US Iran Peace Deal :: ఒప్పందలోని 14 పాయింట్లు ఏంటి? గతంలో ఎక్కడ చెడింది.. ఇప్పుడు ఎవరు తగ్గారు?

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అయితే ఇరుదేశాల మధ్య ప్రస్తుతం కుదిరిన ఒప్పందాలు, గతంలో ఏకాభిప్రాయానికి రాని అంశాలు ఏంటో పరిశీలిద్దాం.

New Update
FotoJet - 2026-06-15T121426.631

US Iran Peace Deal

US Iran Peace Deal : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ, యుద్ధాన్ని నివారించేందుకు అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని తిరిగి తెరిచేందుకు ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 19, శుక్రవారం నాడు స్విట్జర్లాండ్‌లో ఈ ఒప్పందంపై ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేయనున్నాయి. ప్రస్తుతానికి రెండు దేశాలు అత్యవసరంగా కాల్పుల విరమణకు, సముద్ర మార్గాలను పునరుద్ధరించడానికి అంగీకరించాయి. అత్యంత సున్నితమైన ఇరాన్ అణు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై తదుపరి దశల్లో చర్చలు జరగనున్నాయి.

ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, హోర్ముజ్ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా ఉచితంగా తెరవడానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఇరాన్‌పై విధించిన అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం తెరుచుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాదీ కూడా ప్రభుత్వ టెలివిజన్ ద్వారా ఈ ఒప్పందాన్ని ధృవీకరించారు.

అమెరికా-ఇరాన్ ప్రతిపాదిత ఒప్పందంలోని 14 ముఖ్యమైన అంశాలు:

ఇరాన్ చమురు, పెట్రోకెమికల్,దానికి సంబంధించిన ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను తొలగిస్తారు.

ఇరాన్ తన విదేశీ ఆర్థిక వనరులను, నిధులను తిరిగి పూర్తిగా పొందేందుకు వీలు కల్పిస్తారు.

చర్చల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల స్తంభింపజేసిన నిధులను విడుదల చేస్తారు.

ఈ మొత్తం నిధులలో మొదటి దశ కింద 12 బిలియన్ డాలర్లను తక్షణమే విడుదల చేయాలని ప్రతిపాదించారు.

యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా మరియు దాని మిత్రదేశాలు సుమారు 300 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది.

లెబనాన్‌తో సహా పశ్చిమ ఆసియాలోని అన్ని ప్రాంతీయ ఘర్షణ స్థావరాలలో శాశ్వత కాల్పుల విరమణ అమలులోకి వస్తుంది.

ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ, దాని అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోబోమని అమెరికా హామీ ఇవ్వాలి.

ఇరాన్‌పై విధించిన నావికా దిగ్బంధనాన్ని 30 రోజుల్లోగా అమెరికా పూర్తిగా ఎత్తివేయాలి.

ఇరాన్ సరిహద్దుల చుట్టూ మోహరించిన అమెరికా సైనిక బలగాలను తగ్గించడం లేదా పూర్తిగా ఉపసంహరించుకోవడం జరుగుతుంది.

వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని 30 రోజుల్లోగా సాధారణ రవాణా కోసం తిరిగి తెరుస్తారు.

అణు కార్యక్రమం మరియు ఆంక్షల వంటి పెండింగ్ సమస్యల పరిష్కారానికి 60 రోజుల పాటు అధికారిక చర్చలు ప్రారంభిస్తారు.

అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) ప్రకారం తాము ఎలాంటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ పునరుద్ఘాటించాలి.

ఈ 60 రోజుల చర్చల కాలంలో అమెరికా కొత్తగా ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధించకూడదు, అలాగే అదనపు సైనిక బలగాలను మోహరించకూడదు.

ఒప్పంద అమలును పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. తుది ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తారు.

అయితే, ఇరాన్ మిసైల్ (క్షిపణి) కార్యక్రమాలను, అలాగే ప్రాంతీయ సాయుధ గ్రూపులకు ఇరాన్ అందిస్తున్న మద్దతును ఈ ప్రతిపాదిత ఒప్పందం పరిధి నుండి మినహాయించారు. తొలి దశలో 12 బిలియన్ డాలర్ల నిధుల విడుదల, చమురు ఆంక్షల సడలింపు, నావికా దిగ్బంధనం తొలగింపు పూర్తయిన తర్వాతే తుది విడత అధికారిక చర్చలు ప్రారంభమవుతాయనేది ఇక్కడ అత్యంత కీలకమైన నిబంధన.

గతంలో ఏయే అంశాలపై ఇరు దేశాల మధ్య సమ్మతి కుదరలేదంటే?

గతంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఐదు ప్రధాన అంశాలపై తీవ్ర విభేదాలు ఉండిపోయాయి. అందులో మొదటిది యురేనియం సుసంపన్నత (Uranium Enrichment). ఇరాన్ తన దేశంలో యురేనియం సుసంపన్నతను పూర్తిగా నిలిపివేయాలని అమెరికా పట్టుబట్టగా, శాంతియుత అవసరాల కోసం అణు ఇంధనాన్ని తయారు చేసుకునే హక్కు తమకు ఉందని ఇరాన్ వాదించింది. రెండవది, ఆంక్షల తొలగింపు క్రమం. చమురు, బ్యాంకింగ్ రంగాలపై ఉన్న ఆంక్షలన్నింటినీ అమెరికా ముందే తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేయగా, ఇరాన్ మొదట తన అణు కార్యకలాపాలను నియంత్రిస్తేనే ఆంక్షలు తీసేస్తామని అమెరికా మొండికేసింది.

మూడవది, అంతర్జాతీయ తనిఖీలు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) ఇరాన్‌లోని అన్ని అణు స్థావరాలను, సైనిక ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి అనుమతించాలని అమెరికా కోరగా, దేశ భద్రత దృష్ట్యా ఇరాన్ కొన్ని సైనిక స్థావరాల తనిఖీలను తీవ్రంగా వ్యతిరేకించింది. నాల్గవది, క్షిపణి కార్యక్రమం. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణుల తయారీపై ఆంక్షలు అంగీకరించాలని అమెరికా కోరగా, ఇది తమ ఆత్మరక్షణకు సంబంధించిన అంశమని, దీనిపై రాజీ పడబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఐదవది, ప్రాంతీయ ప్రభావం. పశ్చిమ ఆసియాలోని ఇతర సాయుధ గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇవ్వడం ఆపాలని అమెరికా డిమాండ్ చేయగా, ఇరాన్ దాన్ని తిరస్కరించింది.

2015లో కుదిరిన చారిత్రాత్మక అణు ఒప్పందం (JCPOA) ప్రకారం ఇరాన్ తన యురేనియం సుసంపన్నతను 3.67 శాతానికి పరిమితం చేయడానికి, అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించింది. దానికి బదులుగా అప్పట్లో అంతర్జాతీయ ఆంక్షలు తొలగించబడ్డాయి. అయితే, 2018లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఈ ఒప్పందం నుండి ఏకపక్షంగా వైదొలగడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాలు పట్టు విడుపులకు రావడం వల్ల, ఈ కొత్త 14 పాయింట్ల ఒప్పందం మధ్యప్రాచ్యంలో శాంతికి సరికొత్త మార్గాన్ని సుగమం చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు