Pakistan : పాకిస్తాన్ లో పసి పిల్లలకు ఎయిడ్స్.. వందలాది కేసులు.. షాకింగ్ రిపోర్ట్!

పాకిస్థాన్‌లోని కరాచీ నగరం నుండి ఒక షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. గత తొమ్మిది నెలల్లో అక్కడి మూడు ప్రధాన ఆసుపత్రులలో చిన్నారుల్లో హెచ్‌ఐవీ కేసులు ఒక్కసారిగా పెరిగాయి.

New Update
pak

పాకిస్థాన్‌లోని కరాచీ నగరం నుండి ఒక షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. గత తొమ్మిది నెలల్లో అక్కడి మూడు ప్రధాన ఆసుపత్రులలో చిన్నారుల్లో హెచ్‌ఐవీ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. సింధ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ గణాంకాల ప్రకారం, 2024లో కేవలం 10 మంది చిన్నారులు మాత్రమే హెచ్‌ఐవీతో చేరగా, 2025 నాటికి ఆ సంఖ్య 70 దాటిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు మరో 30 మంది చిన్నారులు చికిత్స కోసం చేరారు.

ఇండస్ ఆసుపత్రిలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. 2024లో 144 కేసులు నమోదు కాగా, 2025 మొదటి మూడు నెలల్లోనే 69 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 2025 నుండి ఇప్పటివరకు 14 ఏళ్లలోపు ఉన్న 72 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ సోకగా, అందులో 68 శాతం మంది ఐదేళ్ల లోపు పిల్లలే కావడం గమనార్హం.

వాడిన ఇంజెక్షన్లు మళ్ళీ వాడటం

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అసురక్షిత వైద్య పద్ధతులే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. ఒకరు వాడిన ఇంజెక్షన్లు మళ్ళీ వాడటం, డ్రిప్ సెట్ల పునర్వినియోగం, సరిగ్గా శుభ్రం చేయని వైద్య పరికరాలు,  పరీక్షలు నిర్వహించని రక్తాన్ని రోగులకు ఎక్కించడం వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కొంతమంది వైద్యులు మందుల కంటే ఇంజెక్షన్లు, డ్రిప్పులకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరిగింది. మరోవైపు, విదేశీ నిధులు నిలిచిపోవడంతో హెచ్‌ఐవీ,  టీబీ మందుల కొరత కూడా వేధిస్తోంది.

అంతర్జాతీయ వేదికలపై మధ్యవర్తిత్వాలు చేస్తూ దౌత్యపరమైన హోదా కోసం పాకులాడుతున్న పాకిస్థాన్, తన సొంత దేశంలో కరాచీ వంటి ప్రధాన నగరాల్లో చిన్నారులు హెచ్‌ఐవీ బారిన పడుతుంటే కనీసం నిరోధించలేకపోవడంపై ఆ దేశంలోనే తీవ్ర విమర్శలు ఎదరుకుంటోంది. కేవలం అసురక్షిత వైద్య పద్ధతులు, వాడిన సూదులనే మళ్ళీ వాడటం వంటి ప్రాథమిక లోపాల వల్ల ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ ప్రాణాంతక వైరస్ సోకడం ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ పతనానికి అద్దం పడుతోంది. 

విదేశీ నిధులపైనే ఆధారపడి, కనీస మందుల సరఫరా కూడా చేయలేని స్థితిలో ఉంటూ, అగ్రరాజ్యాల మధ్య శాంతి చర్చల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్పేముందు, తమ దేశ భవిష్యత్తు అయిన చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించి, ఇలాంటివి అరికట్టాల్సిన బాధ్యత పాక్ ప్రభుత్వంపై ఉందని సూచిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు