H-1B wage Rules : హెచ్-1బీ ఉద్యోగులకు జాక్‌పాట్.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం!

అమెరికాలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ..  హెచ్-1బీ వీసా నిబంధనలను భారీగా సవరించాలని అమెరికా ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

New Update
H1 visa

అమెరికాలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ..  హెచ్-1బీ వీసా నిబంధనలను భారీగా సవరించాలని అమెరికా ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ కొత్త మార్పుల వల్ల విదేశీ కార్మికుల వార్షిక వేతనం సగటున 14,000 డాలర్లు (మన దేశీ కరెన్సీలో దాదాపు రూ. 11.60 లక్షలు) పెరిగే అవకాశం ఉంది. అమెరికాలోని స్థానిక కార్మికులకు, విదేశీ కార్మికులకు మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యంగా కార్మిక శాఖ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. తక్కువ జీతానికే విదేశీయులు దొరుకుతున్నారని కంపెనీలు అమెరికన్లను పక్కన పెట్టకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ 2025లో వెలువడిన అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ కొత్త వేతన విధానం రూపొందింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ వల్ల అమెరికాలోని కార్మిక ప్రమాణాలు దెబ్బతింటున్నాయని, కంపెనీలు కేవలం ఖర్చు తగ్గించుకోవడానికే విదేశీయులను వాడుకుంటున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అమెరికన్ల స్థానంలో విదేశీయులను భర్తీ చేయడం వల్ల స్థానిక మార్కెట్‌లో జీతాలు తగ్గిపోతున్నాయని కార్మిక శాఖ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ముఖ్యంగా ఐటీ వంటి హై-స్కిల్ రంగాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రభుత్వం చేసిన లోతైన విశ్లేషణ ప్రకారం, ఒకే రకమైన పని చేస్తున్న అమెరికన్లతో పోలిస్తే హెచ్-1బీ ఉద్యోగులు సగటున ఏడాదికి 10,191 డాలర్లు తక్కువ సంపాదిస్తున్నారు. కంప్యూటర్ సంబంధిత వృత్తుల్లో ఈ తేడా ఇంకా ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం వేతన లెక్కల్లో ఉన్న లోపమే. ప్రస్తుతం అమలులో ఉన్న కనీస వేతన విధానం చాలా తక్కువ స్థాయి నుంచి మొదలవుతోంది. హెచ్-1బీ అంటేనే ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగం అయినప్పటికీ, జీతాల నిర్ణయంలో మాత్రం తక్కువ అనుభవం ఉన్నవారిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనివల్ల కంపెనీలకు విదేశీయులకు తక్కువ జీతాలు చెల్లించే అవకాశం దొరుకుతోంది.

2024 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, సుమారు 63 శాతం హెచ్-1బీ ఉద్యోగాలు అతి తక్కువ వేతన కేటగిరీలైన లెవల్-1, లెవల్-2 కింద నమోదయ్యాయి. ఈ విభాగాల్లో పనులు కష్టతరమైనవి, నైపుణ్యంతో కూడుకున్నవి అయినప్పటికీ, కంపెనీలు తక్కువ జీతాల పరిమితిని వాడుకుని ఖర్చు తగ్గించుకుంటున్నాయి. ప్రతిపాదించిన కొత్త విధానం ప్రకారం, ఈ నాలుగు స్థాయిల వేతన శాతాలను గణనీయంగా పెంచనున్నారు. దీనివల్ల కంపెనీలు కచ్చితంగా మార్కెట్ రేటుకు అనుగుణంగా ఎక్కువ జీతాలు చెల్లించాల్సి వస్తుంది.

సగటు జీతం 121,908 డాలర్లు

ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే కంపెనీల నుంచి విదేశీ ఉద్యోగులకు ఏడాదికి సుమారు 6.56 బిలియన్ డాలర్ల మేర అదనపు వేతనం బదిలీ అవుతుంది. ప్రస్తుతం కంపెనీలు ఆఫర్ చేస్తున్న సగటు జీతం 121,908 డాలర్లుగా ఉంది, ఇది ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే ఎక్కువే. అంటే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిబంధనలు మాత్రం పాతకాలం నాటి తక్కువ వేతనాలనే సూచిస్తున్నాయని అర్థమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ పెరుగుతున్న తరుణంలో అమెరికా నైపుణ్యం ఉన్న స్వదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది.

అయితే, ఈ కొత్త మార్పులు కేవలం భవిష్యత్తులో వచ్చే కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుతం అమెరికాలో పని చేస్తున్న వారికి ఇప్పటికే ఆమోదం పొందిన వారికి దీనివల్ల ఇబ్బంది ఉండదు. కంపెనీలు ఈ కొత్త ఖర్చులకు అలవాటు పడటానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు, ఆ తర్వాతే దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.

Advertisment
తాజా కథనాలు