Israel, US-Iran War : అమెరికా పెద్దన్న పాత్రకు ఇరాన్ దెబ్బ..ఇరాన్‌ పై దాడితో అమెరికాకు తీవ్ర నష్టం

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఫిబ్రవరి 27న ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, కీలక నేతలు మరణించారు. టించుకున్న అమెరికా అతని మరణం తర్వాత కూడా దాడులు కొనసాగిస్తోంది.

New Update
Iran US War

Iran US War

Israel, US-Iran War : ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఫిబ్రవరి 27న ఇరాన్‌పై దాడులు మొదలు పెట్టాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీతోపాటు ఆయన కుటుంబ సభ్యులూ మరణించారు. అయితే ఖమేనీని అంతం చేయడమే లక్ష్యంగా ప్రకటించుకున్న అమెరికా అతని మరణం తర్వాత కూడా దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్‌ పై అమెరికా దాడి చేయడానికి పలు కారణాలున్నాయి. అవి అణు భయాలు, ప్రాంతీయ ఆధిపత్యం, మతపరమైన భావజాలం ముఖ్యమైనవి. అయితే ఖమేనీ హత్యతో ఇరాన్‌ వెనకకు తగ్గుతుందని అనుకున్న అమెరికాకు ఇరాన్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. దేశ అధినేత మరణించినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అమెరికా, ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపిస్తుంది.

అమెరికా, ఇరాన్ ..75 ఏళ్ల వైరం

నిజానికి ఇరాన్‌, అమెరికా వైరం ఈనాటిది కాదు. సుమారు 75 ఏళ్లుగా రెండు దేశాల మధ్య గొడవలు ఉన్నాయి.  అప్పట్లో ఇరాన్ ప్రధానిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎంపికైన మహ్మద్ మొసాదేగ్ ఇరాన్‌లోని చమురు సంపదను జాతీయం చేయడం అమెరికా, బ్రిటన్‌ కు నచ్చలేదు. దానివల్ల నష్టపోతామని భావించి ఆరెండు దేశాలు కుట్రపన్ని మొసాదేగ్ ను పదవి నుంచి తొలగించాయి. ఆ తర్వాత తమకు అనుకూలుడైన మొహ్మద్ రెజా షా పహ్లవీ (చక్రవర్తి)కు ఇరాన్ పాలన పగ్గాలు  అప్పగించాయి. అయితే  షా హయాంలో చమురు సంపద మొత్తం కొందరి చేతుల్లోకి వెళ్లింది. అలాగే, ప్రజలపై విపరీతమైన నిఘా, ఇస్లామిక్ సంప్రదాయాలను పక్కనపెట్టడం లాంటివి ఇరాన్ ప్రజలకు నచ్చలేదు. దీంతో  1979లో అయతుల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటులో భాగంగా టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని అందులోని 52 మంది అమెరికన్లను 444 రోజులపాటు బందీలుగా ఉంచుకున్నారు. నాటి నుంచి అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్‌తోనూ విభేదాలు తలెత్తాయి.  

ఇరాన్ ను కట్టడి చేయాలని..

ఇరాన్‌ విషయంలో అమెరికా జోక్యానికి కారణాలు లేకపోలేదు. చమురు నిల్వలు అత్యధికంగా ఉన్న పశ్చిమాసియాలో చైనా, రష్యాల ప్రాబల్యం పెరగడం అమెరికాకు ఇష్టం లేదు. అలా అయితే అమెరికా అగ్రరాజ్య హోదాకు గండిపడుతుందని వారి భయం. అందుకే ఆ రెండు దేశాలు అక్కడ పాగా వేయకుండా ఉండడానికి అమెరికా ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం  ప్రయత్నిస్తోంది. అయితే ఇది ఇరాన్‌కు నచ్చడం లేదు. అదే సమయంలో లెబనాన్, సిరియా, యెమెన్ లాంటి దేశాల్లో అమెరికాను వ్యతిరేకించే  తీవ్ర వాడ గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇవ్వడం.. ఇజ్రాయెల్‌కు వ్యతిరేక గ్రూపులకు టెహ్రాన్ సపోర్ట్ చేయడం అమెరికాకు నచ్చలేదు. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఇరాన్ రూపొందిస్తున్న ఖండాంతర క్షిపణులతో తనకు ముప్పు పొంచి ఉందని అమెరికా భావిస్తోంది. టెహ్రాన్ చేతికి అణ్వాయుధాలు వెళ్లడం తనకు ప్రమాదకరమనే భయం అమెరికాకు ఉంది. దాన్ని ఆపడం కోసం 2015లో అమెరికాతోపాటు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ కలిసి ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ఉద్దేశం ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడం. అయితే  2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటకొచ్చేశాడు.

ఏ ఒప్పందం లేకుండా పోవడంతో ఇరాన్‌ అణ్యాయుధాల తయారీకి ప్రయత్నించింది. ఇది సహజంగానే ఇజ్రాయెల్‌ను ఆందోళనకు గురి చేశాయి. దానితో పాటు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హమాస్, హెజ్బొల్లా లాంటి ఉగ్ర సంస్థలకు ఇరాన్ మద్దతు ఇవ్వడం కూడా ఒక కారణం. ఒకవేళ ఇరాన్‌ న్యూక్లియర్ బాంబు తయారు చేస్తే తన మనుగడకే ముప్పు అని ఇజ్రాయెల్ కు భయం పట్టుకుంది.  దీంతో 2025 జూన్‌లో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్‌కు రక్షణ పరంగా బలమైన మిత్రదేశమైన అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై యూఎస్ దాడులు చేసింది. ఆ తర్వాత 2025 జూన్ 24న ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించారు. అయినా ఇరాన్‌ అణ్వాయుధాల తయారీని ఆపలేదు. అంతేకాక తనను హతమార్చడానికి ఇరాన్ కుట్ర పన్నిందని, దీని వెనుక ఖమేనీ హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. అంతేగాకుండా.. ఇరాన్‌లోని ఇస్లామిక్ ప్రభుత్వాన్ని గద్దె దింపి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌లో ఖమేనీ పాలనకు చరమగీతం పాడటమే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడులు ప్రారంభించాయి.

డాలర్లలో మాత్రమే అయిల్ అమ్మకాలు
 
మరోవైపు 1970ల్లో సౌదీ అరేబియా, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం  ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ అమ్మకాలు డాలర్లలో మాత్రమే జరగాలి. దీని వల్ల చమురు అవసరం అయినా  ప్రతి దేశానికి డాలర్లు అవసరం అయ్యాయి. ఫలితంగా డాలర్‌కు డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఆ తర్వాత చాలా దేశాలు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకున్నాయి. దీంతో అమెరికాపై రుణభారం పెరిగింది.  డాలర్ బలహీనపడటం మొదలైంది. దీంతో సౌదీ కూడా  చైనా లాంటి దేశాలకు ఇతర కరెన్సీల్లో చమురు అమ్మడానికి ముందుకు వచ్చింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అమెరికా డాలర్‌కు డిమాండ్ తగ్గిపోయి.. ఆ దేశం అగ్రరాజ్యం హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా ఇరాన్ ఉత్పత్తి చేసే చమురులో 90 శాతానికిపైగా చైనానే కొనుగోలు చేస్తోంది, అది కూడా డాలర్లలో కాకుండా ఆ దేశపు కరెన్సీలో. అమెరికా ఆంక్షలతో డిస్కౌంట్ ధరలకే చైనాకు ఇరాన్ చమురును అమ్ముతుంది.. మరో వైపు ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఇరాన్ తక్కువ ధరకే డ్రోన్లు, క్షిపణులు సరఫరా చేస్తోంది. ఇవన్నీ అమెరికాకు నచ్చడం లేదు. దీంతో యుద్ధం మొదలుపెట్టింది. కానీ, ఇరాన్‌ వెనుకడుగు వేయకపోవడంతో అగ్రరాజ్యం ఒకరకంగా భయంతో తనే యుద్ధం విరమించే ప్రయత్నం మొదలు పెట్టింది.

అమెరికాకు చుక్కలు చూపిస్తూ..

 ఖమేనీ హత్య తరువాత ఇరాన్‌ పరిస్థితి ఇక ముగిసిన అధ్యాయమే అనుకున్నారంతా.. కానీ, ఆ వాదన తప్పు అని నిరూపిస్తూ ఇరాన్‌ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్‌ పై వరుస దాడులతో చెలరేగిపోతోంది. కేవలం దాడులతోనే కాదు మాటలతోనూ అమెరికాకు భయం పుట్టిస్తుంది. ఇరాన్‌ సైనిక శక్తిని పూర్తిగా దెబ్బకొట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకుంటుంటే, తమను తక్కువ అంచనా వేయొద్దని అమెరికా --ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది.. ఇంకా ముందుకు వెళ్తూ యుద్ధాన్ని ముగించేది మీరు కాదు.. మేం అంటూ ట్రంప్‌కు గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది. తాము చేసే యుద్ధం ఒక నెల, రెండు నెలలు కాదు..పదేళ్లు అయినా యుద్ధం చేసే సామర్థ్యం తమకుఉందని స్పష్టం చేసింది. ఆ రెండు దేశాలే తమ శత్రువులని, కానీ, వారికి మద్దతిచ్చే వారు కూడా తమ శత్రువులేననే చెబుతూ గల్ఫ్ దేశాలపై కూడా యుద్ధం ప్రకటించింది. తాడోపేడో తేల్చుకుంటామన్న స్థితిలో ఉన్న ఇరాన్‌.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ట్రంప్‌ ఏదో రకంగా యుద్ధాన్ని ఆపొచ్చు.. కానీ ఇరాన్‌ ఎవరు చెబితే వింటుంది అనేది మాత్రం ఎవరికి అంతుపట్టని సమస్య. 
 
ఇరాన్‌తో యుద్ధం: అమెరికాకు తడిచి మోపడవుతున్న ఖర్చులు

ఇరాన్‌ తో యుద్ధం అమెరికాను తీవ్ర నష్టాల్లోకి నెట్టింది.యుద్ధం మొదలైన తొలి 24 గంటల్లోనే అమెరికా సుమారు 779 మిలియన్ డాలర్లు (దాదాపు ₹7,000 కోట్లు) ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి.​కేవలం దాడులకే కాకుండా, యుద్ధ నౌకల నిర్వహణకు అమెరికా భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి ఒక్కో యుద్ధ విమాన వాహక నౌక నిర్వహణకే రోజుకు 6.5 మిలియన్ డాలర్లు (సుమారు ₹59 కోట్లు) ఖర్చవుతుందట. యుద్ధానికి ముందే బలగాల మోహరింపు కోసం మరో ₹5,700 కోట్లకు పైగా వెచ్చించినట్లు రక్షణ నిపుణులు చెబుతున్నారు.

దీనివల్ల అమెరికాకు ​ఆర్థిక భారంతో పాటు సాంకేతిక నష్టం కూడా అమెరికాను కలవరపెడుతోంది.​కువైట్‌లో అమెరికాకు చెందిన మూడు యుద్ధ విమానాలు కూలిపోవడం పెద్ద దెబ్బగా మారింది.​ఉక్రెయిన్, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో ఇప్పటికే క్షిపణి నిరోధక వ్యవస్థలను మోహరించిన నేపథ్యంలో, ఇరాన్ యుద్ధంలో ఆయుధాలను కోల్పోవడం అమెరికా రక్షణ సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.​2023 అక్టోబరులో హమాస్ దాడి తర్వాత నుంచి ఇప్పటివరకు పశ్చిమాసియాలో అమెరికా చేసిన మొత్తం ఖర్చు సుమారు 33.77 బిలియన్ డాలర్లకు (దాదాపు ₹3.1 లక్షల కోట్లు) చేరినట్లు బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం మరో 4-5 వారాలు కొనసాగవచ్చని ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఆర్థిక భారం అమాంతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదంతా జరిగితే అమెరికా పూర్తిస్థాయిలో నష్టాలను మూట గట్టుకోక తప్పదు.

పెద్దన్న పాత్రకు ఎసరు

రెండు మూడువారల్లో ఇరాన్ పై అధిపత్యం సాధిస్తామని ఆశించిన అమెరికాకు ఇరాన్‌ ఎదురుదాడి దిమ్మదిరిగేలా చేసింది. ఆర్థికభారంతోనో, లేక సైనిక నష్టంతోనో, ఆయుధాలు కోల్పోవడం మూలంగానో అమెరికా  యుద్ధం ముగిస్తే ప్రపంచంలో మరే దేశం కూడా అమెరికాకు భయపడదు. ఇక చిన్న దేశం చేతిలో ఒటమి పాలైందన్న అపవాదును మూటకట్టుకుంటుంది. లేదని యుద్ధాన్ని కొనసాగిస్తే అన్ని రకాలుగా తీవ్రంగా నష్టపోయేది అమెరికానే. దీంతో ట్రంప్‌ తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. మరోవైపు దేశంలోని పౌరుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అలాగే చమురు, గ్యాస్ ఎగుమతులు నిలిచిపోవడంతో ఆయా దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు అమెరికాపై ఒత్తడి తీసుకొచ్చి యుద్ధాన్న ఆపేలా చేస్తే ఆ తర్వాత చిన్న దేశం కూడా అమెరికాకు భయపడే అవకాశం లేదు. అంతేకాదు అమెరికా యుద్ధం ముగిద్దామనుకున్నా ఇరాన్‌ యుద్ధం ముగించేందుకు సిద్ధంగా లేదు. అగ్రరాజ్యానికి తన సత్తా చూపించే వరకు అది వెనుకకు తగ్గే అవకాశం లేదు. దీంతో అమెరికా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి ఉంది. ఇపుడు అమెరికా ముందున్న పరిస్థితి పెద్దన్న పాత్రను కొనసాగించుకోవడమా? లేక యుద్ధం ముగించి శాంతి స్థాపనకు కృషి చేయడమా అన్నది ఆ దేశం చేతిలోనే ఉంది.

Advertisment
తాజా కథనాలు