/rtv/media/media_files/2026/05/08/who-2026-05-08-09-00-19.jpg)
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కీలక ప్రకటన చేసింది. ఎంవీ హోండియస్ (MV Hondius) క్రూయిజ్ షిప్‌లో బయటపడిన హంటావైరస్ (Andes virus strain) వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల కలిగే ముప్పు చాలా తక్కువని స్పష్టం చేసింది.
ఇంతకు ఈ వైరస్ ఏంటంటే.. ఈ వైరస్‌ను ఆండీస్ వైరస్ (Andes virus) అని పిలుస్తారు. ఇది హంటావైరస్‌లలోనే చాలా అరుదైన రకం. సాధారణంగా హంటావైరస్‌లు ఎలుకల మలమూత్రాల ద్వారా వ్యాపిస్తాయి. కానీ, ఈ ఆండీస్ వైరస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది మనుషుల నుంచి మనుషులకు (అతి దగ్గరి సంబంధం ఉన్నవారికి) వ్యాపించే అవకాశం ఉంది.
మొత్తం 8 కేసులు నమోదు
ఇప్పటివరకు ఈ క్రూయిజ్ షిప్‌నకు సంబంధించి మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు మరణించారు. ఈ వైరస్ శరీరంలో చేరిన తర్వాత లక్షణాలు బయటపడటానికి 6 వారాల సమయం పడుతుంది. కాబట్టి, మరికొన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని WHO చీఫ్ డాక్టర్ టెడ్రోస్ హెచ్చరించారు.
స్పెయిన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో, ఈ నౌక ఇప్పుడు కానరీ ఐలాండ్స్ వైపు వెళ్తోంది. అక్కడ ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని స్వదేశాలకు పంపనున్నారు. ఇది తీవ్రమైన విషయమే అయినప్పటికీ, సాధారణ ప్రజలకు దీనివల్ల కలిగే ముప్పు చాలా తక్కువని టెడ్రోస్ భరోసా ఇచ్చారు. ఇది కోవిడ్ లాంటి మహమ్మారి కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మొదటి కేసు ఏప్రిల్ 6న ఒక ప్రయాణికుడిలో కనిపించింది. అది సాధారణ శ్వాసకోశ వ్యాధి అనుకోవడంతో వైరస్‌ను గుర్తించలేకపోయారు. ఆయన ఏప్రిల్ 11న మరణించారు. ఆ తర్వాత ఆయన భార్య, మరో ప్రయాణికుడు కూడా లక్షణాలతో మరణించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతుండగా, నెదర్లాండ్స్‌లో మరికొందరు చికిత్స పొందుతున్నారు.
ఈ వైరస్ ప్రధానంగా దక్షిణ అమెరికాలోని ఎలుకల ద్వారా సంక్రమిస్తుంది. ఈ బాధితులు కూడా షిప్ ఎక్కకముందు అర్జెంటీనా, చిలీ వంటి దేశాల్లో పర్యటించినప్పుడు వైరస్ బారిన పడి ఉండవచ్చని పోలీసులు, వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది, ఆందోళన చెందాల్సిన పని లేదు.
Follow Us