International Day of Happiness : ఆనందంగా గడిపేద్దాం..

సంతోషమే సగం బలం అని పెద్దలు అన్నారుగానీ...నిజానికి సంపూర్ణ బలం. మనిషిలో సంతోషానికి సూచిక చిరునవ్వే. ఆ నవ్వు రావాలంటే సంతోషంగా ఉండాలి. ఆధునిక యుగంలో ఇది మనిషి నుండి దూరమైపోతుంది. మనిషి తీవ్ర ఒత్తిడికిలోనై అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు.

New Update
International Day of Happiness

International Day of Happiness

International Day of Happiness : సంతోషమే సగం బలం అని పెద్దలు అన్నారుగానీ...నిజానికి సంపూర్ణ బలం. మనిషిలో సంతోషానికి సూచిక చిరునవ్వే. ఆ నవ్వు రావాలంటే సంతోషంగా ఉండాలి. నేటి ఆధునిక యుగంలో ఇది మనిషి నుండి రోజురోజుకు దూరమైపోతుంది. దీంతో మనిషి తీవ్ర ఒత్తిడికిలోనై అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటూ తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో సంతోషం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన మొదటి దేశం భూటాన్. 1970 వ సంవత్సరం నుంచే సంతోష సూచే నిజమైన ఆరోగ్య సూచని ప్రపంచానికి చాటింది. ఇక్కడ "జాతీయ ఆదాయం" కన్నా "జాతీయ సంతోషానికీ" అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 2013 నుంచి ఐక్యరాజ్య సమితి సంతోషం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ, ప్రజల జీవన విధానంలో మార్పు తేవడానికి ప్రతియేటా మార్చు 20వ తేదీన అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది "సంరక్షణ మరియు భాగస్వామ్యం". అనే ఇతివృత్తంతో ఈరోజు నిర్వహించుకుంటున్నాము. ప్రపంచాన్ని సంతోషకరమైన ప్రదేశంగా మార్చడంలో దయ, కరుణ మరియు దాతృత్వం యొక్క ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం నొక్కి చెబుతుంది. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొస్తూ, ఆనందాన్ని నింపడానికి ఐక్యరాజ్యసమితి 2015 వ సంవత్సరంలో "సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు"ను కూడా నిర్దేశించింది. వాటి ముఖ్య లక్ష్యం కూడా మానవుడు సంతోషం, శ్రేయస్సుతో బతకడమే. పేదరికం అంతం చేయడం, అంతరాలను తగ్గించడం, భూగోళాన్ని రక్షించడం లాంటి మూడు సార్వత్రిక లక్ష్యాలను ప్రపంచ దేశాల ముందుంచింది.


భారత్ లో సంతోషం పరిమితమే!


మనిషి సంతోషంగా ఉండడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. సానుకూల దృక్పథం పెరిగి, సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలం. ఆనందంగా ఉండేవాళ్లలో ఆత్మవిశ్వాసం అధిక స్థాయిలో ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుందని అనేక శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధితో పాటు అనేక ఇతర అంశాలు ప్రజల సంతోషంపై  ప్రభావం చూపుతాయని ఆర్ధికవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో "ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సొల్యూషన్ నెట్ వర్క్" ఆధ్వర్యంలో  "స్థూల జాతీయ ఆనందం" ఆధారంగా "ప్రపంచ సంతోష సూచి" ని కూడా ప్రతియేటా గణించడం జరుగుతుంది. దీనిలో ఆదాయం, ప్రజల ఆరోగ్య జీవనం, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, నమ్మకం, ఔదార్యం, తక్కువ అవినీతి తదితర అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 146 దేశాలతో కూడిన సంతోష సూచిలో  ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్ లాండ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. భారతదేశం 126వ స్థానంతో అతి తక్కువ సంతోషకరమైన దేశాలలో ఒకటిగా ఉంది. చైనా(60), నేపాల్(93), పాకిస్తాన్(108), మయన్మార్(118) వంటి పొరుగు దేశాలు సైతం సంతోషంలో మనకంటే ముందున్నాయి. పరిమిత ఆనందం ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతూ మానవ వనరుల సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆర్థిక, సామాజిక జీవితంలో మార్పు తీసుకొస్తూ, ఆనందాన్ని నింపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ప్రజలు సైతం ఆనందమయ జీవితం దిశగా ముందుకెళ్లాలి.


సంతోషమే నిజమైన ఆస్తి


భూగోళంపై మనిషి ఆనందానికి మించిన మందు లేదు. మనిషి సంతోషాన్ని డబ్బుతో ముడిపెడుతూ రోజురోజుకు నిరాశా, నిస్పృహల్లో జారుకుంటున్నాడు. ఇంతేకాకుండా నిత్యం ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారంతో  సంఘర్షణాత్మక జీవితాన్ని గడుపుతున్నాడు. మరి సంతోషమే మనల్ని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచగలదని మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మన సంతోషానికి, దుఖానికి మనమే కారణమని ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. మనం నిత్యం కుటుంబం, సమాజంలో ఆనందంగా గడిపే ప్రయత్నం చేయాలి. లేదంటే భవిష్యత్తులో కృతిమ సంతోషం కొరకు "లాఫింగ్ క్లబ్" లను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడుతుంది. జీవితమనే సుడిగుండాన్ని ఈదలంటే సమస్యలనేవి ప్రతిఒక్కరికీ సర్వసాధారణం. మనిషి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీనికి విరుద్ధంగా కొందరు వ్యసనాలకు బానీసై కృత్రిమ ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరింత ప్రమాదానికి దారి తీస్తుంది. విద్యార్థి దశ నుంచే  మంచి అలవాట్లతో  ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో జీవించే అలవాటును నేర్పించాలి. ఉన్నదాంట్లోనే ఆనందంగా గడిపే సంస్కృతి ప్రతి ఒక్కరిలో అలవడాలి. ప్రభుత్వ విధాన నిర్ణయాలు కూడా సంతోషానికి స్ధానం కల్పించాలి. ఇవి ప్రజలను సాధికారత వైపు నడిపిస్తూ, సామాజిక ఉన్నతిని పెంపొందించే విధంగా ఉండాలి. ఉద్భవిస్తున్న నూతన వ్యాధులు ప్రజల సంతోషాన్ని ఆవిరి చేస్తున్నాయి. కావున ప్రజల సైతం ఆరోగ్యం పట్ల స్పృహతో జీవిస్తూ ఆనందమైన జీవితాన్ని గడపాలి. సంతోషమే నిజమైన ఆస్తి అని, దాన్ని కాపాడుకోవడమే మన లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలి.  చివరగా సంతోషంగా ఉంటే పోయేదేమీ లేదు... బాధ తప్ప! అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

(నేడు అంతర్జాతీయ సంతోష దినోత్సవం)

సంపతి రమేష్ మహారాజ్
సామాజిక విశ్లేషకులు
7989579428

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు