Donald Trump : ట్రంప్‌కు షాక్: ఇరాన్‌పై సైనిక చర్యలకు అమెరికా సభ బ్రేక్!

ఇరాన్‌పై తదుపరి సైనిక చర్యలు చేపట్టకుండా డొనాల్డ్ ట్రంప్‌ను నిలువరిస్తూ ఆ దేశ ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)  కీలకమైన యుద్ధ అధికారాల తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం పర్షియన్ గల్ఫ్ నుండి అమెరికా బలగాలను ట్రంప్ ఉపసంహరించాల్సి ఉంటుంది,

New Update
Trump

Trump

Donald Trump : ఇరాన్‌పై తదుపరి సైనిక చర్యలు చేపట్టకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నిలువరిస్తూ ఆ దేశ ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)  ఒక కీలకమైన యుద్ధ అధికారాల తీర్మానాన్ని ఆమోదించింది. అధికార రిపబ్లికన్ పార్టీకి ఈ సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి నలుగురు రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు పలకడం విశేషం. దీనితో ఈ తీర్మానం 215–208 ఓట్ల స్వల్ప తేడాతో నెగ్గింది. అయితే ఈ ఓటింగ్‌ను తీవ్రంగా తప్పుబట్టిన ట్రంప్, ఇది అర్థరహితమైన చర్య అని మండిపడ్డారు. తన యుద్ధ అధికారాలను నియంత్రించేలా వ్యవహరించి, డెమోక్రాట్లతో చేతులు కలిపిన ఆ నలుగురు రిపబ్లికన్ సభ్యులను ఆయన 'దేశద్రోహులు'గా అభివర్ణించారు.

తాజాగా ఆమోదం పొందిన ఈ తీర్మానం ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుండి అమెరికా బలగాలను ట్రంప్ ఉపసంహరించాల్సి ఉంటుంది, లేదా అక్కడ యుద్ధం కొనసాగించాలంటే అమెరికా కాంగ్రెస్ నుండి తప్పనిసరిగా అనుమతి పొందవలసి ఉంటుంది. అమెరికా రాజ్యాంగం, 'ది వార్ పవర్ యాక్ట్-1973' నిబంధనల ప్రకారం.. ఏ దేశంపై అయినా అధికారికంగా యుద్ధం ప్రకటించే హక్కు కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుంది. ఒకవేళ అధ్యక్షుడు తన సొంత నిర్ణయంతో ఎక్కడైనా యుద్ధానికి దిగినా, దానికి 60 రోజుల్లోగా కాంగ్రెస్ ఆమోదం పొందడం చట్టరీత్యా తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని శ్వేతసౌధం (వైట్‌హౌస్) ప్రకటించింది.

ప్రస్తుతానికి ఈ తీర్మానం వల్ల అధ్యక్షుడు ట్రంప్‌కు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదు, ఎందుకంటే ఇది తదుపరి పరిశీలన కోసం సెనేట్ ముందుకు వెళ్లనుంది. 100 మంది సభ్యులు గల సెనేట్‌లో రిపబ్లికన్లకు 53 మంది సభ్యుల బలం ఉండగా, డెమోక్రాట్లు, వారి మద్దతుదారుల బలం 47 గానే ఉంది. అందువల్ల ఈ తీర్మానం సెనేట్‌లో నెగ్గే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అక్కడ కూడా కొందరు అధికార పార్టీ సభ్యుల మద్దతుతో ఇది ఒకవేళ నెగ్గినప్పటికీ, ఆ తీర్మానాన్ని పూర్తిగా తిరస్కరించే అత్యున్నత 'వీటో' అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు ఎలాగూ ఉంటుంది.

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కువైట్ విమానాశ్రయంపై బుధవారం జరిగిన దాడిలో మరణించిన ఒక భారతీయ పౌరుడి మృతదేహం శుక్రవారం దేశానికి చేరుకోనుండగా, గాయపడిన మరో 13 మంది భారతీయులు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటు ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హెజ్‌బొల్లా తీవ్రంగా తిరస్కరించింది; ఇజ్రాయెల్ సైన్యం తమ దేశం నుండి పూర్తిగా వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో నలుగురు మృతి చెందగా, లెబనాన్‌లో జరిగిన మరో దాడిలో సెర్బియాకు చెందిన ఐక్యరాజ్యసమితి శాంతిభద్రతల కార్యకర్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఉద్రిక్తతల నడుమ కాల్పుల విరమణను లెబనాన్‌కు సైతం విస్తరించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు