/rtv/media/media_files/2026/05/10/fotojet-2026-05-10-10-04-51.jpg)
Denver Airport Accident
Denver Airport Accident : అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం (DEN)లో గుండెలవసే విషాదం చోటుచేసుకుంది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతున్న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం ఢీకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి మరణించారు. అత్యంత భద్రత ఉండే విమానాశ్రయ ఆవరణలోకి ఒక ఆగంతకుడు చొరబడి రన్‌వేపైకి రావడం, వేగంగా వెళ్తున్న విమానం అతడిని బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.డెన్వర్ నుంచి లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరిన ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 4345 (ఎయిర్‌బస్ A321) రన్‌వేపై అత్యంత వేగంగా (సుమారు గంటకు 139 మైళ్ల వేగంతో) దూసుకెళ్తోంది.
🚨#BREAKING: Watch as a Frontier Airlines aircraft forced to make an emergency after a pedestrian on the runway was struck and sucked into one of the jet’s engines⁰⁰ 📌#Denver | #Colorado
— R A W S A L E R T S (@rawsalerts) May 9, 2026
Watch as horrifying footage from earlier this morning shows the moment Frontier Flight… pic.twitter.com/jvaWjzvMey
రాత్రి 11:19 గంటల సమయంలో ఒక వ్యక్తి విమానాశ్రయ రక్షణ కంచెను దాటి లోపలికి ప్రవేశించాడు. రన్‌వే దాటుతున్న క్రమంలో, లోపలికి ప్రవేశించిన కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే టేకాఫ్ అవుతున్న విమానం అతడిని బలంగా ఢీకొట్టింది.తీవ్రమైన వేగంతో విమానం ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరణించిన వ్యక్తి ఎయిర్‌పోర్టు ఉద్యోగి కాదని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే కాక్‌పిట్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి పైలట్ అత్యవసర సందేశం పంపారు. "మేము రన్‌వేపై ఆగిపోతున్నాం.. ఒక వ్యక్తిని ఢీకొట్టాం. మా విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. క్యాబిన్‌లోకి పొగ వ్యాపిస్తోంది. వెంటనే ఫైర్ ట్రక్కులను పంపండి" అంటూ పైలట్ ఆందోళనగా సమాచారం అందించిన ఆడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. బలమైన తాకిడి కారణంగా విమానం కుడి వైపు ఇంజిన్ పేలిపోయి ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పాటు క్యాబిన్‌లోకి దట్టమైన పొగ రావడంతో విమానంలో ఉన్న 224 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది (మొత్తం 231 మంది) ప్రాణభయంతో అరుపులు, కేకలు వేశారు.
పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని రన్‌వేపైనే నిలిపివేసి టేకాఫ్‌ను నిలిపివేశారు. డెన్వర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఇంజిన్ మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులను రక్షించేందుకు విమానం ఎమర్జెన్సీ స్లైడ్స్ (ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్‌లు) తెరిచారు. వాటి ద్వారా ప్రయాణికులు తమ సామాన్లతో సహా సురక్షితంగా కిందకు దిగారు. ఈ ఆందోళనకర తరలింపు ప్రక్రియలో 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన ప్రయాణికులను బస్సుల ద్వారా ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కు చేర్చి, ప్రత్యామ్నాయ విమానంలో లాస్ ఏంజిల్స్‌కు పంపారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక సాధారణ వ్యక్తి రక్షణ కంచెను అంత సులభంగా దాటి క్రియాశీలక రన్‌వేపైకి ఎలా రాగలిగాడనే అంశంపై అమెరికా రవాణా శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా రవాణా శాఖ కార్యదర్శి షాన్ డఫీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే కంచెను దాటి రన్‌వేపైకి పరిగెత్తుకుంటూ వచ్చాడని, ఎయిర్‌పోర్టు పరిధిలోకి ఇలా అక్రమంగా చొరబడటం తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆ వ్యక్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. విమానాశ్రయంలో రక్షణ గోడ లేదా కంచె ఎక్కడైనా దెబ్బతిందా అనే కోణంలో తనిఖీ చేయగా అంతా సవ్యంగానే ఉన్నట్లు తేలింది.ఈ సంఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA)తో పాటు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించాయి. ఈ ప్రమాదం కారణంగా విమానాశ్రయంలోని రన్‌వే 17Lని తాత్కాలికంగా మూసివేసి ఈ ఉదయం పునఃప్రారంభించారు.
Follow Us