Iran-Israel War : పశ్చిమాసియాలో మళ్లీ క్షిపణుల కలకలం: ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర హెచ్చరికలు..

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దౌత్యపరమైన ప్రయత్నాలకు, కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది.

New Update
FotoJet - 2026-06-08T112109.705

Iran-Israel War : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దౌత్యపరమైన ప్రయత్నాలకు, కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఆదివారం దక్షిణ బీరూట్ (లెబనాన్) పరిసర ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాక్, కువైట్ దేశాలు తమ గగనతలాన్ని తక్షణమే మూసివేశాయి.

సైరెన్ల మోత.. ఇజ్రాయెల్ హెచ్చరికలు

ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా మరోసారి ప్రమాద సైరెన్లు మోగాయి. ప్రజలంతా వెంటనే సురక్షిత ప్రాంతాలకు, బాంబు షెల్టర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే, ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులలో దాదాపు 10 మిసైళ్లను ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.ఈ దాడులపై ఇజ్రాయెల్ మిలిటరీ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ భారీ తప్పిదానికి ఒడిగట్టిందని, దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది."శత్రువు ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతినేలా మా తదుపరి దాడి మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుంది" అని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ఫీ డెఫ్రిన్ స్పష్టం చేశారు.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వార్నింగ్

మరోవైపు ఇరాన్ సైనిక విభాగమైన 'ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్' కూడా ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తమపై మళ్లీ దాడులు జరిగితే ప్రతిస్పందన అంతకంటే ఘోరంగా ఉంటుందని పేర్కొంది. ఇజ్రాయెల్ (జియోనిస్టు) స్థావరాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా స్థావరాలన్నింటినీ తాము టార్గెట్ చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.తమకు అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి ఇజ్రాయెల్, లెబనాన్‌లు కూడా వస్తాయని ఇరాన్ వాదిస్తోంది. తమ మిత్రపక్షాలపై దాడులను సహించేది లేదని అంటోంది. అయితే, ఇజ్రాయెల్ ఈ వాదనను తోసిపుచ్చుతూ.. ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది.

నెతన్యాహుకు ప్రత్యామ్నాయం లేదు: డొనాల్డ్ ట్రంప్

ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగకుండా ఇజ్రాయెల్‌ను ఆయన నియంత్రించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ 'ఆక్సియోస్' కథనాన్ని ప్రచురించింది. ఇరాన్‌తో అమెరికా జరిపే ఏ రకమైన ఒప్పందాన్నైనా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించాల్సిందేనని, ఆయనకు మరో మార్గం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రికకు ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.."ఈ ప్రాంతంలో నిర్ణయాలు తీసుకునేది నేను మాత్రమే. అన్ని విషయాల్లోనూ నాదే తుది నిర్ణయం, నెతన్యాహుది కాదు. ఆయనకు వేరే ఛాయిస్ లేదు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇరాన్ తాజా క్షిపణి దాడులు జరిపినప్పటికీ.. ఆ దేశంతో తాము జరపబోయే చర్చలపై ఆ ప్రభావం ఏమాత్రం ఉండబోదని, చర్చల ప్రక్రియ కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనబెట్టి ఇరాన్ దాడులు చేసినప్పటికీ, అమెరికా-ఇరాన్ చర్చలు పక్కదారి పట్టకూడదనేదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు