Iran : నిల్వ చేసే చోటు లేక...చమురును సముద్రం పాలు చేస్తున్న ఇరాన్‌?

రోజుకు సుమారు 30 లక్షల బ్యారెళ్లకు పైగా ముడి చమురును ఉత్పత్తి చేసే ఇరాన్‌కు ఇప్పుడు ఆ చమురును నిల్వ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. దీంతో ఇరాన్‌ ఆ చమురును పర్షియన్‌ గల్ఫ్‌ సముద్రంలోనే పారబోస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
FotoJet - 2026-05-11T101431.115

Iran dumping oil into the sea

Iran : అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలతో ఇరాన్‌కు ముదిరిన యుద్ధ మేఘాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. వ్యూహాత్మక ప్రాంతమైన హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడానికి ప్రయత్నించగా, ప్రతిగా అమెరికా నౌకాదళం గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ ప్రాంతంలో ఇరాన్‌పై పూర్తిస్థాయి నావికా దిగ్బంధాన్ని విధించింది. దీనివల్ల ఇరాన్‌కు చెందిన చమురు నౌకలు బయటకు వెళ్లే దారి లేక నిలిచిపోయాయి. ఇరాన్‌ ప్రధాన ఎగుమతి కేంద్రమైన ఖర్గ్‌ ద్వీపం నుంచి చమురు విదేశాలకు తరలిపోకుండా అమెరికా అడ్డుకోవడంతో, ఇరాన్‌కు తన సొంత చమురును అమ్ముకోలేని సరికొత్త ఆర్థిక, సాంకేతిక కష్టాలు మొదలయ్యాయి.

రోజుకు సుమారు 30 లక్షల బ్యారెళ్లకు పైగా ముడి చమురును ఉత్పత్తి చేసే ఇరాన్‌కు ఇప్పుడు ఆ చమురును నిల్వ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. భూమిపై ఉన్న నిల్వ కేంద్రాలతో పాటు, సముద్రంపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తేలియాడే ఆఫ్‌షోర్‌ ట్యాంకులు కూడా చమురుతో పూర్తిగా నిండిపోయాయి. అలాగని చమురు బావుల నుంచి వెలికితీతను అకస్మాత్తుగా నిలిపివేయడం సాంకేతికంగా అసాధ్యం. ఒకవేళ ఉత్పత్తిని ఆపేస్తే, భూగర్భంలోని రాతి నిర్మాణాల్లోకి నీరు, ఇతర వాయువులు చొచ్చుకుపోయి ఆ బావులు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. మళ్లీ ఎంత ఖర్చు చేసినా వాటి నుంచి చమురును వెలికితీయడం సాధ్యపడకపోవచ్చనే ఆందోళన ఇరాన్‌ను వెంటాడుతోంది.

ఈ గడ్డు పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఇరాన్‌ విపరీతమైన చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వెలికి తీసిన ముడి చమురును నిల్వ చేయలేక, చమురు బావులను కాపాడుకోవడానికి ఇరాన్‌ ఆ చమురును పర్షియన్‌ గల్ఫ్‌ సముద్రంలోనే పారబోస్తున్నట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన ఉపగ్రహ (శాటిలైట్‌) చిత్రాలు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఇరాన్‌ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్‌ దీవి సమీపంలో సముద్ర ఉపరితలంపై భారీగా నల్లటి చమురు తెట్టలు పేరుకుపోయినట్లు ఈ చిత్రాల విశ్లేషణ ద్వారా స్పష్టమవుతోంది. ఇది సముద్ర పర్యావరణానికి పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.

మరోవైపు, అమెరికా దిగ్బంధాన్ని ఎదుర్కొనేందుకు ఇరాన్‌ ప్రతివ్యూహాలు రచిస్తోంది హార్మూజ్‌ జలసంధి గుండా వెళ్లే ఏడు ప్రధాన సముద్రగర్భ ఇంటర్నెట్‌ కేబుళ్లపై పూర్తి నియంత్రణ సాధించాలని టెహ్రాన్‌ యోచిస్తోంది. గ్లోబల్‌ కమ్యూనికేషన్లను అందించే ఈ సముద్రగర్భ కేబుళ్ల ద్వారా జరిగే డేటా బదిలీపై భారీగా సుంకం (పన్ను) విధించాలని ఇరాన్‌ ప్రతిపాదిస్తోంది. అంతేకాకుండా, ఈ కీలక కేబుళ్ల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను కేవలం తమ దేశీయ కంపెనీలకే అప్పగించాలని పట్టుబడుతూ అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

Advertisment
తాజా కథనాలు