/rtv/media/media_files/2026/04/27/iran-and-trump-2026-04-27-13-45-25.jpg)
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల్లో కీలక మార్పు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ తన పాత పంతాలను వీడి మెట్టు కిందకు దిగినట్లు కనిపిస్తోంది. గతంలో పది పదిహేను షరతులు పెట్టిన ఇరాన్, ఇప్పుడు హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడానికి అమెరికా ముందు ఒకే ఒక్క సింగిల్ పాయింట్ ప్రతిపాదనను ఉంచిన్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతానికి పరస్పర శతృత్వాన్ని పక్కన పెట్టి, అణు చర్చలను ప్రస్తుతానికి వాయిదా వేద్దాం.. ముందు ఉద్రిక్తతలను తగ్గిద్దాం అనేదే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘచీ చేస్తున్న ప్రధాన డిమాండ్. ఈ వ్యవహారంలో పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా వాడుకుంటూ ఇరాన్ తన సందేశాన్ని డొనాల్డ్ ట్రంప్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది.
ఇంతకు ఇరాన్ కొత్త ప్రతిపాదన ఏంటంటే.. దశల వారీ పద్ధతిని అమలు చేయాలని చూస్తుంది. ముందుగా హోర్ముజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకల రాకపోకలను పునరుద్ధరించడం. రెండోది ఆంక్షలు, నావికా దళాల దిగ్బంధనం వల్ల దెబ్బతింటున్న తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం. ఇక మూడోది అమెరికా ప్రస్తుతానికి అణు చర్చలను పక్కన పెట్టాలి. భవిష్యత్తులో పరిస్థితులు చక్కబడ్డాక వీటిపై మాట్లాడుకుందాం అనేది ఇరాన్ మాట.
ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌కు 3 నుండి 5 రోజుల గడువు ఇచ్చారు. అయితే, అణుబాంబు విషయంలో ట్రంప్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణు దేశంగా మారనివ్వనని ఆయన పదే పదే చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ పంపిన ఈ సింగిల్ ఆఫర్ ను వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. అణు అంశాన్ని వాయిదా వేయడానికి ట్రంప్ అంగీకరిస్తారా? లేక పూర్తిస్థాయి లొంగుబాటు కోరుకుంటారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘచీ వరుస పర్యటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికాకు తన గొంతును వినిపించేందుకు పాకిస్థాన్‌ను వారధిగా వాడుకుంది. యుద్ధ పరిహారం, నావికా దిగ్బంధనం ఎత్తివేత వంటి అంశాలపై చర్చలు జరిపింది. ఇస్లామాబాద్ మీదుగా అరాఘచీ ఇప్పుడు మాస్కో చేరుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాను ఎదుర్కోవడంలో రష్యా మద్దతు కూడగట్టడం ఇరాన్ వ్యూహం.
చమురు సరఫరాకు గుండెకాయ
హోర్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటిది. ఒకవేళ ఇరాన్ పెట్టిన ఈ ఒక్క షరతుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడమే కాకుండా యుద్ధ భయం కూడా తప్పుతుంది. అణు చర్చలు తాత్కాలికంగా ఆగిపోయినా, ప్రస్తుతానికి గొడవ సద్దుమణిగితే అది ప్రపంచ దేశాలన్నింటికీ ఊరటనిచ్చే విషయమే. ఇప్పుడు బంతి ట్రంప్ కోర్టులో ఉంది. ఆయన స్టెప్-బై-స్టెప్ పద్ధతికి ఓటు వేస్తారా లేక ఇరాన్‌ను మరింత ఇరుకున పెడతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
Follow Us