/rtv/media/media_files/2026/03/12/iran-president-2026-03-12-10-51-03.jpg)
అమెరికా, ఇజ్రాయెల్‌తో సాగుతున్న పోరాటాన్ని ముగించేందుకు ఇరాన్ ఓ ప్రపొసల్‌తో ముందుకు వచ్చింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ బుధవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా ఈ కీలక ప్రకటన చేశారు. రష్యా, పాకిస్థాన్ దేశాల అగ్రనేతలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన మూడు కండీషన్లు పెట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ వాటికి ఒప్పుకుంటే దాడులు ఆపేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. టెహ్రాన్ మరియు బీరూట్‌లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండగా, ఇరాన్ కూడా ప్రతీకారంగా క్షిపణులను ప్రయోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం "త్వరలోనే ముగుస్తుంది" అని చెప్తున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తాము సుదీర్ఘ పోరాటానికి సిద్ధమని హెచ్చరిస్తోంది.
1.ఇరాన్ సార్వభౌమత్వానికి గుర్తింపు
ఇరాన్ పెట్టిన మొదటి, ప్రధాన షరతు.. అంతర్జాతీయ వేదికపై ఇరాన్ న్యాయబద్ధమైన హక్కులను గుర్తించడం. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని, అలాగే తమ అణు కార్యక్రమం, రక్షణ హక్కులను గౌరవించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. పశ్చిమ దేశాలు ఇరాన్‌ను కేవలం ఒక ముప్పుగా చూడటం మానేసి, సార్వభౌమ రాజ్యంగా గుర్తించినప్పుడే శాంతి సాధ్యమని పెజెష్కియన్ పేర్కొన్నారు.
2. యుద్ధ నష్టపరిహారం చెల్లింపు
ఈ యుద్ధం వల్ల ఇరాన్ మౌలిక సదుపాయాలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ కోరుతోంది. ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్‌లోని పలు చమురు శుద్ధి కర్మాగారాలు, బ్యాంకులు, ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లిస్తేనే కాల్పుల విరమణకు మొగ్గు చూపుతామని ఇరాన్ స్పష్టం చేసింది.
3. భవిష్యత్ దాడులపై అంతర్జాతీయ హామీ
మళ్ళీ ఇరాన్ పై ఎటువంటి దాడులు జరగవని అంతర్జాతీయ స్థాయిలో గట్టి హామీ ఇవ్వాలని మూడవ షరతుగా విధించింది. కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా, ఐక్యరాజ్యసమితి లేదా ఇతర పెద్ద దేశాల సమక్షంలో ఒక శాశ్వత ఒప్పందం జరగాలని, అది ఉల్లంఘించబడదని భరోసా ఉండాలని ఇరాన్ పట్టుబడుతోంది.
ఇరాన్ పెట్టిన ఈ మూడు షరతులు అమెరికా, ఇజ్రాయెల్‌కు అంగీకారయోగ్యంగా ఉంటాయా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 'నష్టపరిహారం', 'హక్కుల గుర్తింపు' వంటి అంశాలపై అగ్రరాజ్యాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Follow Us