/rtv/media/media_files/2026/04/06/pakistan-2026-04-06-11-33-02.jpg)
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో పేదరికం తాండవిస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల ఆగ్రహానికి గురైన అక్కడి ప్రభుత్వం, ఇప్పుడు ఖజానా నింపుకోవడానికి వింత మార్గాలను వెతుకుతోంది. ఈ క్రమంలోనే పశువుల పేడపై కన్నేసిన పాకిస్థాన్ ప్రభుత్వం, పంజాబ్ ప్రావిన్స్‌లో కొత్తగా పేడ పన్ను విధించాలని నిర్ణయించింది. ఆవు, గేదె పేడపై కూడా పన్ను వేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం త్వరలోనే పశువుల యజమానుల నుంచి ఈ పన్ను వసూలు చేయడానికి సిద్ధమైంది. అక్కడి వార్తా సంస్థల సమాచారం ప్రకారం, మరియం నవాజ్ ప్రభుత్వం ఒక్కో ఆవు లేదా గేదెకు ప్రతిరోజూ 30 పాకిస్థానీ రూపాయల చొప్పున పన్ను వసూలు చేయాలని ఆలోచిస్తోంది. మన భారతీయ కరెన్సీలో ఇది దాదాపు 10 రూపాయలు ఉంటుంది. పశువులను పెంచేవారు ప్రతిరోజూ ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించడం తప్పనిసరి చేయనున్నారు.
అయితే, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఇది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని చెబుతోంది. 2024 డిసెంబర్‌లో ప్రారంభించిన సూత్ర పంజాబ్ బయో గ్యాస్ కార్యక్రమంలో భాగంగానే ఈ పన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పశువుల వ్యర్థాలను క్లీన్ చేయడం, ఆ పేడ ద్వారా బయో గ్యాస్ ఉత్పత్తి చేయడమే తమ అసలు లక్ష్యమని అధికారులు వివరిస్తున్నారు.
ప్రజల నుంచి డబ్బులు గుంజడమే
ప్రభుత్వ నిర్ణయంపై పాకిస్థాన్ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిని పేడ పన్ను అని పిలుస్తూ ఎద్దేవా చేస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ పన్నులే నిదర్శనమని, డబ్బులు వసూలు చేయడానికి ప్రభుత్వం ఇలాంటి వింత మార్గాలను ఎంచుకుంటోందని విమర్శిస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ అనేది కేవలం ఒక నెపం మాత్రమేనని, అసలు విషయం ప్రజల నుంచి డబ్బులు గుంజడమేనని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఇది మరింత భారంగా మారుతుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ పన్ను అమలు కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 168 పశువుల కాలనీలను గుర్తించింది. వీటిలో సుమారు 50 లక్షల ఆవులు, గేదెలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మొదటి దశలో లాహోర్‌లోని హర్బన్స్‌పురా, గుజ్జర్‌పురా వంటి పెద్ద డైరీ కేంద్రాల్లో ఈ పన్నును ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ తర్వాత పంజాబ్ అంతటా విస్తరించనున్నారు. పేడ సేకరణ, వ్యర్థాల నిర్వహణ, బయో గ్యాస్ ప్లాంట్ల మెయింటెనెన్స్ కోసం ఈ సొమ్మును వాడుతామని ప్రభుత్వం చెబుతోంది. ఒక పశువు ఎంత పేడ వేస్తుంది అనేది కొలవడం కష్టం కాబట్టి, సగటున ప్రతి జంతువుకు ఒక నిర్ణీత మొత్తాన్ని పన్నుగా కట్టాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది.
Follow Us