/rtv/media/media_files/2026/06/05/oman-suspends-oil-loading-at-mina-ala-fahal-terminal-after-explosion-2026-06-05-13-13-47.jpg)
Oman suspends oil loading at Mina Ala Fahal terminal after explosion
Mina Ala Fahal terminal : గల్ఫ్ రీజియన్‌లో ఇరాన్ జరుపుతున్న క్షిపణులు, డ్రోన్ దాడులతో ఆ ప్రాంతంలో తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఒమన్‌లోని అత్యంత కీలకమైన 'మినా అల్ ఫహల్' ఆయిల్ టెర్మినల్ లక్ష్యంగా భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ దాడి వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. దాడి దాటికి టెర్మినల్‌లో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడగా, అప్రమత్తమైన విపత్తు నిర్వహణ బృందాలు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఈ ఆకస్మిక దాడి ప్రభావంతో ఒమన్ ఆయిల్ టెర్మినల్‌లో చమురు లోడింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. చమురు రవాణా కోసం వివిధ దేశాల నుండి వచ్చిన పలు సూపర్ ట్యాంకర్లు లోడింగ్ కాక మధ్యలోనే చిక్కుకుపోయాయి. టెర్మినల్‌లో మళ్లీ యథావిధిగా చమురు కార్యకలాపాలు ప్రారంభమయ్యే వరకు ఆ నౌకలు అంతవరకు సముద్రంలోనే వేచి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, తాము ఒమన్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న అమెరికా సైనిక నౌకను విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ప్రకటించింది. తమ దేశ జలాల్లోకి చొరబడేందుకు సదరు అమెరికా నౌక ప్రయత్నించడం వల్లే ఈ దాడి చేయాల్సి వచ్చిందని ఇరాన్ సమర్థించుకుంది. అయితే టెహ్రాన్ చేసిన ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తీవ్రంగా ఖండించింది. ఒమన్ సముద్రంలో ఉన్న తమ సైనిక ఆస్తులన్నీ పూర్తి సురక్షితంగా ఉన్నాయని, అమెరికాకు చెందిన ఏ నౌకపైనా ఎలాంటి దాడి జరగలేదని అమెరికా సైన్యం స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల వల్లే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా ధ్వంసమైందని కువైట్ అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తోసిపుచ్చింది. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ దెబ్బతినడానికి తాము కారణం కాదని, అక్కడ మోహరించిన అమెరికా తయారీ 'పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ'లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఈ వినాశనం జరిగిందని ఇరాన్ ఎదురుదాడికి దిగింది. ఈ వ్యాఖ్యలను అమెరికా సైన్యం తిప్పికొడుతూ.. ఇరాన్ కావాలనే పౌర విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని, అంతర్జాతీయంగా వస్తున్న విమర్శల నుండి తప్పు తప్పించుకోవడానికే తమపై ఇలాంటి అబద్ధపు ఆరోపణలు చేస్తోందని మండిపడింది.
Follow Us