిస్తూ, ప్రాథమిక విచారణలో గ్యాస్ పేలుడు లేదా లీకేజీ వల్ల ఈ మరణాలు సంభవించినట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ గని నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గని ప్రాంతాన్ని మూసివేసి, పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు.
Follow Us