JPMorgan : జేపీ మోర్గాన్ ఎగ్జిక్యూటివ్‌పై లైంగిక వేధింపుల కేసు.. నాశనం చేస్తానని బెదిరింపులు!

న్యూయార్క్‌లోని జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న లార్నా హజ్దిని (37) పై ఆమె కింద పనిచేసే ఒక ఆసియా సంతతి బ్యాంకర్ తీవ్ర ఆరోపణలు చేస్తూ కోర్టులో దావా వేశారు.

New Update
jp

న్యూయార్క్‌లోని జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న లార్నా హజ్దిని (37) పై ఆమె కింద పనిచేసే ఒక ఆసియా సంతతి బ్యాంకర్ తీవ్ర ఆరోపణలు చేస్తూ కోర్టులో దావా వేశారు. తనను నెలల తరబడి లైంగికంగా వేధించడమే కాకుండా, జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా హింసించిందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న తన కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించి, బలవంతంగా లైంగిక సంబంధానికి ఒత్తిడి తెచ్చిందని ఆయన ఆరోపించారు.

కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.. లార్నా హజ్దిని బాధితుడిని లిటిల్ బ్రౌన్ బాయ్ అని సంబోధిస్తూ అవమానించేదని, ఆఫీసులోనే అసభ్యకరంగా ప్రవర్తించేదని తెలుస్తోంది. తన కోరిక తీర్చకపోతే ప్రమోషన్ రాకుండా చేస్తానని, ఉద్యోగంలో ఉండనివ్వనని ఆమె బెదిరించేదని బాధితుడు తెలిపాడు. ఒక సందర్భంలో తన నివాసానికి వచ్చి, బలవంతంగా బట్టలు విప్పించి తనపై లైంగిక దాడికి పాల్పడిందని, తాను ఏడుస్తున్నా పట్టించుకోకుండా హేళన చేసిందని ఆయన వాపోయారు. అలాగే, తనకు రోహిప్నాల్ వంటి మత్తుమందులు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అత్యాచారం చేసిందని కూడా ఆరోపించారు.

రాతపూర్వక ఫిర్యాదు

ఈ వేధింపుల గురించి 2025 మే నెలలో బాధితుడు జేపీ మోర్గాన్ యాజమాన్యానికి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే బ్యాంక్ తనపై కక్షసాధింపు చర్యలకు దిగిందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ సిస్టమ్స్ యాక్సెస్ తొలగించడం, బలవంతంగా సెలవుపై పంపడం వంటివి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, అజ్ఞాత వ్యక్తుల నుండి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, నిన్ను అమెరికా నుండి పంపించేస్తాం అని హెచ్చరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ వేధింపుల కారణంగా తాను పీటీఎస్‌డీ - తీవ్ర మానసిక ఆందోళన) కి గురయ్యానని, ఆర్థికంగా కూడా చితికిపోయానని ఆయన ఆవేదన చెందారు.

ఈ వ్యవహారంపై జేపీ మోర్గాన్ స్పందిస్తూ.. బాధితుడి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. తాము అంతర్గతంగా విచారణ జరిపామని, అందుకు తగిన ఆధారాలేవీ లభించలేదని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. విచారణకు బాధితుడు సహకరించలేదని, అందుకే ఈ ఆరోపణలు కొట్టివేస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం నిందితురాలు లార్నా హజ్దిని ఇంకా అదే బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. బాధితుడు మాత్రం తనకు జరిగిన అన్యాయానికి పరిహారం చెల్లించాలని, పని ప్రదేశాల్లో ఇలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.

Advertisment
తాజా కథనాలు