/rtv/media/media_files/2026/04/08/strait-of-hormuz-2026-04-08-12-47-05.jpg)
Strait of Hormuz
Strait of Hormuz : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారంఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ఈ మార్గంలో కొత్త సముద్ర నిబంధనలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అరేబియా గల్ఫ్ హోర్ముజ్ జలసంధి మీదుగా ఉన్న సుమారు 2,000 కిలోమీటర్ల తీర ప్రాంతంపై తమ పూర్తి పర్యవేక్షణ ఉంటుందని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది.
ఈ కొత్త నిబంధనల వెనుక ఇరాన్ ప్రధాన లక్ష్యం ఈ ప్రాంతంలో విదేశీ శక్తుల, ముఖ్యంగా అమెరికా నావికాదళ జోక్యాన్ని పూర్తిగా నియంత్రించడమే. సముద్ర భద్రతను బలోపేతం చేయడం మరియు వాణిజ్య మార్గాలను తమ గుప్పిట్లోకి తీసుకోవడం ద్వారా అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి పెంచాలని ఇరాన్ భావిస్తోంది. ఐఆర్‌జీసీ నావికా దళ కమాండర్ ఈ చర్యలను ఇరాన్ ప్రజలకు గర్వకారణంగా అభివర్ణిస్తూ, త్వరలోనే ఈ నిబంధనల పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సైతం ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. పర్షియన్ గల్ఫ్ కేవలం జలమార్గం మాత్రమే కాదని, అది ఇరాన్ నాగరికత ,గుర్తింపులో ఒక భాగమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై కుట్రలు పన్నే విదేశీ బలగాలకు సముద్రం అడుగున తప్ప మరెక్కడా చోటు ఉండదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి ఈ మార్గాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవడం ద్వారా, అమెరికా ఆంక్షలు మరియు బెదిరింపులకు ఇరాన్ గట్టి బదులిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో సుమారు 20 శాతం ఈ హోర్ముజ్ జలసంధి గుండానే వెళుతుంది. ఇప్పుడు ఇరాన్ అక్కడ కొత్త ఆంక్షలు విధిస్తుందని తెలియడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా యుద్ధ నౌకలను అరేబియా గల్ఫ్‌లోకి రాకుండా అడ్డుకోవడమే ఇరాన్ అసలు వ్యూహమని దౌత్యవర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరో స్థాయికి తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
Follow Us